పంజాబ్ లో అడుగు పెట్టిన రాహుల్ గాంధీ

పంజాబ్ లో అడుగు పెట్టిన రాహుల్ గాంధీ

భారత్ జోడో యాత్ర భారీ ప్రసంగాలు చేయడానికి కాదని..ప్రజలు చెప్పేది వినడానికే యాత్ర చేస్తున్నట్లు రాహుల్ గాంధీ తెలిపారు. దేశంలో  ద్వేషం, హింస, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటివి పెరిగిపోయాయని... ఆ సమస్యలను యాత్ర ద్వారా లేవనెత్తి..ప్రజలతో కలిసి  పోరాటం చేయవచ్చనే ఉద్దేశతో యాత్ర చేస్తున్నట్లు చెప్పారు. దేశంలో బీజేపీ  ప్రజల మధ్య ద్వేషాన్ని, భయాన్ని వ్యాప్తి చేస్తోందని ఆరోపించారు. దేశం మత సామరస్యం, ఐక్యత, గౌరవానికి సూచిన అని చెప్పారు.  కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్ర పంజాబ్లో కొనసాగుతోంది. ఇవాళ పంజాబ్ లోని ఫతేహగ్ సాహిబ్లో రాహుల్ గాంధీ చేస్తున్న యాత్రలో స్థానికులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అక్కడి ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించిన అనంతరం ఫతేహగ్ సాహిబ్లో ఏర్పాటు చేసిన సభలో రాహుల్ గాంధీ  మాట్లాడారు.

ప్రత్యామ్నాయ మార్గం కోసమే యాత్ర

యాత్ర ప్రారంభించడానికి గల కారణాన్ని వివరిస్తూ బీజేపీ, రాష్ట్రీయ స్వయంసేవా సంఘ్‌పై  రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. దేశంలో ద్వేషం, హింసాత్మక వాతావరణం వ్యాపించిందన్నారు. బిజేపి,ఆర్‌ఎస్‌ఎస్ లు  దేశాన్ని విభజించడానికి పూనుకున్నాయని ఆరోపించారు. ఒక మతం మరో మతానికి వ్యతిరేకంగా పోరాడేలా చేయడం; ఒక కులం మరొకరితో పోరాడేలా చేయడం...ఒక భాషకు వ్యతిరేకంగా మరో భాషను ఇరకాటంలో పెట్టేందుకు బీజేపీ నేతలు, ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తోందన్నారు. బీజేపీ  దేశ వాతావరణాన్ని పాడు చేసిందని ఘాటు వ్యాఖ్యల చేశారు. కాబట్టి దేశానికి ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపాలని భావించి ఈ యాత్ర ప్రారంభించామని రాహుల్ గాంధీ అన్నారు.


బీజేపీ పాలిత రాష్ట్రంలో భారీ స్పందన

భారత్ జోడో యాత్రకు  బీజేపీ పాలిత  కర్ణాటకలో పెద్దగా స్పందన రాదని అనుకున్నారని..కానీ తమిళనాడు, కేరళ కంటే కర్ణాటకలోనే యాత్రకు మంచి ఆదరణ లభించిందని రాహుల్ గాంధీ తెలిపారు. మహారాష్ట్రలోనూ స్పందన రాలేదని బీజేపీ నేతలు ప్రకటించారని..కానీ మహారాష్ట్రలోనూ  విశేష స్పందన వచ్చిందన్నారు.  మహారాష్ట్ర కంటే మధ్యప్రదేశ్‌లో స్పందన మెరుగ్గా ఉందన్నారు.  హర్యానాలో పెద్దగా స్పందన ఉండదని చెప్పారని....మధ్యప్రదేశ్ కంటే  హర్యానాలో మెరుగైన స్పందన వచ్చిందన్నారు. ప్రస్తుతం పంజాబ్‌లో హరియాణా కంటే ప్రజల నుంచి స్పందన వస్తోందన్నారు. భారత్ జోడో యాత్రలో తాను ఎంతో నేర్చుకున్నానని రాహుల్ గాంధీ తెలిపారు.రైతులు, కార్మికులు, దుకాణదారులు, వ్యాపారులు, మహిళలతో సహా సమాజంలోని వివిధ వర్గాలతో సంభాషించి, వారి నుండి అభిప్రాయాలను విన్నానన్నారు. 


కశ్మీర్ లో ముగియనున్న యాత్ర..

2022 సెప్టెంబర్ లో తమిళనాడు కన్యాకుమారి నుంచి భారత్ జోడో యాత్రను ప్రారంభించిన రాహుల్ గాంధీ..తమిళనాడు, కర్ణాటక, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో యాత్ర చేశారు. ప్రస్తుతం పంజాబ్ లో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. పంజాబ్ లో 8 రోజుల యాత్ర తర్వాత కశ్మీర్ లో అడుగుపెట్టనున్నారు. జనవరి 30న శ్రీనగర్ లో యాత్ర ముగుస్తుంది.