ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కొందరు బిలియనీర్లు, పేదల మధ్యేనని కాంగ్రెస్అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. ప్రధాన ప్రాజెక్టులను గుజరాత్‌కు తరలించడం వల్ల మహారాష్ట్రలో ఉద్యోగ అవకాశాలపై ఆ ప్రభావం పడిందని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే రిజర్వేషన్లపై 50శాతం పరిమితిని తొలగిస్తామని, కుల ఆధారిత సర్వే నిర్వహిస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. సోమవారం ఆయన ముంబైలో మీడియాతో మాట్లాడారు. ‘‘ముంబైలోని భూమి అంతా తమ చేతుల్లోకి రావాలని కొందరు బిలియనీర్లు కోరుకుంటున్నారు. దానివల్ల ఒక బిలియనీర్‌కు లక్ష కోట్లు లబ్ధి చేకూరుతుందని అంచనా” అని రాహుల్ఆరోపించారు. మహారాష్ట్రలోని రైతులు, పేదలు, నిరుద్యోగులు, యువతకు సహాయం చేయాలన్నదే తమ ఆలోచన అని ఆయన పేర్కొన్నారు. ‘‘మేము అధికారంలోకి రాగానే రైతులకు రూ.3 లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తాం. సోయాబీన్ పంటకు క్వింటాల్‌కు రూ.7 వేలు మద్దతు ధర కల్పిస్తాం. అలాగే, దేశంలో కులాలవారీగా సర్వే నిర్వహిస్తాం.
ప్రస్తుతం తెలంగాణ, కర్నాటకలో కుల గణన చేస్తున్నాము. తర్వాత మహారాష్ట్రలో చేపడుతాం. కుల గణన అనేది మన ముందున్న అతిపెద్ద సమస్య. అయినా దానిని పూర్తి చేస్తాం అంతేకాకుండా.. రిజర్వేషన్లపై 50% పరిమితిని తొలగిస్తాం.’’ అని హామీ ఇచ్చారు. ఫాక్స్‌కాన్, ఎయిర్‌బస్‌తో సహా రూ.7 లక్షల కోట్ల ప్రాజెక్టులను మహారాష్ట్ర నుంచి గుజరాత్‌కు తరలించారని రాహుల్ గాంధీ ఆరోపించారు. దీని వల్ల మహారాష్ట్రలో యువత ఉద్యోగాలు కోల్పోయారని అన్నారు. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం మహారాష్ట్ర ప్రజల ప్రయోజనాలను పరిరక్షిస్తుందని పేర్కొన్నారు. ముంబైలోని ధారావి పునరాభివృద్ధి పథకంలో ఒక వ్యక్తికి సహాయం చేయడానికి మొత్తం రాజకీయ యంత్రాంగాన్ని వక్రీకరించారని ఆరోపించారు. అలాగే, ఇటీవల ప్రధాని మోదీ 'ఏక్ హై తో సేఫ్ హై' అంటూ చేసిన ప్రకటనపైనా రాహుల్ స్పందించారు. మీడియా సమావేశంలో మోదీ, పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీల పోస్టర్‌ను చూపిస్తూ.. ‘‘వారు కలిసి ఉన్నంత వరకు సురక్షితంగా ఉంటారు’’ అంటూ ఎద్దేవా చేశారు.