- రెగ్యులర్ సోల్జర్ల మాదిరిగా బెనిఫిట్స్ ఎందుకు ఇవ్వట్లే
న్యూఢిల్లీ: సైన్యంలో అగ్నివీర్లపై వివక్ష ఎందుకని లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. రెగ్యులర్ సైనికులు, అగ్నివీర్ లు చేసే డ్యూటీ ఒకటే అయినప్పుడు.. ఒక సైనికుడి ప్రాణం మరో సైనికుడి ప్రాణం కంటే ఎలా విలువైనదో ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చెప్పాలని డిమాండ్ చేశారు. సైనికులకు, అగ్నివీర్లకు పెన్షన్లు, ఎక్స్ గ్రేషియా వంటివి ఒకేలా వర్తింపచేయడం లేదని, ఈ అన్యాయంపై తాను పోరాటం కొనసాగిస్తానన్నారు. ఇటీవల ఫైరింగ్ ప్రాక్టీస్ సందర్భంగా నాసిక్ లో ఇద్దరు అగ్నివీర్లు చనిపోయిన నేపథ్యంలో రాహుల్ ఈ మేరకు ఆదివారం ట్వీట్ చేశారు.
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అగ్నివీర్ స్కీంపై ఈ ఘటనతో మరోసారి తీవ్రమైన ప్రశ్నలు రేకెత్తాయన్నారు. ‘‘అగ్నివీర్ లు, ఇతర సోల్జర్లు అంతా చేసే డ్యూటీ ఒకటే అయినప్పుడు.. అగ్నివీర్ల కుటుంబాలకు పెన్షన్లు, ఇతర ప్రభుత్వ ప్రయోజనాలను ఎందుకు ఇవ్వట్లే. ప్రాణత్యాగం చేసి అమరులైన తర్వాత కూడా ఈ వివక్ష ఎందుకు?’’ అని ఆయన ప్రశ్నించారు. ‘‘ఈ అన్యాయానికి వ్యతిరేకంగా అందరూ గళమెత్తండి. దేశ యువత, ఆర్మీ భవిష్యత్తుకు భద్రత కోసం అగ్నివీర్ స్కీంను బీజేపీ ప్రభుత్వం తొలగించేలా ఒత్తిడి తెచ్చేందుకు గాను మేం నేడు చేపట్టిన ‘జై జవాన్’ ఉద్యమంలో భాగస్వాములు కండి” అని రాహుల్ పిలుపునిచ్చారు.