ధైర్యం, సత్యాన్ని వారసత్వంగా పొందా..ఎక్స్ లో రాహుల్​ గాంధీ పోస్ట్  

ధైర్యం, సత్యాన్ని వారసత్వంగా పొందా..ఎక్స్ లో రాహుల్​ గాంధీ పోస్ట్  

న్యూఢిల్లీ: భారత తొలి ప్రధాని జవహర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాల్ నెహ్రూ భారతీయులకు అణచివేతను ఎదిరించి, స్వాతంత్ర్యాన్ని సాధించే ధైర్యాన్ని ఇచ్చారని.. అదే ఆయన గొప్ప వారసత్వమని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు. తన ముత్తాత(నెహ్రూ) నుంచి తాను కూడా ‘సత్యం, ధైర్యం’ను వారసత్వంగా పొందానని చెప్పారు. కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్‌‌‌‌‌‌‌‌తో పోడ్ కాస్ట్ తరహాలో తాను చేసిన చర్చను రాహుల్ గాంధీ శనివారం తన ‘ఎక్స్’ ఖాతాలో, యూట్యూబ్ చానెల్ లో పోస్ట్ చేశారు.

‘‘నెహ్రూ మనకు రాజకీయాలు నేర్పలేదు. భయాన్ని ఎదిరించి సత్యం కోసం నిలబడాలని నేర్పారు’’ అని తెలిపారు. ‘‘నెహ్రూ కేవలం రాజకీయవేత్త మాత్రమే కాదు. ఆయన ఒక అన్వేషకుడు, ఆలోచనాపరుడు. ప్రమాదంలోకి నవ్వుతూ నడిచి, మరింత బలంగా బయటకు వచ్చిన వ్యక్తి. అందుకే అన్వేషించడం, ప్రశ్నించడం, ఆసక్తితో పరిశీలించడం వంటివి నా రక్తంలోనే ఉన్నాయి” అని రాహుల్ పేర్కొన్నారు. నెహ్రూ గురించి తన నాన్నమ్మ, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ చెప్పిన విషయాలనూ ఆయన గుర్తు చేసుకున్నారు.

‘‘నెహ్రూతోపాటు గాంధీ, అంబేద్కర్, పటేల్, బోస్ వంటి మహనీయులు కూడా భయాన్ని ఎలా జయించాలన్నది మనకు నేర్పారు. గాంధీ సత్యం తప్ప మరేమీ లేకుండా బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించారు. మీరు కూడా అహింసకు కట్టుబడి ఉంటే, సత్యమే మీ ఏకైక ఆయుధం అవుతుంది’’ అని ఆయన పేర్కొన్నారు. ‘‘నేడు ఇండియాలో సత్యం ప్రమాదంలో పడింది. అందుకే నేను దాని కోసమే నిలబడాలని నిర్ణయించుకున్నానను. అందుకోసం ఎంత మూల్యం చెల్లించుకునేందుకైనా సిద్ధం” అని రాహుల్ తెలిపారు.