సికింద్రాబాద్: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ బోయిన్పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్కు చేరుకున్నారు. సమగ్ర కుల గణన సదస్సులో పాల్గొనేందుకు ఆయన నగరానికి వచ్చిన సంగతి తెలిసిందే. బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్కు కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, అరికెపూడి గాంధీ, మేయర్ గద్వాల విజయలక్ష్మి రాహుల్కు ఘన స్వాగతం పలికారు.
బేగంపేట విమానాశ్రయానికి కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. సిటీలో కాంగ్రెస్ శ్రేణులు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో సందడి నెలకొంది. రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
రాహుల్ గాంధీకి స్వాగతం పలికేందుకు ఐమాక్స్ ఇందిరా గాంధీ విగ్రహం నుంచి బేగంపేట విమానాశ్రయం వరకు బైక్ ర్యాలీ సాగింది. కేటీఆర్ కోరినట్లు రాహుల్ గాంధీ అశోక్ నగర్కు త్వరలో వస్తారని, నిరుద్యోగం అనే సమస్య దేశం మొత్తం ఉందని, త్వరలో నిరుద్యోగులతో రాహుల్ గాంధీ భేటీ అవుతాడని ఈ సందర్భంగా దానం నాగేందర్ చెప్పారు. ఇదిలా ఉండగా.. హైదరాబాద్ చేరుకున్న రాహుల్ గాంధీకి బోయిన్పల్లి తాడ్ బంద్ చౌరస్తా వద్ద కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ భారీ జనంతో స్వాగతం పలికారు.