భోపాల్ : ఎమ్మెల్యేలను కొని మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ సర్కారును బీజేపీ పడగొట్టిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. 2020లో డబ్బుతో కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని కూల్చి ప్రజా తీర్పును బీజేపీ అవమానించిందని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఆయన మధ్యప్రదేశ్‌లోని విదిశాలో జరిగిన పార్టీ ర్యాలీలో పాల్గొని, మాట్లాడారు. రాష్ట్రంలో ఈసారి 230 స్థానాలకుగాను145 నుంచి 150 సీట్లను తాము గెలుచుకోవడం ఖాయమని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు. 2018లో రాష్ర్ట ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని గుర్తుచేశారు.
కానీ తమ ఎమ్మెల్యేలను బీజేపీ నేతలు ప్రధాని నరేంద్ర మోదీ, శివరాజ్ సింగ్ చౌహాన్, అమిత్ షా కొనుక్కుని ప్రజా ప్రభుత్వాన్ని పడగొట్టారని రాహుల్ ఆరోపించారు. కమల్‌నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 27 లక్షల మంది రైతులకు రుణ మాఫీ చేసిందని తెలిపారు. కానీ 2020లో అక్రమంగా వచ్చిన బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలోని కూలీలు, రైతులు, చిరు వ్యాపారులు, నిరుద్యోగులను పట్టించుకోకుండా మోసం చేసిందని విమర్శించారు.
మధ్యప్రదేశ్‌లో తమ పార్టీ అధికారంలోకి వస్తే గోధుమలను క్వింటాల్‌కు రూ. 3 వేలకు, వరి క్వింటాల్‌కు రూ. 2,500 చొప్పున కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే, రూ.2 లక్షల వరకు రైతుల రుణాలను మాఫీ చేస్తామని స్పష్టం చేశారు. పార్లమెంటులో అదానీ గురించి మాట్లాడినందుకే తన లోక్‌సభ సభ్యత్వం, ప్రభుత్వ వసతిని తొలగించారని రాహుల్ పేర్కొన్నారు.
7 వేల కోట్ల ప్యాకేజీ మాయం
కాంగ్రెస్ ప్రభుత్వం బుందేల్‌ఖండ్ ప్రాంతానికి రూ.7 వేల కోట్ల ప్యాకేజీని కేటాయించిందని రాహుల్ తెలిపారు. ఆ డబ్బును ప్రజలకు వినియోగించకుండా బీజేపీ నేతలే మాయం చేశారని వెల్లడించారు. సూటు, బూటు ధరించిన వారి కోసమే కేంద్రం, రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని ఫైర్ అయ్యారు. మధ్యప్రదేశ్‌లో అవినీతిలో కూరుకుపోయిన బిలియనీర్ల ప్రభుత్వం కావాలో..లేదా రైతులు, కార్మికులు, చిరు వ్యాపారులు, యువత కోసం పనిచేసే కాంగ్రెస్ ప్రభుత్వం కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని సూచించారు.
కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కొడుకు 100 కోట్ల అవినీతికి పాల్పడ్డాడని..అదంతా మధ్యప్రదేశ్ ప్రజల సొమ్మేనని చెప్పారు. కాంగ్రెస్ వస్తే సబ్సిడీ విద్యుత్‌తోపాటు మహిళలకు నెలకు రూ.1500 ఆర్థిక సాయం అందిస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. కాగా.. ఈ నెల 17న మధ్యప్రదేశ్‌లోని మొత్తం 230 అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి పోలింగ్ జరగనుంది.