- రూ.12 వేల నుంచి రూ.15 వేల మధ్య పసుపు రేటు చెల్లిస్తం
- పసుపు బోర్డు వాగ్దానం వట్టి బూటకం
- కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
నిజామాబాద్, ఆర్మూర్, వెలుగు : కాంగ్రెస్ అధికారంలో వచ్చాక జిల్లాలో మూతబడిన షుగర్ ఫ్యాక్టరీలను తెరిపిస్తామని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మోర్తాడ్ కార్నర్ మీటింగ్‌లో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. ప్రధాని మోదీ చేసిన పసుపు బోర్డు ప్రకటన మోసపూరిత వాగ్దానమని, ప్రజలు నమ్మొద్దని సూచించారు. తమ సర్కార్వచ్చాక పసుపు రేటు క్వింటాల్‌కు రూ.12 వేల నుంచి రూ.15 వేలు చెల్లిస్తామన్నారు.
తడికెల టీస్టాల్లో చాయ్తాగి..
పెర్కిట్మీదుగా ఆర్మూర్ వస్తున్న క్రమంలో అంక్సాపూర్– పడిగెల మధ్య రోడ్డు పక్కన ఉన్న ఓ తడికెలలో నడుపుతున్న టీస్టాల్వద్ద రాహుల్ ఆగారు. లోపలికి వెళ్లి టీస్టాల్ నడుపుతున్న వారిని పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వారు ఇచ్చిన చాయ్ తాగుతూ ముచ్చటించారు. అక్కడున్న చిన్నపెద్దలకు షేక్‌హ్యాండ్ ఇచ్చి ఆత్మీయంగా దగ్గరికి తీసుకున్నారు. నెలకు ఎంత కరెంట్ బిల్లు కడుతున్నారని టీస్టాల్నిర్వాహకులను ప్రశ్నించారు. తాము అధికారంలోకి రాగానే 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ఇస్తామని చెప్పారు. రాహుల్ వెంట వందల సంఖ్యలో కార్ల కాన్వాయ్ కొనసాగింది.
కాంగ్రెస్ కార్యకర్తలు సింహాలు..
కాంగ్రెస్ కార్యకర్తలను సింహాలుగా రాహుల్‌అభివర్ణించారు. అడవిలో సింహాలు విడివిడిగా ఉంటాయని, కానీ కార్యకర్తలు వేల సంఖ్యలో సింహాలుగా గర్జిస్తున్నారన్నారు. బీఆర్ఎస్ను గద్దె దిగడం పక్కా అంటూ వారిలో కార్యకర్తల్లో జోష్నింపారు. పార్టీలోని యూత్, కిసాన్, సేవాదళ్ మహిళా అనుబంధ విభాగాలను రాహుల్తన ప్రసంగంలో ప్రస్తావించారు. మీటింగ్ ప్రాంగణంలో కార్యకర్తలు కాంగ్రెస్ జెండాలు, నినాదాలతో హోరెత్తించారు.
కమ్మర్‌పల్లిలో ప్రవేశం..
జగిత్యాల జిల్లా కోరుట్ల మీదుగా రాహుల్మధ్యాహ్నం 2 గంటలకు కమ్మర్పల్లి శివారులోకి ఎంట్రీ అయ్యారు. పార్టీ కార్యకర్తలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి మోర్తాడ్ వెళ్లి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుపై కార్నర్ మీటింగ్‌లో ప్రసంగించారు. రాహుల్ ప్రసంగాన్ని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలుగులో అనువదించారు. మోర్తాడ్, పెర్కిట్నుంచి ఆర్మూర్ చేరుకున్న రాహుల్,అక్కడ మీటింగ్ ముగించుకొని రోడ్డు మార్గంలో సాయంత్రం 5 గంటలకు శంషాబాద్ఎయిర్పోర్టుకు యాణమయ్యారు.
అభ్యర్థులను గెలిపించాలని పిలుపు..
జిల్లాలో పర్యటించిన రాహుల్‌గాంధీ మోర్తాడ్కార్నర్ మీటింగ్ ముగిశాక బాల్కొండ కాంగ్రెస్అభ్యర్థి ముత్యాల సునీల్‌రెడ్డిని ప్రజలకు పరిచయం చేసి, గెలిపించాలని కోరారు. ఆర్మూర్‌లో పొద్దుటూరి వినయ్‌రెడ్డితో కలిసి ప్రజలకు అభివాదం చేశారు. చివరలో బోధన్ క్యాండిడేట్ సుదర్శన్‌రెడ్డిని సభికులకు పరిచయం చేశారు. రాహుల్ ప్రసంగించడానికి ఏర్పాటు చేసిన బస్సు పైకి పరిమిత సంఖ్యలో మాత్రమే లీడర్లను సెక్యూరిటీ ఆఫీసర్లు అనుమతించారు.