మేం ఎక్కడ అధికారంలోకి వచ్చినా కులగణన చేస్తం: రాహుల్ గాంధీ

మేం ఎక్కడ అధికారంలోకి వచ్చినా కులగణన చేస్తం: రాహుల్ గాంధీ
  • ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణలో  మొదలుపెట్టినం: రాహుల్ గాంధీ
  • బీజేపీ, ఆర్ఎస్ఎస్ అడ్డుకున్నా కులగణన చేసి తీరుతాం 
  • రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని ఎత్తివేస్తాం 
  • సంవిధాన్​ రక్షక్​ అభియాన్​ సదస్సులో  కాంగ్రెస్​ అగ్రనేత 

న్యూఢిల్లీ, వెలుగు: భవిష్యత్తులో కాంగ్రెస్ ఏ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా అక్కడ కులగణన చేస్తామని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే తెలంగాణలో కులగణన మొదలుపెట్టామని చెప్పారు. ‘‘కులగణనలో అడిగే ప్రశ్నలు ఒక గదిలో కూర్చుని 15 మంది రూపొందించలేదు. తెలంగాణ ప్రజలే వాటిని తయారు చేశారు. ఇది అధికారులు రూపొందించిన ప్రక్రియ కాదు.. ప్రజా ప్రక్రియ’’ అని పేర్కొన్నారు. మంగళవారం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని తాల్ కటోరా స్టేడియంలో ‘సంవిధాన్ ర‌‌‌‌‌‌‌‌క్షక్ అభియాన్’ స‌‌‌‌‌‌‌‌ద‌‌‌‌‌‌‌‌స్సు నిర్వహించారు. ఇందులో పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తదితరులు పాల్గొన్నారు. ఈ సదస్సులో రాహుల్ మాట్లాడుతూ.. ఐదారు శాతం ఉన్నోళ్లే దేశాన్ని కంట్రోల్ చేస్తున్నారని, కులగణన చేస్తే అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని అన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ అడ్డుకున్నా కులగణన చేసి తీరుతామని.. రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని ఎత్తివేస్తామని చెప్పారు. ‘‘దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని పార్లమెంట్ లో రాజ్యాంగం సాక్షిగా హామీ ఇచ్చాను. తప్పకుండా కులగణన చేస్తాం. తద్వారా అందరికీ సమాన హక్కులు కల్పిస్తాం” అని తెలిపారు. 

కులగణనతోనే  సామాజిక న్యాయం: సీఎం రేవంత్ 

కులగణనతోనే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని సీఎం రేవంత్ అన్నారు. దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని చెప్పి రాహుల్ గాంధీ మహా యుద్ధం ప్రకటించారని పేర్కొన్నారు. దేశ జనాభాలో ఎవరెంతో ఉన్నారో, వారికంత దక్కాలని చెప్పారు. రాహుల్ ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణలో కులగణన మొదలుపెట్టామని, ఇప్పటికే స‌‌‌‌‌‌‌‌ర్వే 92 శాతం పూర్తయింద‌‌‌‌‌‌‌‌ని వెల్లడించారు. ‘‘తొలి ప్రధాని నెహ్రూ నుంచి ఇందిరాగాంధీ వ‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌కు ఎస్సీ, ఎస్టీల‌‌‌‌‌‌‌‌కు రిజ‌‌‌‌‌‌‌‌ర్వేష‌‌‌‌‌‌‌‌న్లు, బ్యాంకుల జాతీయీక‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌ణ వంటి నిర్ణయాలతో సామాజిక న్యాయం 1.0 పూర్తయింది. 

రాజీవ్ గాంధీ హ‌‌‌‌‌‌‌‌యాంలో 18 ఏండ్లకే ఓటు హ‌‌‌‌‌‌‌‌క్కు, మండ‌‌‌‌‌‌‌‌ల్ క‌‌‌‌‌‌‌‌మిష‌‌‌‌‌‌‌‌న్ నివేదిక వంటి కార్యక్రమాల‌‌‌‌‌‌‌‌తో సామాజిక న్యాయం 2.0 పూర్తయింది. ఇప్పుడు సోనియా గాంధీ, మ‌‌‌‌‌‌‌‌ల్లికార్జున ఖ‌‌‌‌‌‌‌‌ర్గే, రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కులగ‌‌‌‌‌‌‌‌ణ‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌తో సామాజిక న్యాయం 3.0 ప్రారంభ‌‌‌‌‌‌‌‌మైంది” అని పేర్కొన్నారు. ‘‘ప‌‌‌‌‌‌‌‌దేండ్లుగా రాజ్యాంగం ప్రమాదంలో ఉంది. ప్రస్తుతం రాజ్యాంగ రక్షకులు, రాజ్యాంగ శత్రువులకు మధ్య పోరాటం జరుగుతున్నది. మహాత్మాగాంధీ పరివార్ రాజ్యంగ ర‌‌‌‌‌‌‌‌క్షణ‌‌‌‌‌‌‌‌కు పూనుకుంటే, సంఘ్ ప‌‌‌‌‌‌‌‌రివార్ రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నది. రాజ్యాంగ ర‌‌‌‌‌‌‌‌క్షణ‌‌‌‌‌‌‌‌కు రాహుల్ దేశవ్యాప్త ఉద్యమం చేపట్టారు. సామాజిక న్యాయంపై రాహుల్ చేపట్టిన ఉద్యమంలో ప్రజ‌‌‌‌‌‌‌‌లు భాగ‌‌‌‌‌‌‌‌స్వాములయ్యారు. అందుకే లోక్ సభ ఎన్నికల్లో మోదీని 240 సీట్లకే ప‌‌‌‌‌‌‌‌రిమితం చేశారు” అని అన్నారు. రాహుల్ చేపట్టిన రాజ్యాంగ రక్షణ ఉద్యమంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ప్రియాంకకు రేవంత్ కంగ్రాట్స్

వయనాడ్  లోక్ సభ ఉప ఎన్నికలో విజయం సాధించిన కాంగ్రెస్  ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌ రెడ్డి అభినందనలు తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం.. మంగళవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి 10 జన్ పథ్ లో ప్రియాంకను మర్యాదపూర్వకంగా కలిశారు. భారీ మెజారిటీ సాధించిన ఆమె.. కేరళ ప్రజల మనసు గెలిచారని సీఎం కొనియాడారు. కాగా.. తెలంగాణలో ప్రభుత్వ పాలన, మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, కులగణన, ఇతర అంశాలపై రేవంత్ ను ప్రియాంక అడిగి తెలుసుకున్నారని సమాచారం. 

ఏడాది కాలం పూర్తవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవాలకు రావాలని ప్రియాంకను రేవంత్  ఆహ్వానించారు. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు  జరుగుతోన్నందున సమయం చూసుకుని హాజరవుతానని ఆమె హామీ ఇచ్చినట్లు తెలిసింది. అనంతరం ఏఐసీసీ చీఫ్  మల్లికార్జున ఖర్గేను సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. రాజాజి మార్గ్ లోని ఖర్గే నివాసంలో ఆయనతో సీఎం భేటీ అయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, కులగణన, ప్రభుత్వ పాలన, ఏడాది విజయోత్సవాల ఏర్పాట్లపై ఖర్గేకు సీఎం వివరించారు. కాగా.. ఒక ప్రొగ్రాంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన మంత్రి పొన్నం ప్రభాకర్  సైతం ఖర్గేను మర్యాదపూర్వకంగా కలిశారు.