
న్యూఢిల్లీ: బీజేపీ విమర్శలు ఎదుర్కొని నిలబడ్డారు. ప్రధాని మోదీ కామెంట్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్స్ ఇస్తూ ముందుకు సాగారు. భారత్ జోడోయాత్రతో రాహుల్‌గాంధీ ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకోగా.. సభలు, ర్యాలీల్లో తనదైన శైలిలో ప్రసంగిస్తూ ప్రియాంకగాంధీ జనాల్లో జోష్నింపారు. కాషాయ పార్టీకి అన్నాచెల్లెళ్లు ఇద్దరూ ముచ్చెమటలు పట్టించారు. ఫలితంగా ఎగ్జిట్ పోల్స్‌ను తలకిందులు చేస్తూ ఇండియా కూటమి 200 మార్క్‌ను దాటింది. కొన్నేండ్లుగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీని బీజేపీకి టార్గెట్ చేసింది. పప్పు, రాజకుమారుడు అంటూ ఆయనను గేలిచేసింది. దశాబ్దాలుగా ప్రతి ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీపైనే బీజేపీ అటాక్ చేస్తూ వస్తున్నది. అయితే, ఈ సారి ఎన్నికల్లో కాంగ్రెస్స్టార్ క్యాంపెయినర్లుగా రాహుల్, ప్రియాంక బీజేపీపై కౌంటర్ ఎటాక్ చేశారు.
జోడోయాత్రతో ప్రజల్లోకి
ఎన్నికలకు ముందే రాహుల్‌గాంధీ రెండు దశల్లో జోడో యాత్రకు శ్రీకారం చుట్టారు. దేశవ్యాప్తంగా పర్యటించారు. అందరి సమస్యలు తెలుసుకుంటూ, అధికారంలోకి వస్తే ఎలా పరిష్కరిస్తామో చెబుతూ ముందుకు సాగారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు వైఫల్యాలను ఎండగట్టారు. యాత్ర ఆద్యంతం ఆయన జనాలతో మమేకమయ్యారు. అన్ని వర్గాల ప్రజలను కలుస్తూ.. ఆలింగనం చేసుకుంటూ అందరిలో ఒకడిగా మెదిలారు. రైతులు, కార్మికులు, డ్రైవర్లు, మెకానిక్ లు, విద్యార్థులు, యువత, మహిళలతో ముచ్చటించారు. అప్పటివరకూ టీవీ స్ర్కీన్లపైనే కనిపించే రాహుల్‌గాంధీ తమ మధ్యకు రావడంతో ప్రజలుకూడా బ్రహ్మరథం పట్టారు. దీంతో భారత్ జోడో యాత్రకు జనాల్లో మంచి స్పందన లభించింది. ఇదే బీజేపీ సునాయాస విజయానికి అడ్డుకట్ట వేసింది.
బీజేపీకి కొరకరాని కొయ్యగా ప్రియాంక
రాహుల్‌గాంధీకి ఆయన చెల్లె ప్రియాంకగాంధీ సపోర్ట్‌గా నిలిచారు. మొదట ఆమె ఈ ఎన్నికల్లో పోటీచేస్తారని భావించారు. అయితే, తానుకూడా బరిలో నిలిస్తే ఒక నియోజకవర్గానికే పరిమితం కావాల్సి వస్తుందని, పోటీ ఆలోచన విరమించుకున్నట్టు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా దేశంలోని చాలాచోట్ల ఆమె ఇండియా కూటమి తరఫున సభలు, ర్యాలీల్లో పాల్గొన్నారు. అలాగే, తన ఫ్యామిలీకి కంచుకోటలుగా ఉన్న అమేథీ, రాయ్‌బరేలీల బాధ్యతను ఆమె భుజాన వేసుకున్నారు. ప్రతి మీటింగ్‌లోనూ బీజేపీ చేస్తున్న విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
ఇండియా కూటమి అధికారంలోకి వస్తే మంగళసూత్రాలు సహా ప్రజల ఆస్తిని దోచుకుంటారని మోదీ చేసిన వ్యాఖ్యలను ఆమె తిప్పికొట్టారు. ఈ దేశం కోసం తన తండ్రి ప్రాణ త్యాగం చేశారని, మానవబాంబు దాడిలో మరణించిన తన తండ్రి మృతదేహాన్ని రక్తంకారుతుండగా ఇంటికి తెచ్చుకున్నామంటూ భావోద్వేగానికి గురయ్యారు. తమ నానమ్మ ఇందిరాగాంధీ తన బంగారాన్ని కష్టసమయంలో దేశానికి అందిచారని తెలిపారు. మొత్తంగా మోదీ చేస్తున్న విమర్శలపై జనం ఆలోచించేలా ప్రియాంక తన వాగ్దాటిని పెంచారు. రాహుల్‌గాంధీతోపాటు ప్రియాంకకూడా కాంగ్రెస్ పార్టీకి జనాల్లో మైలేజ్ తీసుకొచ్చారు.