
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ఫైరయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు అతి పెద్ద స్టాక్ మార్కెట్ కుంభకోణానికి పాల్పడ్డారన్న రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై ఆయన మండిపడ్డారు.
రాహుల్ వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు పీయూష్ గోయల్ మీడియాతో మాట్లాడుతూ.. 2024 లోక్‌సభ ఎన్నికలలో తగిలిన ఎదురుదెబ్బ నుంచి రాహుల్ గాంధీ ఇంకా కోలుకోలేదని ఎద్దేవా చేశారు. "మార్కెట్ పెట్టుబడిదారులను తప్పుదోవ పట్టించడానికి రాహుల్ గాంధీ కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. గత 10 సంవత్సరాల మోదీ ప్రభుత్వంలో మొదటిసారి దేశ మార్కెట్ విలువు 5 ట్రిలియన్ డాలర్లను దాటిందని చెప్పారు. మోడీ ప్రభుత్వ హయాంలో PSU ల మార్కెట్ విలువ నాలుగు రెట్లు పెరిగిందని చెప్పారు. నేడు, భారతదేశం ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని తెలిపారు. 10 ఏళ్ల క్రితం యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు భారత్ మార్కెట్ విలువ అప్పట్లో రూ.67 లక్షల కోట్లుగా ఉంటే.. నేడు రూ.415 లక్షల కోట్లకు పెరిగిందని పీయూష్ గోయల్ చెప్పారు.
అంతకుముందు రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. దేశంలో స్కాక్ మార్కెట్లలో భారీ స్కాం జరిగిందని.. జేపీసీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. జూన్ 3న స్టాక్ మార్కెట్లు స్టాక్ మార్కెట్లు పెరుగుతాయని హోంమంత్రి చెప్పారని.. ఈ విషయం ఆయనకు ఎలా తెలుసని ప్రశ్నించారు. ఇది స్టాక్ మార్కెట్లో అత్యంత పెద్ద స్కాం అన్నారు. స్టాక్ మార్కెట్ల విషయంపై మొదటిసారిగా ప్రధాని మోదీ మాట్లాడారన్నారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా తమ విధులను దుర్వినియోగం చేశారన్నారు. జూన్ 3 పెరిగిన స్టాక్ మార్కెట్లు.. జూన్ 4న పడిపోయాయన్నారు. ఎన్నికల అనంతరం మీడియా తప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చే విషయంలో మోదీ ప్రమేయం ఉందని రాహుల్ గాంధీ ఆరోపించారు.