
- బీజేపీని ఓడించేది కాంగ్రెస్సే
- గుజరాత్ నుంచే ఆ పార్టీ పతనం మొదలవుతుంది: రాహుల్
- అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తామని ధీమా
ఆరావళి: దేశంలో బీజేపీ, ఆర్ఎస్‌ఎస్‌ను ఓడించే సత్తా కాంగ్రెస్‌కు మాత్రమే ఉందని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. ‘‘మన దేశంలో రెండు సిద్ధాంతాలకు మధ్య యుద్ధం జరుగుతున్నది. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకే సిద్ధాంతాలు ఉన్నాయి. బీజేపీ, ఆర్ఎస్ఎస్‌ను ఓడించగలిగేది కాంగ్రెస్ మాత్రమే” అని చెప్పారు. బుధవారం గుజరాత్ ఆరావళి జిల్లాలోని మోడాసాలో నిర్వహించిన కాంగ్రెస్ బూత్ లెవల్ కార్యకర్తల సమావేశంలో రాహుల్ మాట్లాడారు. కాంగ్రెస్‌కు గుజరాత్ ఎంతో ముఖ్యమైన రాష్ట్రమని ఆయన తెలిపారు. ‘‘కాంగ్రెస్ గుజరాత్ నుంచే పుట్టింది. పార్టీకి చెందిన ఇద్దరు గొప్ప నాయకులు మహాత్మాగాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్‌ది గుజరాత్‌నే. ఈ రాష్ట్రం నుంచే బీజేపీ పతనం మొదలవుతుంది. 2027లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీని ఓడిస్తాం” అని చెప్పారు.
గెలుపు గుర్రాలకే టికెట్లు..
గుజరాత్‌లో కాంగ్రెస్‌ను బలోపేతం చేస్తామని, పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తామని రాహుల్ తెలిపారు. కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ‘‘దాదాపు మూడు దశాబ్దాలుగా రాష్ట్రంలో మనం అధికారంలో లేకపోవడంతో కాంగ్రెస్ క్యాడర్ డీలా పడిపోయింది. కానీ మనం తలుచుకుంటే బీజేపీని సులభంగా ఓడించగలం. దానికి పార్టీలో కొన్ని మార్పులు చేస్తే సరిపోతుంది. స్థానిక లీడర్లను సంప్రదించకుండా టికెట్లు ఇవ్వడం పార్టీ ఓటమికి కారణమని నా దృష్టికి వచ్చింది. గెలుపు గుర్రాలను వదిలేసి, ఇతరులకు టికెట్లు ఇవ్వడమే దీనికి కారణమని తెలిసింది. మనం పరిగెత్తే గుర్రాలను వదిలేసి, పెళ్లిలో డ్యాన్స్ చేసే గుర్రాలకు టికెట్లు ఇచ్చాం. కానీ ఇకపై ఇలాంటివి జరగకుండా చూస్తాం. గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తాం” అని తెలిపారు. డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ (డీసీసీ)లను బలోపేతం చేస్తామని చెప్పారు. ఇందుకోసం ఫైవ్ మెంబర్ కమిటీని ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఈ కమిటీ ప్రతి జిల్లాలోనూ పార్టీ కార్యకర్తలతో మాట్లాడి, జిల్లా అధ్యక్షుడికి అర్హులైనోళ్ల పేర్లను షార్ట్ లిస్టు చేస్తుందని పేర్కొన్నారు.