హత్రాస్(యూపీ): కాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గురువారం హత్రాస్ బాధితురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఉదయం 11 గంటలకు రాహుల్ యూపీలోని బూల్ గర్హి గ్రామానికి చేరుకున్నారు. 35 నిమిషాలపాటు బాధితురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడకుండానే తిరిగి ఢిల్లీకి వచ్చేశారు. రాహుల్ పర్యటన అనంతరం హత్రాస్ కాంగ్రెస్ నేత చంద్రగుప్త విక్రమాదిత్య మీడియాతో మాట్లాడారు. ‘‘బాధితురాలి కుటుంబ సభ్యుల సమస్యలు వినేందుకు రాహుల్ ఇక్కడికి వచ్చారు. ఆయన నిరంతరం ఆ కుటుంబంతో టచ్‌లో ఉన్నారు.
న్యాయం కోసం రాహుల్ నిరంతరం పోరాడుతున్నారు”అని చంద్రగుప్త చెప్పారు. కాగా, 2020 సెప్టెంబర్ 14న హత్రాస్‌లో 19 ఏండ్ల దళిత మహిళపై గ్యాంగ్ రేప్ జరిగింది. తీవ్ర గాయాలవడంతో సెప్టెంబర్ 29న ఆమె ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయింది. కుటుంబ సభ్యుల అనుమతి లేకుండానే పోలీసులు బాధితురాలి డెడ్‌బాడీని దహనం చేశారు. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. కేసు దర్యాప్తు సీబీఐ చేపట్టి నలుగురు నిందితులపై చార్జ్‌షీట్ దాఖలు చేసింది.
కోర్టులో ఉన్న అంశాలపై రాజకీయాలా?: బీజేపీ
రాహుల్ టూర్‌పై బీజేపీ విమర్శలు గుప్పించింది. సీబీఐ విచారించిన ఈ కేసు కోర్టులో నడుస్తున్నదని తెలియక రాహుల్ అయోమయంలో ఉన్నారని యూపీ డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ కామెంట్ చేశారు. ఆయన కేవలం లైమ్ లైట్లో ఉండేందుకు బాధితులను కలుస్తుంటారని అన్నారు. ఇవన్నీ కాంగ్రెస్ జిమ్మిక్కులేనని బీజేపీ మరో మంత్రి ఓం ప్రకాశ్ రాజ్‌భర్ కామెంట్ చేశారు.