కేసీఆర్ దోచుకున్న సొమ్మును పేదలకు పంచుతం .. రాష్ట్రాన్ని సీఎం అప్పులపాలు చేసిండు: రాహుల్  

కేసీఆర్ దోచుకున్న సొమ్మును పేదలకు పంచుతం .. రాష్ట్రాన్ని సీఎం అప్పులపాలు చేసిండు: రాహుల్  
  • ఒకదాని తర్వాత ఒకటి కాళేశ్వరం పిల్లర్లు కుంగుతున్నయ్  
  • ధరణితో 20 లక్షల మంది రైతులకు నష్టం 
  • 2 శాతమే ఓట్లు వచ్చే బీజేపీ.. బీసీని ఎట్ల సీఎం చేస్తదని ప్రశ్న
  • ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి పరామర్శ
  • ఉమ్మడి మహబూబ్ నగర్​లో కాంగ్రెస్ బస్సుయాత్ర 

మహబూబ్​నగర్/నాగర్​కర్నూల్/షాద్ నగర్: పేదలను సీఎం కేసీఆర్ దోచుకున్నారని కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ అన్నారు. కేసీఆర్ దోచుకున్న సొమ్మంతా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కక్కించి, పేదలకు పంచుతామని చెప్పారు. ‘‘కేసీఆర్.. పేదలను లూటీ చేసిండు. ఆ డబ్బును వాపస్ తేవాలి. ముందు  సీఎం సీటు నుంచి ఆయనకు బైబై చెప్పాలి. కాంగ్రెస్​అధికారంలోకి రాగానే ప్రజల దగ్గరి నుంచి కేసీఆర్ దోచుకున్నదంతా కక్కిస్తం.

ఆ డబ్బులను పేదల జేబుల్లో వేస్తం’’ అని తెలిపారు. బుధవారం ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలోని కల్వకుర్తి, జడ్చర్ల, షాద్​నగర్​లో నిర్వహించిన బస్సు యాత్రలో రాహుల్ పాల్గొని మాట్లాడారు. ఈసారి ఎన్నికల్లో దొరల తెలంగాణకు, ప్రజల తెలంగాణకు మధ్య పోటీ జరుగుతున్నదని ఆయన చెప్పారు. ఓవైపు సీఎం, ఆయన కుటుంబం, అవినీతి మంత్రులు ఉంటే.. మరోవైపు తెలంగాణ ప్రజలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు, యువకులు, కాంగ్రెస్​ఉందని తెలిపారు. రాజులాగా రాష్ట్రంపై కేసీఆర్ పెత్తనం చలాయిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో వైన్స్, ల్యాండ్, సాండ్.. ఇలా దోపిడీ జరిగే శాఖలన్నీ కేసీఆర్ కుటుంబం చేతుల్లోనే ఉన్నాయని విమర్శించారు.  

ఒక్క ప్రాజెక్టు సక్కగా కట్టలే.. 

లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్లు.. ఒకదాని తర్వాత ఒకటి కుంగిపోతున్నాయని రాహుల్ విమర్శించారు. కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు దోచుకున్న దొంగ కేసీఆర్. ఈ శతాబ్దంలో ఇదే అతి పెద్ద స్కామ్. ఇప్పుడా ప్రాజెక్టు పిల్లర్లు ఒకదాని తర్వాత ఒకటి కుంగిపోతున్నాయి. కేసీఆర్ అవినీతికి ఇదే నిదర్శనం. కేసీఆర్ ఒక్క ప్రాజెక్టు కూడా సక్కగా కట్టలేకపోయాడు. మేం కట్టిన నాగార్జున సాగర్, జూరాల, శ్రీరామ్​సాగర్, సింగూరు ప్రాజెక్టులు ఇప్పటి వరకు చెక్కుచెదరలేదు’’ అని చెప్పారు. కేసీఆర్ రాష్ర్టాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారని, ఒక్కొక్కరిపై రూ.లక్ష అప్పు పెట్టారని ఫైర్ అయ్యారు.

కేసీఆర్ ప్రభుత్వం ధరణి పేరుతో పేదల భూములు గుంజుకుంటున్నదని మండిపడ్డారు. ‘‘గతంలో కాంగ్రెస్​పాలనలో లక్షలాది మంది దళితులు, గిరిజనులకు భూములు పంచినం. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత వచ్చిన దొరల ప్రభుత్వం.. ధరణి  పోర్టల్​తీసుకొచ్చి పేదల భూములు లాక్కుంటున్నది. ధరణితో 20 లక్షల మంది రైతులకు నష్టం జరిగింది. ఈ పోర్టల్ తో  ఒక్క కేసీఆర్​ కుటుంబానికే లాభం జరుగుతోంది. దళిత, గిరిజనుల భూములు లాక్కున్న కేసీఆర్​ను ఓడించాలె” అని ప్రజలకు రాహుల్ పిలుపునిచ్చారు. 

కేసీఆర్ పై కేసులేవీ? 

బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు ఒక్కటేనని రాహుల్ ఆరోపించారు. ‘‘అగ్రి చట్టాలు, జీఎస్టీ, నోట్ల రద్దు అంశాల్లో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది. ప్రతిపక్ష లీడర్లపై ఈడీ, సీబీఐ, ఐటీ కేసులు పెడుతున్న కేంద్రం.. బీఆర్ఎస్ నేతలు, కేసీఆర్​మీద ఎలాంటి కేసులు పెట్టడం లేదు. వాళ్ల ఇండ్ల వద్దకు కూడా సీబీఐ, ఈడీ అధికారులు వెళ్లలేరు. సీఎం కేసీఆర్, ప్రధాని మోదీ ఒక్కటే” అని విమర్శించారు. తనపై ఎన్ని కేసులు పెట్టినా భయపడనని, సామాన్యుడిలా ప్రజల్లో బతకడమే తనకు ఇష్టమని చెప్పారు.

కాంగ్రెస్ ఎక్కడ పోటీ చేస్తే, అక్కడ ఎంఐఎం పోటీ చేస్తోందని.. ఇదంతా బీజేపీకి సహాయం చేసేందుకేనని ఆరోపించారు. ‘‘ఎంఐఎం పార్టీకి సంబంధం లేని అస్సాం, మహారాష్ట్రలో కూడా ఆ పార్టీ క్యాండిడేట్లు వస్తరు. వాళ్లకు బీజేపీ డబ్బులు ఇస్తుంది. ఎంఐఎం, బీజేపీ, బీఆర్ఎస్​ఒక్కటే” అని ఆరోపించారు. ‘‘బీజేపీ లీడర్లు తెలంగాణలో భుజాలు ఎగిరేసి తిరిగేటోళ్లు. కాంగ్రెస్​పార్టీ వాళ్ల గ్యాస్​తీసేసింది. నాలుగు టైర్లను పంక్చర్​చేసింది. తెలంగాణలో చేసినట్టే, దేశంలో కూడా బీజేపీ టైర్లు పంక్చర్​చేస్తాం. ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న రాజస్థాన్, చత్తీస్​గఢ్, తెలంగాణ, మధ్యప్రదేశ్ తో పాటు 2024 లోక్ సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్సే గెలుస్తుంది” అని ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడ బీఆర్ఎస్ ను ఓడగొట్టి, ఢిల్లీలో బీజేపీని ఓడగొడదామని ప్రజలకు పిలుపునిచ్చారు. 

రాహుల్ రోడ్ షోలో స్ట్రీట్ లైట్లు బంజేసిన్రు.. 

రాహుల్ షాద్ నగర్ లో రోడ్ షో చేస్తుండగా స్ట్రీట్ లైట్లు బంజేశారు. కేశంపేట రోడ్ నుంచి చౌరస్తాకు వస్తుండగా స్ట్రీట్ లైట్లు ఆఫ్ చేశారు. ఇదేం దరిద్రమైన రాజకీయం అంటూ మున్సిపల్ ప్రజాప్రతినిధులు, అధికారుల తీరుపై జనం మండిపడ్డారు. కాగా, రాహుల్ మాట్లాడుతున్న టైమ్ లో మసీదులో అజాన్ వినపడింది. దీంతో ఆయన తన ప్రసంగం ఆపి, మసీదులో ప్రార్థనలు అయిపోగానే తిరిగి ప్రారంభించారు.

 మేం రాగానే కులగణన..

తెలంగాణలో బీసీని సీఎం చేస్తామని బీజేపీ లీడర్లు ప్రకటనలు చేశారు. రాష్ట్రంలో 2 శాతం ఓట్లు మాత్రమే వచ్చే ఆ పార్టీ.. బీసీని సీఎం ఎలా చేస్తుంది. అమెరికాకు వెళ్లి అక్కడ బీసీని ప్రెసిడెంట్ చేస్తామన్నట్టుగా బీజేపీ తీరు ఉంది. ముందు మీ పంక్చర్ అయిన కారు టైర్లను రిపేర్ చేసుకోండి. ఈ సభకు వచ్చిన వారిలో 50 శాతం మందికి పైగా బీసీలు ఉన్నారు. దేశంలో ఎక్కువగా బీసీలు, ఆదివాసీలు, దళితులు, మైనారిటీలే ఉన్నారు. కానీ కేంద్రంలో 90 మంది ముఖ్యమైన అధికారుల్లో ముగ్గురే బీసీలు ఉన్నారు. అందరికీ న్యాయం జరగాలంటే కులగణన జరగాలి. తెలంగాణలో అధికారంలోకి రాగానే కుల గణన చేయిస్తాం. ఆ తర్వాత దేశమంతా చేయిస్తాం.      

  రాహుల్​ గాంధీ

ఆత్మహత్య చేసుకున్న  రైతు కుటుంబానికి భరోసా..

కల్వకుర్తి, వెలుగు:   నాగర్ కర్నూల్ జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని రాహుల్ గాంధీ పరామర్శించారు. కల్వకుర్తి మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన కౌలు రైతు కుమ్మరి చంద్రయ్య (35) అప్పుల బాధతో మూడేండ్ల కింద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. చంద్రయ్య గురించి లోకల్ లీడర్లు రాహుల్ కు చెప్పగా.. ఆయన బుధవారం మధ్యాహ్నం 2గంటలకు జిల్లెల్ల గ్రామానికి వెళ్లారు.

చంద్రయ్య ఇంటికెళ్లి అతని భార్య తిరుపతమ్మ, కొడుకు నితిన్​ను పరామర్శించారు. దాదాపు 45 నిమిషాలు అక్కడే ఉన్నారు. తిరుపతమ్మ, నితిన్ తో కలిసి  ఊరి శివారులో వారికి ఉన్న 28 గుంటల పొలం దగ్గరికి వెళ్లి పరిశీలించారు. భూమి ఎవరి పేరు మీద ఉందని, పంట ఎందుకు వేయలేదని రాహుల్​అడగ్గా.. భూమి ఇంకా తన  పేరు మీదికి మారలేదని, నీటి వసతి లేక పంట వేయలేదని తిరుపతమ్మ చెప్పారు. ఈ సందర్భంగా తానే బోర్ వేయించి మోటార్ పెట్టిస్తానని రేవంత్ మాటిచ్చారు. నితిన్ కు డ్రైవింగ్ లైసెన్సు ఇప్పించి ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు.