మణిపూర్ పర్యటన.. నిరాశ్రయులను పరామర్శించనున్న రాహుల్ గాంధీ

మణిపూర్ పర్యటన.. నిరాశ్రయులను పరామర్శించనున్న రాహుల్ గాంధీ

మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు తలెత్తుతోన్న క్రమంలో రెండు రోజుల పర్యటన నిమిత్తం కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ ఇంఫాల్‌ చేరుకున్నారు. గత నెల ప్రారంభం నుంచి ఈశాన్య రాష్ట్రాన్ని కుదిపేసిన వర్గ కలహాలతో నిరాశ్రయులైన ప్రజలను కలుసుకునేందుకు ఆయన చురచంద్‌పూర్ జిల్లాకు బయలుదేరి అక్కడ సహాయ శిబిరాలను సందర్శిస్తారు.

రాహుల్ గాంధీ మణిపూర్ వెళ్లడం విశేషమని ఈ సందర్భంగా ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. యూనియన్ హెచ్‌ఎం అక్కడికి వెళ్లినా ఏమీ మారలేదన్న ఆయన.. మణిపూర్ గురించి ప్రధాని ఇప్పటి వరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఆరోపించారు. చైనా ప్రమేయంతో మణిపూర్‌లో పరిస్థితి దిగజారిపోతోందని  ఎంపీ సంజయ్ రౌత్ చెప్పుకొచ్చారు.

హింసాత్మక మణిపూర్‌లోని ఇంఫాల్ పశ్చిమ జిల్లాలో గురువారం ఉదయం గ్రామస్థులపై సాయుధ దుండగులు కాల్పులు జరపడంతో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. భద్రతా బలగాలు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మణిపూర్‌ పర్యటన ప్రారంభించిన రోజే ఈ సంఘటన చోటుచేసుకోవడంతో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. ఇదిలా ఉండగా మెయిటీ, కుకీ తెగల మధ్య జరిగిన హింసాకాండ కారణంగా ఇప్పటివరకు కనీసం 115 మంది మరణించారు. 60వేల మంది వరకు నిరాశ్రయులైనట్టు సమాచారం.