కామారెడ్డి/పిట్లం, వెలుగు : కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో జోరుగా హుషారుగా సాగింది. ఆదివారం రాత్రి పెద్దకొడప్‌గల్‌లో బస చేసిన రాహుల్ సోమవారం ఉదయం 6.30 గంటలకు బిచ్కుంద మండలం పత్లాపూర్‌లో యాత్ర ప్రారంభించారు. రాహుల్‌తో జాతీయ, రాష్ట్ర, స్థానిక నాయకులు అడుగులో అడుగేస్తూ ముందుకు సాగారు. కందర్‌పల్లి, రాజుల్లా గేట్ మీదుగా తొమ్మది గంటల వరకు షేకాపూర్ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యాంపు వరకు సాగింది. సాయంత్రం వరకు జాతీయ, రాష్ట్ర నేతలతో సమావేశాలు నిర్వహించారు. నేతలు రావడంతో సందడిగా మారింది. సాయంత్రం 5 గంటలకు కళాకారులు ప్రదర్శనలతో తిరిగి యాత్ర సాగింది. అనంతరం మేనూర్ వద్ద బహిరంగ సభలో రాహుల్ గాంధీ మాట్లాడారు. అనంతరం రాష్ట్ర సరిహద్దు మహరాష్ట్రలోకి జోడో యాత్ర ప్రవేశించింది. ఈ సందర్భంగా జోడో యాత్రకు తెలంగాణ నాయకులు, ప్రజలు ఘనంగా వీడ్కోలు పలికారు.
కార్యక్రమంలో యాత్ర ఇన్‌చార్జి జైరాం రమేశ్, దిగ్విజయ్ సింగ్, రాష్ట్ర పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, సీనియర్ షబ్బీర్ అలీ, డీసీసీ ప్రెసిడెంట్ కైలాష్ శ్రీనివాస్‌రావు, భట్టి విక్రమార్క, వి. హనుమంతరావు, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మధు యాష్కీ గౌడ్, వడ్డేపల్లి సుభాష్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, ములుగు ఎమ్మెల్యే సీతక్క, జుక్కల్ నాయకులు గుడుగు గంగాధర్, గంగారాం స్థానిక నాయకులు పాల్గొన్నారు.
ధన ప్రవాహంతోనే టీఆర్ఎస్ గెలుపు
మద్యం, ధన ప్రవాహంతోనే మునుగోడులో టీఆర్ఎస్ విజయం సాధించిందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. భారత్ జోడో యాత్రలో భాగంగా సోమవారం కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మునుగోడులో విచ్చలవిడిగా డబ్బు, మద్యం పారించాయన్నారు. రాష్ట్రంలో రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడో యాత్రకు మంచి స్పందన వస్తోందన్నారు.
ఢిల్లీకో సుల్తాన్.. తెలంగాణకో సుల్తాన్...
ఢిల్లీకో సుల్తాన్, తెలంగాణకో సుల్తాన్ ఉన్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, సీఎం కేసీఆర్‌పై మాజీ మంత్రి షబ్బీర్‌అలీ విమర్శించారు. వీరిద్దరు కలిసి దేశాన్ని, రాష్ర్టాన్ని నాషనం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికలు అంటేనే ధనం అనే విధంగా బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీలు తయారు చేశాయన్నారు.