ఖమ్మం నగరంలో ఆదివారం మల్లు భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ముగింపు జనగర్జన సభకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ వస్తున్నారని, ఈ సభకు ప్రజలను రానీయకుండా బీఆర్ఎస్ నేతలు కుట్రలు పన్నుతున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. మీటింగ్‌కోసం బస్సులను ఆర్టీసీ ఆఫీసర్లు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ ఉమ్మడి జిల్లాలోని ఆర్టీసీ డిపోల ఎదుట పార్టీ నేతలు, కార్యకర్తలు ధర్నాలు చేశారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ సీఎం, మంత్రి పువ్వాడ అజయ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నేతలు మాట్లాడుతూ బస్సులను ఇవ్వాలని అడిగితే ముందు ఇస్తామని, తర్వాత బస్సులు లేవంటూ చెప్పడమేంటని మండిపడ్డారు. ప్రభుత్వం ప్రతిపక్షాలను అణగదొక్కేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు.
పొంగులేటి కాంగ్రెస్ లో చేరుతున్నారనే విషయాన్ని కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. ఎన్ని నిర్బంధాలు పెట్టినా సభను సక్సెస్ చేసి తీరుతామని, బీఆర్ఎస్ ప్రభుత్వానికి రాబోయే ఎన్నికల్లో గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. పలు డిపోల వద్ద నేతలు, కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ప్రోగ్రాంలల్లో జడ్పీ చైర్మన్కోరం కనకయ్య, పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
–భద్రాద్రికొత్తగూడెం/భద్రాచలం/మణుగూరు, వెలుగు