ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తాం: తిరుపతి సభలో రాహుల్

ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తాం: తిరుపతి సభలో రాహుల్

కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ. కాంగ్రెస్  భరోసా యాత్రలో భాగంగా తిరుపతి బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తిరుపతి వేదికగా మోడీ ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలయ్యాయని విమర్శించారు. అంతకు ముందు మేనల్లుడితో కలిసి కాలినడకన వెళ్లి తిరుమల శ్రీనివాసున్ని దర్శించుకున్నారు రాహుల్.

మోడీ ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు కావడం లేదని ఫైర్ అయ్యారు రాహుల్ గాంధీ.  ఏటా 2 కోట్ల మందికి ఉద్యోగం, ఉపాధి కల్పిస్తామని, పేదల ఖాతాల్లో 15 లక్షలు వేస్తామని మోడీ తిరుపతి వేదికగా ఇచ్చిన హామీలన్నీ పక్కన పెట్టేశారని మండిపడ్డారు రాహుల్. మోడీ ఇచ్చే హామీలు, ప్రకటనలు అన్నీ అబద్ధాలే అన్నారు. అవినీతిని అడ్డుకునేందుకు కాపలాదారుగా ఉంటానన్న వ్యక్తి అనిల్ అంబానీకి 30 వేల కోట్లు దోచి పెట్టారని విమర్శించారు.

కాంగ్రెస్ ఏది చెప్పిందో అది చేసి చూపిందన్నారు రాహుల్. భూసేకరణ చట్టంతో రైతులకు భరోసా ఏర్పడిందని, ఉపాధి హామీ పథకంతో పేదలకు మేలు జరిగిందన్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ లో 2 రోజుల్లోనే రైతు రుణాలు మాఫీ చేశామన్నారు.