
ఉగ్రవాదంపై పోరులో కేంద్రానికి మద్దతు
పహల్గాం దాడిని ఖండిస్తున్నాం: రాహుల్
దాడిలో గాయపడిన వారికి పరామర్శ
శ్రీనగర్: టెర్రరిజాన్ని ఓడించాలంటే దేశ ప్రజలంతా ఐక్యంగా నిలబడటం ఎంతో అవసరమని కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. దేశ ప్రజలను విభజించడమే పహల్గాం టెర్రరిస్ట్ అటాక్ వెనుక ఉన్న లక్ష్యమని తెలిపారు. టెర్రరిస్ట్ దాడిని కిరాతక చర్యగా అభివర్ణించారు. దాడిలో గాయపడి బడామిబాగ్ కంటోన్మెంట్ ఆర్మీకి చెందిన 92 బేస్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిని శుక్రవారం రాహుల్ పరామర్శించారు. ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, సీఎం ఒమర్ అబ్దుల్లాతో భేటీ అయ్యారు. జమ్మూ కాశ్మీర్లో నెలకొన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారిని పరామర్శించాక రాహుల్ మీడియాతో మాట్లాడారు. ‘‘పహల్గాం ఉగ్రదాడిని యావత్ ప్రపంచం ఖండించింది. అన్ని పార్టీలు ఏకమై టెర్రరిజానికి వ్యతిరేకంగా పోరాటానికి పిలుపునిచ్చాయి.
మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నాను. గాయపడినవాళ్లంతా త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. జమ్మూ కాశ్మీర్ ప్రజలంతా దాడిని తీవ్రంగా ఖండించారు. దేశానికి తమ మద్దతు ప్రకటించారు. టెర్రరిజానికి వ్యతిరేకంగా కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలియజేస్తది. దాడిలో గాయపడిన వ్యక్తిని కలిశాను. చాలా మంది బాధితులు తమ తమ ఇండ్లకు వెళ్లిపోయారు. ఇండియన్స్ అంతా ఐక్యంగా ఉండటం ఎంతో ముఖ్యం. అప్పుడే ఉగ్ర చర్యలను, వారి ప్రయత్నాలను దీటుగా ఎదుర్కోగలం. కాశ్మీర్‌తో పాటు దేశంలో వివిధ ప్రాంతాలకు చెందిన వారిపై కొందరు దాడులు చేయడం అత్యంత బాధాకరం. మనందరం ఐక్యంగా ఉండి టెర్రరిజాన్ని తరిమికొట్టాలి. సమాజాన్ని విభజించడం, సోదరుల మధ్య తగాదాలు సృష్టించడమే టెర్రరిస్టుల పని. లెఫ్టినెంట్ గవర్నర్, సీఎంను కలిశాను. ఇక్కడ జరిగిదంతా వాళ్లు నాకు వివరించారు’’అని
రాహుల్ తెలిపారు.