ఇవాళ నిర్మల్ లో రాహుల్​ గాంధీ బహిరంగ సభ

నిర్మల్, వెలుగు: నిర్మల్ లో ఆదివారం జరగబోయే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచార సభకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. స్థానిక క్రషర్ గ్రౌండ్ వద్ద ఉదయం 11 గంటలకు నిర్వహించే భారీ బహిరంగ సభకు రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డితో కలిసి హాజరుకానున్నారు. రాహుల్ గాంధీ నాందేడ్ నుంచి నిర్మల్ వరకు హెలికాప్టర్​లో రానున్నారు. నిర్మల్, ముథోల్, ఖానాపూర్, బోథ్ నియోజకవర్గాల నుంచి భారీ జనాన్ని సమీకరించేందుకు పార్టీ నేతలు కృషి చేస్తున్నారు.

మంత్రి సీతక్కతో పాటు డీసీసీ ప్రెసిడెంట్ శ్రీహరి రావు తదితరులు సభాస్థలి వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. సభను విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ పర్యటనతో ఎన్నికల ప్రచార రూపురేఖలు మారనున్నాయని అన్నారు. బీజేపీ‌‌, బీఆర్ఎస్​ను ఓడించేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ సమావేశంలో ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ, శ్రీహరి రావు, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, జడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.