రాహుల్ కు ఈడీ మరోసారి సమన్లు

రాహుల్ కు ఈడీ మరోసారి సమన్లు

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు మరోసారి సమన్లు జారీ చేశారు. అయితే.. తేదీని మార్చారు. జూన్ 08వ తేదీన హాజరు కావాలని ఆయనతో పాటు సోనియా గాంధీకి సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. కానీ.. తాను విదేశీ పర్యటనలో ఉన్నట్లు.. దీని కారణంగా.. తేదీని మార్చాలని దర్యాప్తు సంస్థను కోరారు. తాను జూన్ 05వ తేదీన భారత్ కు రానున్నట్లు తెలిపారు. దీంతో ఈడీ అధికారులు కొత్తగా సమన్లు జారీ చేశారు. జూన్ 13వ తేదీన హాజరు కావాలని సమన్లలో సూచించారు. మరోవైపు.. ఈడీ ఎదుట విచారణకు హాజరు కావాల్సిన సోనియా గాంధీ కరోనా వైరస్ బారిన పడ్డారు. జూన్ 08వ తేదీన ఢిల్లీలోని ఫెడరల్ ఏజెన్సీ ఎదుట సోనియా హాజరవుతారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె హోం ఐసోలేషన్ లో ఉంటూ.. కరోనాకు చికిత్స తీసుకుంటున్నారని కాంగ్రెస్ ప్రధాన అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, పవన్ బన్సాల్ ను ఈడీ ప్రశ్నించిన విషయం తెలిసిందే.


1938లో కాంగ్రెస్ లోని కొంతమందితో కలిసి జవహర్ లాల్ నెహ్రూ నేషనల్ హెరాల్డ్ న్యూస్ పేపర్‌‌ను ప్రారంభించారు. దీనిని అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ అనే సంస్థ పబ్లిష్ చేసేది. కాలక్రమేణా ఈ పేపర్ కాంగ్రెస్ పత్రికగా ముద్ర వేసుకుంది. స్వాతంత్య్రం తర్వాత కాంగ్రెస్ అధికార న్యూస్ పేపర్ గా చలామణి అయింది. అయితే తీవ్ర నష్టాల కారణంగా 2008లో ఈ పేపర్ ను మూసివేశారు. పబ్లిక్ సంస్థ అయిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్(AJL)ను యంగ్ ఇండియా లిమిటెడ్ (YEL) అనే ప్రైవేట్ సంస్థకు అప్పనంగా కట్టబెట్టారని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి గతంలో ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి సోనియా, రాహుల్‌ సహా ఏడుగురిపై ఢిల్లీలోని అడిషనల్‌ చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో స్వామి కేసు దాఖలు చేశారు. ఏజేఎల్ కు చెందిన నేషనల్ హెరాల్డ్ పత్రికను కూడా వైఈఎల్ సొంతం చేసుకుందని... ఈ క్రమంలోనే దాదాపు రూ.2వేల కోట్ల విలువైన ఏజేఎల్ ఆస్తులను రాహుల్ గాంధీ డైరెక్టర్ గా ఉన్న వైఈఎల్ సంస్థ అక్రమంగా పొందిందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక బకాయి ఉన్న రూ.90.25 కోట్లను వసూలు చేసుకునే హక్కును పొందేందుకు యంగ్‌ ఇండియన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ద్వారా నేరపూరితమైన కుట్రపన్నారని సుబ్రహ్మణ్యస్వామి తన ఫిర్యాదులో ఆరోపించారు. కేవలం రూ.50 లక్షల చెల్లించి ఆ హక్కును పొందేందుకు ప్రయత్నించారని అన్నారు. ఈ కేసు విషయమై 2014లో ఈడీ విచారణ చేపట్టింది. 

మరిన్ని వార్తల కోసం : -
భారత్‌‌పై మళ్లీ కరోనా పంజా


స్పెల్లింగ్ బీ పోటీల్లో సత్తా చాటిన హరిణి లోగన్