కాంగ్రెస్ పార్టీ లేదా దాని నేతృత్వంలోని కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తే ప్రధాన మంత్రి అభ్యర్థిగా మొదటి వరుసలో ఉండే వ్యక్తి రాహుల్‌గాంధీ. అలాంటి వ్యక్తి నుంచి దేశ సమస్యలపై అవగాహన, అంతర్జాతీయ వేదికలపై దేశ గౌరవాన్ని కాపాడుకోవాలనే ఇంగిత జ్ఞానం, ప్రసంగాల్లో హుందాతనం జన బాహుళ్యం కోరుకోవడంలో తప్పు లేదు. కొన్ని సందర్భాల్లో భావోద్వేగాలకు లోనుకావడం సహజం. అందరూ వాజ్ పేయిలా సున్నితమైన విమర్శలతో, చమత్కారాలతో, హుందాగా ప్రసంగించాలని కోరుకోవడం అత్యాశ అవుతుంది. చట్ట సభల్లోనే వివిధ అంశాలపై చర్చల్లో ప్రమాణాలు నానాటికీ తీసికట్టు అన్నట్లుగా తయారవుతున్నాయి. అధ్యక్షా.. అని సంబోధించడంతోను, వ్యక్తిగత విమర్శలు, నిందారోపణలు, దూషణలతోనే విలువైన కాలం గడిచిపోతోంది. అలాంటి సందర్భాల్లో నోరుజారినా తర్వాత క్షమాపణలు కోరడం ఆ వక్త వ్యక్తిత్వానికి వన్నె తెస్తుంది. చట్ట సభల్లో స్పీకర్ ఉంటారు కాబట్టి అవసరమైతే సదరు వ్యక్తిని మందలిస్తారు.బహిరంగ సభల్లో అటువంటి అవకాశం లేదు.
ఆ రకమైన మంచి లక్షణం లేకపోబట్టే, రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వాన్ని కోల్పోవాల్సి వచ్చింది. మోదీ ఇంటిపేరు ఉన్నవారందరినీ దొంగలుగా కించపరుస్తూ వ్యాఖ్యానించి.. చాలా కాలమైనా వాటి పర్యవసానాల నుంచి బయటపడలేకపోతున్నారు. సూరత్ కోర్టు ఆ వ్యాఖ్యలకు సంబంధించి రాహుల్ కు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. బెయిల్ మంజూరు చేసి, పైకోర్టులకు విన్నవించుకునే అవకాశం కల్పించింది. కానీ, గరిష్టంగా రెండేళ్ల జైలు శిక్షపడడంతో రాహుల్ లోక్ సభ సభ్యత్వాన్ని కోల్పోయారు. ఆ తీర్పును సవాల్ చేస్తూ ఆయన చేసుకున్న అప్పీలును కూడా గుజరాత్ హైకోర్టు తిరస్కరించింది. రాహుల్ గాంధీ గుజరాత్ హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్లారు. మోదీలపై వ్యాఖ్యలకుగాను రాహుల్ పై పరువు నష్టం దావా వేసిన గుజరాత్ బీజేపీ మాజీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ తిరిగి సుప్రీం కోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. అంటే, ఈ కేసులో రాహుల్ వాదనలను సుప్రీం వినదలిస్తే, పూర్ణేశ్ వాదనలను కూడా తిరిగి వినాల్సి ఉంటుంది. రాహుల్ చేసుకున్న అప్పీలును సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. న్యాయమూర్తులు బి.ఆర్. గవాయ్, ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ కేసు విచారణను ఆగస్టు నాలుగో తేదీకి వాయిదా వేసింది. కోర్టు మెట్లు ఎక్కి దిగుతున్న రాహుల్ లో పరివర్తన ఏమీ లేదని ఆయన వీర్ సావర్కర్ పై ఆమధ్య చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు మరోసారి ప్రపంచానికి వెల్లడించాయి.
మార్పు రావాలి
“అది నీరవ్ మోదీ కానివ్వండి లలిత్ మోదీ లేదా నరేంద్ర మోదీ కానివ్వండి. దొంగలందరికీ మోదీ అనే ఒకే ఇంటిపేరు ఎలా ఉంటుందబ్బా?” అని రాహుల్ 2019 లోక్ సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కర్ణాటకలోని కోలార్ లో ఏప్రిల్ 13న వ్యాఖ్యానించారు. ఆర్థిక మోసాలకు సంబంధించి నీరవ్, లలిత్ లు పరారీలో ఉన్న మాట వాస్తవమే. కానీ, మోదీలందరినికీ ఒకే గాటనకట్టడం రాహుల్ చేసిన తప్పు. “నింద ప్రారంభమైన తోడనే చిత్తము వికలమగును: బుద్ధి భ్రమించును, సారాసార వివేకము నిద్రించును, హేతువాదము సున్నయగును: న్యాయము లోపించును: సత్యమడుగంటును: మానుషత్వము మాయమై క్రూరమృగత్వము సంప్రాప్తించును!" అని కొమర్రాజు వేంకట లక్ష్మణరావు ఏనాడో హెచ్చరించారు. నిరాధార ఆరోపణలు చేయడాన్ని రాజకీయ నాయకులు ఇకనైనా మానుకోవాలి. ఎంత ఎక్కువగా తిడితే అంత ఎక్కువగా తమదే పైచేయి అనుకోవడం అవివేకం. ఎవరైనా సరే, సభ్యత, సంస్కారాలను దృష్టిలో పెట్టుకుని ప్రసంగాలు సాగించాలి. వ్యక్తిగత ఆక్షేపణలకు దిగకుండా విధానాలపై చర్చించాలి. ఇది రాహుల్ కే కాదు, బీజేపీతో సహా అన్ని రాజకీయ పార్టీల నాయకులకు వర్తిస్తుంది. ‘మోడీ ఓ కిలాడీ.. ఏందయ్యా నీ గడిబిడి.. అన్నదాతలతో ఆడుతున్నావ్ కబాడీ.. దేశాన్ని అమ్ముతున్నావ్ చేసి పకోడి, అన్నదాతల ఉసురు తగిలి పోతావ్ పురుగులు పడి, చాయ్ వాడినంటివి.. చౌకీదారు నంటివి.. నమ్మి అప్పజెబితే దేశాన్నే అమ్మబడితివి’ లాంటి సంస్కార హీనమైన పాటలు పాడుతూంటే ఓ రాష్ట్ర సీఎం వేదికపై నవ్వుతూ తలూపడాన్ని ఎలా చూడాలి? అలాంటి పాటలు ఆ ముఖ్యమంత్రిపై కట్టి ప్రత్యర్థి పార్టీవారు పాడినా అదీ తప్పే. తమ వాదనలో పస లేనప్పుడే నాయకులు చౌకబారు పాటలను ఆశ్రయిస్తారు. సీనియర్ నాయకుల తీరే అలా ఉంటే, ఇక వారి నుంచి యువ నాయకులు నేర్చుకునేది ఏముంటుంది? రాహుల్ పై పునీత్ వేసిన దావా, దానికి కింది కోర్టు విధించిన శిక్ష విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చే ఆదేశాలైనా రాజకీయ నాయకులకు కనువిప్పు కలిగిస్తాయా? చూడాలి.
అవకాశమిస్తున్న ఈసీ
రాహుల్ లోక్ సభ సభ్యత్వం ఈ ఏడాది మార్చి 23న రద్దు అయినందు వల్ల ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కేరళలోని వాయనాడ్ నియోజకవర్గానికి ఎన్నికల కమిషన్(ఈసీ) ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. పదిహేడవ లోక్ సభ గడువు ముగియడానికి ఏడాదికి పైగా వ్యవధి ఉన్నందు వల్ల వచ్చే సెప్టెంబర్ 22 నాటికి వాయనాడ్ ఉప ఎన్నికను ఈసీ నిర్వహించాలి. కానీ, రాహుల్ న్యాయపరమైన పరిష్కారాన్ని అన్వేషించుకునేందుకు వీలుగా ఈసీ ఆయనకు తగినంత గడువు ఇస్తూ వస్తోంది. గతంలో లక్షద్వీప్ ఎంపీ మహమ్మద్ ఫైజల్ ఖాన్, హత్యాయత్నం కేసులో దోషిగా తేలినపుడు ఈసీ ఉప ఎన్నిక ప్రకటించింది. కానీ, కేరళ హైకోర్టు ఆ తర్వాత, ఫైజల్ పై దోషిత్వాన్ని పక్కనపెట్టడంతో ఈసీ ఎన్నికల నోటిఫికేషన్ ను ఉపసంహరించుకుంది. ఈసారి ఈసీ వేచిచూసి వ్యవహరించే ధోరణిని అనుసరిస్తోంది. తనకు విధించిన రెండేళ్ల జైలు శిక్షను సస్పెండ్ చేయాలని, అలాగే, తనను దోషిగా ప్రకటించడాన్ని కూడా సస్పెన్షన్ లో ఉంచాలని సెషన్స్ కోర్టులో రాహుల్ రెండు అప్పీళ్లు దాఖలు చేసుకున్నారు. కానీ, వాటిని కోర్టు ఆ తర్వాత తోసిపుచ్చింది. రాహుల్ కు పడ్డ రెండేళ్ల జైలు శిక్షా కాలం తగ్గితే, ఆయనను లోక్ సభ సభ్యుడిగా అనర్హుడిగా ప్రకటించడానికి ఉండదు. రాహుల్ కు విధించిన శిక్షపై సుప్రీం కోర్టు స్టే మంజూరు చేసినా, శిక్ష తగ్గించినా కూడా ఉప ఎన్నిక అవసరం ఉండదు. వచ్చే రెండున్నర నెలల్లో ఏదో ఒకటి తేలకపోతే వాయనాడ్ కు ఉప ఎన్నిక తప్పకపోవచ్చు.
సావర్కర్ పైనా వ్యాఖ్యలు చేసి..
సావర్కర్ పై వ్యాఖ్యలకు సంబంధించి కూడా రాహుల్ పై వివిధ కోర్టుల్లో దావాలు దాఖలయ్యాయి. గుజరాత్ హైకోర్టు తీర్పు అంతకు ముందు సూరత్ సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పు మాదిరిగానే ఉందని రాహుల్ తరఫున వాదిస్తున్న అభిషేక్ సింఘ్వీ వ్యాఖ్యానించారు. రాహుల్ చేసిన వ్యాఖ్యల వల్ల పూర్ణేశ్ ప్రతిష్టకు వాటిల్లిన నష్టం ఏమిటి? రాహుల్ ఆక్షేపిస్తూ చేసిన వ్యాఖ్యలో దురుద్దేశం ఏముంది? రాహుల్ వ్యాఖ్య వల్ల పిటిషనర్ కు వాటిల్లిన నష్టం ఏమిటి? అని అభిషేక్ ప్రశ్నిస్తున్నారు. నిర్వచనానికి లొంగని, రూపురేఖలు లేని వర్గానికి పరువు నష్టం వాటిల్లిందని ఎలా రుజువు చేస్తారు? దాదాపు12 కోట్ల మంది ఉన్నారని చెబుతున్న వర్గంలో (మోదీ ఇంటిపేరు గలవారిలో) ఎవరో ఒకరు పరువు నష్టం వాటిల్లిందని ఎలా దావా వేస్తారు? అని కూడా అభిషేక్ వాదిస్తున్నారు. అయితే, “రాహుల్ ను దోషిగా తేల్చిన ప్రస్తుత అంశం తీవ్రమైనది. సమాజంలోని ఒక అత్యధిక వర్గంపై ప్రభావం చూపేది. దాన్ని ఎంత తీవ్రమైన మోతాదుతో చూడాల్సిన అవసరం ఉందో ఈ కోర్టు అంతే తీవ్రతతో ఈ కేసును వీక్షించాల్సి ఉంటుంది” అని హైకోర్టు పేర్కొంది.
- మల్లంపల్లి ధూర్జటి, సీనియర్ జర్నలిస్ట్