- కేసీఆర్ తిన్న డబ్బులు కక్కిస్తం : రాహుల్ గాంధీ
- వాటిని పేదలకు తిరిగి ఇచ్చేస్తం
- కాళేశ్వరం నిర్మాణంలో లక్ష కోట్ల అవినీతి
- పిల్లర్లు కూలుతుంటే కేసీఆర్ సమీక్ష చేయరేం
- 2040 వరకు ప్రతి కుటుంబంపై రూ. లక్ష అప్పు
- ఇట్లా పాలించేదాన్నే దొరల సర్కారు అంటరు
కల్వకుర్తి/హైదరాబాద్ : కేసీఆర్ తిన్న అవినీతి సొమ్మును కక్కిస్తామని, వాటిని తిరిగి పేదలకు ఇచ్చేస్తామని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఇవాళ కల్వకుర్తిలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుడతూ.. తెలంగాణ కోసం ప్రజలు ఎన్నో కలలు కన్నారని, అలాంటి తెలంగాణలో కేసీఆర్ రాజులా ప్రజలపై పెత్తనం చెలాయిస్తున్నారని విమర్శించారు. డబ్బులు వచ్చే శాఖలన్నీ వాళ్ల కుటుంబం వద్దే పెట్టుకున్నారని మండిపడ్డారు. లిక్కర్, ఇసుక, భూమి ఇలా అన్ని శాఖలు ఆ కుటుంబం ఆధీనంలోనే ఉన్నాయన్నారు.
పోరాడి సాధించుకున్న తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలు పెంచి పెంచి.. లక్ష కోట్ల రూపాయలు దోచుకున్నారని దుయ్యబట్టారు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్లు ఒకటి తర్వాత ఒకటి కూలుతున్నాయని, వాటిపై సమీక్షించేందుకు ఆయన వెళ్లడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేసిన అప్పుల కారణంగా 2040 వరకు ప్రతి కుటుంబంపై రూ. లక్ష అప్పు ఉంటుందన్నారు. తామూ నాగార్జున సాగర్, శ్రీరాంసాగర్, ప్రియదర్శినీ జూరాల, సింగూరు ప్రాజెక్టులు నిర్మించామని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం ఆదివాసీలు, గిరిజనులు, దళితులకు భూము పంపిణీ చేసిందన్నారు. అందుకే పేదలకు ఇందిరమ్మతో, కాంగ్రెస్ తో విడదీయరాని బంధం ఉంటుందని చెప్పారు.
కేసీఆర్ ప్రభుత్వం ధరణి పోర్టల్ ఏర్పాటు చేసి పేదల భూములు లాక్కుంటున్నదని ఆరోపించారు. ఇప్పటి వరకు ధరణి పోర్టల్ కారణంగా 20 లక్షల మంది రైతులు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఒక కల్వకుంట్ల కుటుంబానికే లాభం జరిగిందన్నారు. అందుకే కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. కేసీఆర్ దోచుకున్న డబ్బులను పేదలకు తిరిగి ఇచ్చేస్తామని చెప్పారు. తాను నరేంద్ర మోదీని కాదని, మాట ఇస్తే తప్పనని అన్నారు. మోదీ ప్రతి కుటుంబం ఖాతాలో రూ. 15 లక్షలు వేస్తానని చెప్పి మోసం చేశారన్నారు.
పేదల ఖాతాల్లోకి డబ్బులు రాలేదు కానీ అదానీ అకౌంట్లలో లక్షల కోట్లు చేరాయన్నారు. ‘మనది రాజకీయ బంధం కాదు.. కటుంబ పరమైన బంధం మన మధ్య ఉంది.. ఈ సంబంధం.. జవహర్ లాల్ నెహ్రు, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియాగాంధీ, ప్రియాంకా గాంధీతో తరతరాలుగా ఉన్నది. మనది కుటుంబం బంధం చెప్పింది చేసి చూపిస్తం.. కేసీఆర్ దోపిడీ చేసిన డబ్బులను మీ ఖాతాల్లో వేయిస్తం’. అని అన్నారు. ఈ ఎన్నికలు బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే జరుగుతున్నాయని, బీఆర్ఎస్, బీజేపీ,ఎంఐఎం కలిసి పనిచేస్తున్నాయని అన్నారు. పార్లమెంటులో బీజేపీ ప్రతి బిల్లుకు బీఆర్ఎస్ సపోర్ట్ చేసిందని గుర్తు చేశారు. మోదీ ప్రభుత్వం తన మీద 24 కేసులు పెట్టిందని, నా లోక్ సభ సభ్యత్వం రద్దు చేసిందని, ప్రభుత్వం ఇచ్చిన క్వార్టర్ లాక్కున్నదని అన్నారు. ప్రభుత్వం క్వార్టర్ లాక్కున్నా పరవాలేదని ఇచ్చేశానన్నారు.
దేశమంతా నా ఇల్లు.. తెలంగాణ మొత్తం నా ఇల్లు.. అవసరమైతే కోట్లాది మంది నన్ను ఇంట్లో పెట్టుకొని చూసుకుంటారని అన్నారు. బీజేపీ ప్రభుత్వం పోరాడే వారిపై కేసులు పెడుతుందన్నారు. బీఆర్ఎస్ పై, కేసీఆర్ పై ఎలాంటి కేసులూ పెట్టలేదన్నారు. సీబీఐ,ఐటీ,ఈడీ విచారణలే ఉండవని చెప్పారు. ఎందుకంటే కేసీఆర్, మోదీ కలిసే పని చేస్తున్నారని విమర్శించారు. గొడవ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే ఉందన్నారు.
2 శాతం ఓట్లతో బీసీ సీఎంని ఎలా చేస్తరు
‘బీజేపీ నాయకులు ఓబీసీ ముఖ్యమంత్రిని పెడ్తామని చెప్తున్నారు.. వాళ్లకు 2% ఓట్లే వస్తాయి.. వాటితో ముఖ్యమంత్రిని ఎలా చేస్తరు.. ప్రధాని మంత్రి అమెరికా లో ఓబీసీని ప్రెసిడెంట్ గా పెడ్తా అన్నట్టుగా ఉంది.. మీరు అమెరికాలో ప్రెసిడెంట్ ను చేయలేరు.. ఇక్కడ సీఎంను కూర్చోబెట్టలేరు.. ఉల్టా, సీదా మాటలు మాట్లాడుతున్నరు.. ఎక్కడైనా కాంగ్రెస్ పోటీచేస్తే.. అక్కడికి ఎంఐఎం వచ్చి పోటీ చేస్తది. ఎంఐఎంకు సంబంధం లేని దగ్గర కూడా అభ్యర్థులు పుట్టుకొస్తరు. ఎంఐఎం వారికి బీజేపీ డబ్బులు ఇస్తుంది. ఎంఐఎం, బీజేపీ, బీఆర్ఎస్ మూడు ఒక్కటే. ఏవిధంగా తెలంగాణలో బీజేపీ టైర్లు పంక్చర్ చేశామో.. దేశం మొత్తం మీద పంక్చర్ చేస్తం.. 2024లో దేశంలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది.. ఇక్కడ బీఆర్ఎస్ ను ఓడిద్దాం.. ఇక్కడి నుంచి ఢిల్లీలో బీజేపీని ఓడిద్దాం.’అని రాహుల్ గాంధీ అన్నారు.