న్యూఢిల్లీ: జార్ఖండ్లో మహిళలకు ప్రతి నెలా రూ.2,500 ఆర్థిక సాయం అందజేస్తామని కాంగ్రెస్ లీడర్, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. బీజేపీ ప్రభుత్వం తన బిలియనీర్ స్నేహితులకు ఇచ్చినదాని కంటే ఎక్కువగా మహిళలు, యువత, రైతులు, పేదల అవసరాల తీర్చేందుకు తాము కేటాయిస్తామని ఆయన మంగళవారం ట్వీట్ చేశారు. సంక్షేమానికే తాము తొలి ప్రాధాన్యం ఇస్తామన్నారు. జార్ఖండ్లో మయ్యా సమ్మాన్ యోజన కింద ఇప్పటివరకు ప్రతి నెలా ఇస్తున్న రూ.1,000 ఆర్థిక సాయాన్ని రూ.2500కు పెంచుతామన్నారు.
పెంపు వచ్చే నెల నుంచే అమలు చేస్తామన్నారు. ఈ పథకం ద్వారా జార్ఖండ్ లో ప్రతి నెలా 53 లక్షల మంది మహిళలు లబ్ధి పొందుతున్నారు. ఆర్థికంగా వెనకబడిన వర్గానికి చెందిన ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో బతికేందుకు ఈ పథకం సాయపడుతుందని రాహుల్ పేర్కొన్నారు. అందుకే ఆర్థిక సాయాన్ని మరింత పెంచాలని నిర్ణయించామన్నారు. జార్ఖండ్లో కాంగ్రెస్, జార్ఖండ్ ముక్తి మోర్చా కూటమి ప్రస్తుతం అధికారంలో ఉంది. 81 సీట్లున్న రాష్ట్ర అసెంబ్లీకి మొదటి దశ ఓటింగ్ నవంబర్ 13న, రెండో దశ పోలింగ్ 20న జరగనుంది. ఫలితాలు నవంబర్ 23న వెలువడనున్నాయి.