27న రాహుల్ గాంధీ పంజాబ్ పర్యటన

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఈ నెల 27న పంజాబ్ లో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్దూ ట్విట్టర్ లో ప్రకటించారు. రాహుల్ కు ఘన స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ కార్యకర్తలందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారని అన్నారు.
రాహుల్ గాంధీ గురువారం ఉదయం 8 గంటలకు ప్రత్యేక విమానంలో అమృత్ సర్ కు బయలుదేరనున్నారు. అక్కడి నుంచి 117 మంది కాంగ్రెస్ అభ్యర్థులతో కలిసితొలుత  శ్రీ హరిమందిర్ సాహిబ్ ను దర్శించుకోనున్నారు. అనంతరం రాహుల్ గాంధీ శ్రీ దుర్గాయన మందిర్, భగవాన్ వాల్మీకి స్థల్ ను సందర్శించి ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆ తర్వాత అమృత్ సర్ నుంచి జలంధర్ కు రోడ్డు మార్గాన చేరుకోనున్నారు. మధ్యాహ్నం 3.30గంటలకు పంజాబ్ ఫతే వర్చువల్ ర్యాలీలో పాల్గొని సాయంత్రం 5.25గంటలకు తిరిగి ఢిల్లీకి పయనంకానున్నారు.