దేశాన్ని అమ్మకండి.. సభను నడపండి.. గాంధీగిరి తరహాలో పార్లమెంట్ వద్ద ప్రతిపక్షాల ఆందోళన

దేశాన్ని అమ్మకండి.. సభను నడపండి.. గాంధీగిరి తరహాలో పార్లమెంట్ వద్ద ప్రతిపక్షాల ఆందోళన

న్యూఢిల్లీ, వెలుగు: పార్లమెంట్ వద్ద ప్రతిపక్షాలు ఆరో రోజు కూడా ఆందోళనలు చేపట్టాయి. ‘‘దేశాన్ని అమ్మకండి.. సభను నడపండి” అంటూ ప్రతిపక్ష పార్టీల నేతలు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఒక చేతిలో త్రివర్ణ పతాకం, మరో చేతిలో ఎర్ర గులాబీలు పట్టుకొని గాంధీగిరి తరహాలో వినూత్నంగా నిరసనలు తెలిపారు. బుధవారం పార్లమెంట్ మకర ద్వారం ముందు ఇండియా కూటమి ఎంపీలు తమ ఆందోళన కొనసాగించారు. తిరంగా జెండా, గులాబీ పువ్వు చేతబట్టి.. సభ్యులు పార్లమెంట్లోనికి వెళ్లే ప్రధాన మార్గం ముందు ఇరువైపులా నిలబడ్డారు. సభకు వెళ్లే కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలకు జాతీయ జెండా, గులాబీ పువ్వులు అందించి.. సభా కార్యక్రమాలు జరిగేలా చూడాలని కోరే ప్రయత్నం చేశారు.

అదానీ ముడుపుల వ్యవహారంతో పాటు అన్ని అంశాలపై చర్చ జరిగేలా చూడాలని కోరారు. ఈ ప్రదర్శనలో లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతోపాటు ప్రియాంక గాంధీ, ఇతర కాంగ్రెస్ ఎంపీలు, డీఎంకే, జేఎంఎం, లెఫ్ట్ పార్టీల ఎంపీలు పాల్గొన్నారు. తెలంగాణ నుంచి కాంగ్రెస్ ఎంపీలు గడ్డం వంశీకృష్ణ, చామల, మల్లు రవి, అనిల్, పలువురు ఎంపీలు రాహుల్ తో కలిసి నిరసనలు తెలిపారు. నిరసనలో భాగంగా రాహుల్ గాంధీ, కూటమి ఎంపీలు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్ సింగ్​కు తిరంగా, గులాబీ పువ్వులు ఇచ్చేందుకు యత్నించగా.. కేంద్ర మంత్రి సున్నితంగా తిరస్కరించారు. కాగా, బుధవారం కూడా రాజ్యసభ ప్రతిపక్ష, అధికార పక్ష సభ్యుల వాగ్వాదంతో ఎలాంటి ప్రొసీడింగ్స్ లేకుండానే మరునాటికి వాయిదాపడింది. లోక్ సభలో ప్రతిపక్ష ఎంపీల ఆందోళనల మధ్యే రైల్వే సవరణ బిల్లు ఆమోదం పొందింది. 

‘ద్రోహి’ వ్యాఖ్యలపై ప్రియాంక ఫైర్ 
రాహుల్ గాంధీని ‘ద్రోహి’ అంటూ బీజేపీ నేత సంబిత్ పాత్రా సంబోధించడాన్ని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ తప్పుపట్టారు. నెహ్రూ, ఇందిర, రాజీవ్‌‌‌‌ గాంధీలను సైతం ద్రోహులు అన్న వ్యక్తులు రాహుల్ గాంధీని విడిచిపెడతారని తాము అనుకోలేమన్నారు.

ఖర్గే వర్సెస్ నడ్డా
రాజ్యసభకు చైర్మన్ జగదీప్ ధన్​ఖడ్​ ఆటంకం కలిగిస్తున్నారని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. బుధవారం పార్లమెంట్ బయట మీడియాతో మాట్లాడుతూ.. ధన్​ఖడ్ సభలో పక్షపాతం చూపుతున్నారని, రూలింగ్ పార్టీకి అధికార ప్రతినిధిలా వ్యవహరిస్తుండవచ్చని విమర్శించారు. ఖర్గే వ్యాఖ్యలపై రాజ్యసభ లీడర్ జేపీ నడ్డా ఫైర్ అయ్యారు. ధన్​ఖడ్​పై అవిశ్వాస తీర్మానాన్ని ఖండించారు. జార్జ్ సోరోస్​కు, కాంగ్రెస్ పెద్దలకు సంబంధాల అంశం నుంచి దృష్టి మళ్లించేందుకే చైర్మన్ పై ఆరోపణలు చేస్తున్నారన్నారు.

సభ‌‌‌‌ స‌‌జావుగా నడపండి: రాహుల్​ 
పార్లమెంటులో బీజేపీ ఎంపీలు తనపై చేసిన అవమానకర వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని లోక్‌‌‌‌సభ స్పీకర్‌‌‌‌ ఓం బిర్లాను ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కోరారు. బుధ‌‌‌‌వారం లోక్‌‌‌‌స‌‌‌‌భ స్పీక‌‌‌‌ర్‌‌‌‌ ఓం బిర్లాతో  సమావేశం తర్వాత మీడియాతో రాహుల్ మాట్లాడారు. ‘‘స్పీకర్‌‌‌‌తో సమావేశమయ్యాను. నాపై చేసిన అవమానకర వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని కోరాను. పరిశీలిస్తామని ఆయన చెప్పారు. సభ సజావుగా జరగాలన్నదే మా లక్ష్యం. బీజేపీ నాయకులు నాకు వ్యతిరేకంగా ఏమైనా చెప్పనీయండి. డిసెంబర్13న రాజ్యాంగ చర్చ జరగాలని మేం కోరుకుంటున్నాం. వాళ్లు అదానీపై చర్చను కోరకోవడం లేదు. మేం విడిచిపెట్టం. వాళ్లు మాపై ఆరోపణలు చేసుకోనీయండి. కానీ సభ మాత్రం జరగాలి’’ అని ఆయన అన్నారు.