కేంద్రంలో కాంగ్రెస్ వస్తే ఏపీకి ప్రత్యేక హోదా : రాహుల్ గాంధీ

కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. కడప బహిరంగ సభలో మాట్లాడిన రాహుల్.. బీజేపీ బీ టీం చంద్రబాబు, పవన్, జగన్ బీజేపీ బీ టీం అని విమర్శించారు. జగన్ ఏనాడు కేంద్రాన్ని  ప్రశ్నించలేదన్నారు.  ఈ పదేళ్లలో  ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకు రాలేదని ప్రశ్నించారు. పోలవరం ఎందుకు పూర్తి కాలేదన్నారు.  కేంద్రంలోకి అధికారంలోకి  రాగానే కడప స్టీల్ ఫ్యాక్టరీ, పోలవరం పూర్తి చేస్తామని చెప్పారు. ప్రతి ఏడాది మహిళలకు లక్ష రూపాయలు ఇస్తామన్నారు. రైతురుణమాఫీ,రైతులకు కనీస మద్దతు ,  30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు,ఉపాధి కూలీ రూ.400 కు పెంచుతామని హామీ ఇచ్చారు.  అంగన్ వాడీల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పారు.

సీబీఐచార్జ్ షీట్ లో  వైఎస్సార్ పేరును కాంగ్రెస్ చేర్చలేదన్నారు రాహుల్ గాంధీ. హస్తం, వైఎస్సార్ ఒక్కటేనన్నారు.  కాంగ్రెస్, వైఎస్సార్ ఆలోచనలకు వ్యతిరేకంగా పనిచేయబోదన్నారు.   రాజశేఖర్ యాత్ర స్ఫూర్తితోనే  తాను  యాత్ర చేశానని చెప్పారు రాహుల్.  తన తండ్రికి వైఎస్సార్ మంచి స్నేహితుడు.  రాజశేఖర్ రెడ్డిని చూస్తూ పెరిగిన,  పాదయాత్రతో  పేదల కష్టాలను చూశా. పాదయాత్రలో పేదలకు దగ్గరయ్యా. రాజశేఖర్ రెడ్డి పాలన దేశానికే ఆదర్శం.  ఉమ్మడి ఏపీలో వైఎస్సార్ సేవలు మరువలేమన్నారు రాహుల్.

మోదీ రాజ్యాంగాన్నినాశనం చేయాలని చూస్తుండని విమర్శించారు రాహుల్.  పేదలకు హక్కులు లభించేది రాజ్యాంగం వల్లేనని చెప్పారు. భారత రాజ్యాంగాన్ని మోదీ కాదు ప్రపంచంలో ఎవరూ మార్చలేరన్నారు. షర్మిల పార్లమెంట్ లో ఉండాలి.. షర్మిల  నా చెల్లెలు, లోక్ సభకు పంపించాలి.  ఏపీ ప్రజల ఆలోచనను ఢిల్లీ పార్లమెంట్ లో వినిపిస్తుంది. షర్మిలను  సీబీఐ, ఈడీ ఏం చెయ్యలేదని చెప్పారు రాహుల్.