సామాజిక తెలంగాణనా.. దొరల  తెలంగాణనా?: రాహుల్​

ఏది కావాల్నో ప్రజలే నిర్ణయించుకోవాలి: రాహుల్​
కల్వకుంట్ల కుటుంబం చేతుల్లో రాష్ట్రం బందీ
భూకబ్జాలు, మైనింగ్​ మాఫియాలు పెరిగిపోయినయ్​
మేం అధికారంలోకి రాగానే కేసీఆర్​ అవినీతి సొమ్మును బయటకు తీస్తం
ఆ సొమ్మునంతా మహిళలు, పేదలకు పంచుతాం
తెలంగాణ నుంచే కులగణన చేపడ్తామని హామీ
జగిత్యాల, నిజామాబాద్​ జిల్లాల్లో పర్యటన

జగిత్యాల/నిజామాబాద్​, వెలుగు: సామాజిక తెలంగాణ కోసం కొట్లాడితే దొరల తెలంగాణగా మారిందని కాంగ్రెస్​ ముఖ్య నేత రాహుల్ గాంధీ అన్నారు. వచ్చే ఎన్నికలు సామాజిక తెలంగాణకు, దొరల తెలంగాణకు మధ్య జరగనున్నాయని, ఓటుతో నిర్ణయం తీసుకోవాల్సింది ప్రజలేనని ఆయన సూచించారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే కేసీఆర్​ అవినీతి సొమ్మును వాపస్​ తెచ్చి, ప్రజలకు పంచి పెడ్తామని ప్రకటించారు. శుక్రవారం ఆయన జగిత్యాల జిల్లా కేంద్రంలో, నిజామాబాద్​ జిల్లాలోని ఆర్మూర్​, మోర్తాడ్​లో పర్యటించారు.

ఆయా చోట్ల కార్నర్​ మీటింగ్స్​లో మాట్లాడారు. ‘‘తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు రాష్ట్రాన్ని సోనియాగాంధీ ఇచ్చారు. స్వరాష్ట్రంలో ప్రజలు, రైతులు, పేదలు సుభిక్షంగా ఉంటారని భావిస్తే.. ఇక్కడ అవినీతిపాలన నడుస్తున్నది. కల్వకుంట్ల కుటుంబం చేతుల్లో రాష్ట్రం బందీ అయింది” అని అన్నారు. ఇక్కడి ప్రజలతో జవహర్ లాల్ నెహ్రూ నుంచి తమకు అనుబంధం ఉందని,  తెలంగాణతో తమది రాజకీయ బంధం కాదని, కుటుంబ బంధమని పేర్కొన్నారు.

రాష్ట్రంలో భూ కబ్జాలు, మైనింగ్ మాఫియా లాంటి అక్రమ దందాలు పెరిగిపోయాయని మండిపడ్డారు. ‘‘కేసీఆర్ దోచుకున్న అవినీతి సొమ్మును మేం అధికారంలోకి రాగానే రాబడ్తం. దాన్ని మహిళలు, పేదల చేతిలో పెడ్తం. రాష్ట్రాన్ని ప్రజల తెలంగాణ, సామాజిక తెలంగాణగా మార్చుకుందాం” అని తెలిపారు. షుగర్ ఫ్యాక్టరీలను బీఆర్ఎస్ సర్కార్  మూసి వేసిందని,  కాంగ్రెస్  అధికారం లోకి రాగానే వాటిని తిరిగి తెరిపిస్తామని హామీ ఇచ్చారు.  పసుపు మద్దతు ధరను క్వింటాల్​కు రూ. 12 వేల నుంచి 15 వేలకు పెంచుతామని, వడ్లకు ఎంఎస్​పీ మీద క్వింటాల్​కు రూ. 500 బోనస్​ ఇస్తామని ఆయన ప్రకటించారు.

బీజేపీ, బీఆర్ఎస్​, ఎంఐఎం మూడూ ఒక్కటే

బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం మూడూ ఒకటేనని, వాటి మధ్య చీకటి ఒప్పందాలున్నాయని రాహుల్​గాంధీ ఆరోపించారు. ఎన్డీయే సర్కార్ బిల్లులన్నింటికీ పార్లమెంట్​లో  బీఆర్​ఎస్​ సపోర్ట్ చేసిందని దుయ్యబట్టారు. రాజస్థాన్, మహారాష్ట్ర, అస్సాం తదితర రాష్ట్రాల్లో పోటీ చేయడం ద్వారా కాంగ్రెస్ ఓట్లు చీల్చి పరోక్షంగా ఎంఐఎం బీజేపీకి సహకరిస్తున్నదని విమర్శించారు. తెలంగాణలో బీఆర్​ఎస్​ ఎంఐఎం మధ్య పొత్తు ఉందని, కాంగ్రెస్​ను ఓడించడానికి ఎంఐఎంను బీఆర్ఎస్ పావుగా వాడుకుంటున్నదని అన్నారు. ‘‘మతతత్వ బీజేపీని ప్రశ్నిస్తే నా పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేసి, ఇంట్లో నుంచి గెంటేశారు. నాకు ఇల్లు అవసరం లేదు. దేశంలోని ప్రతివ్యక్తి గుండెలో నాకు చోటుంది.

తెలంగాణలోని ప్రతి నిరుపేద ఇల్లు నాదే”  అని రాహుల్​ పేర్కొన్నారు. తనపై దాడి చేయకుండా బీజేపీకి రోజు గడవదని  విమర్శించారు. బలహీనవర్గాలకు రిజర్వేషన్ ఇవ్వడం మోదీ, కేసీఆర్ కు ఇష్టం లేదని, అందుకే  కులగణనకు సిద్ధంగా లేరని దుయ్యబట్టారు. కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే తెలంగాణ నుంచే బలహీనవర్గాల కులగణన చేపడతామని తెలిపారు.  యాభై శాతం ఉన్న బలహీన వర్గాలకు కేంద్ర బడ్జెట్​లో ఐదు శాతం నిధులే కేటాయించారని మండిపడ్డారు. కార్యక్రమంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్​ మాణిక్​రావ్​ ఠాక్రే, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క,  ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ మధు యాష్కి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, జగిత్యాల డీసీసీ ప్రెసిడెంట్ అడ్లూరి లక్ష్మణ్​ కుమార్ తదితరులు  పాల్గొన్నారు.

కేసీఆర్​కు ఓటమి తప్పదు

సీఎం కేసీఆర్​ అవినీతిపై కేంద్ర ప్రభుత్వం ఒక్క కేసు పెట్టడంలేదని.. దీనికి బీఆర్​ఎస్​, బీజేపీ మధ్య ఉన్న స్నేహమే కారణమని రాహుల్​ ఆరోపించారు. ‘‘తెలంగాణలో కేసీఆర్​కు ఓటమి తప్పదు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్​గఢ్​లో బీజేపీని ఇంటికి పంపుతం. కేంద్రంలోని బీజేపీతో పోరాటం కాంగ్రెస్​ విధానంలో భాగం. నిన్నటి వరకు ఇక్కడ ఛాతి విరుచుకుని తిరిగిన బీజేపీ గాలి  తీసేశాం. ఇప్పుడా పార్టీ నుంచి   లీడర్లు కాంగ్రెస్​లోకి వరుస కడ్తున్నరు. మేం వారిని అనుమతించడంలేదు. కాంగ్రెస్​కు పులుల్లాంటి కార్యకర్తలు ఉన్నరు’’ అని ఆయన పేర్కొన్నారు. తాము సాధ్యమయ్యే హామీలే ఇస్తున్నామని, సీఎం కేసీఆర్​లా చేయలేని వాగ్దానాలు ఇవ్వడం లేదన్నారు. కార్యక్రమాల్లో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్​  మాణిక్​రావు ఠాక్రే, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ ఎంపీ మధు యాష్కి, మాజీ మంత్రులు సుదర్శన్​రెడ్డి, షబ్బీర్ ​అలీ తదితరులు పాల్గొన్నారు.

దోశ వేసిన రాహుల్  

జగిత్యాల జిల్లా మల్యాల హైవే మీద ఉన్న ఫుడ్ ట్రక్ వద్ద శుక్రవారం రాహుల్​గాంధీ దోశ వేశారు. ఇద్దరు కస్టమర్లకు కూడా దోశలు వేసిచ్చారు. తాను సొంతంగా వేసుకున్న దోశను రాహుల్​ తిన్నారు. దోశ చాలా బాగుందని ఫుడ్ ట్రక్ ఓనర్ శివను ఆయన అభినందించారు. టైమ్​తక్కువగా ఉండడం వల్ల కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు, మేడిపల్లి, కోరుట్లల్లో  కార్నర్ మీటింగులు రద్దయ్యాయి. కోరుట్ల లో నియోజకవర్గ ఇన్​చార్జ్​ జువ్వాడి నర్సింగరావు, జువ్వాడి కృష్ణారావు, మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి జ్యోతక్క, కొమిరెడ్డి కరంచంద్, విజయ్ ఆజాద్, కల్వకుంట్ల సుజిత్ రావు తదితరులు కొత్త బస్ స్టాండ్ వద్ద రాహుల్​కు స్వాగతం పలికారు. అయితే ఆయన కారు దిగకుండానే అభివాదం చేస్తూ వెళ్లిపోయారు. కోరుట్లలోని ఓ ఫంక్షన్​ హాల్​లో లంచ్​ చేశారు. ఈ సందర్భంగా  జువ్వాడి నర్సింగ రావు రాహుల్ గాంధీకి శాలువా కప్పి స్వాగతం పలికారు..