- దేశాన్ని విడగొడుతున్నానంటూ నాపై తప్పుడు ప్రచారం: రాహుల్ గాంధీ
- కులాల వారీగా జనాభా లెక్క తేల్చి పేదలకు సంపద పంచాలి
- తెలంగాణలో చేపట్టే కులగణన దేశానికి రోల్ మోడల్ కావాలి
- ప్రజల ఆలోచనల మేరకే కులగణన ప్రశ్నలు ఉండాలి
- కేంద్రంలో అధికారంలోకి వస్తే రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి ఎత్తేస్తాం
- దేశంలో కుల వివక్షపై ప్రధాని మోదీ ఎందుకు మాట్లాడటం లేదని ఫైర్
- కులగణన సంప్రదింపుల సదస్సులో పాల్గొన్న కాంగ్రెస్ అగ్రనేత
- కులగణన చేసి బీసీలకు దక్కాల్సిన రిజర్వేషన్లు అందిస్తాం: సీఎం రేవంత్
హైదరాబాద్, వెలుగు: దేశంలో కులాల వారీగా జనాభా లెక్క తేల్చి, జాతి సంపదను పేదలకు పంచేందుకు కులగణన చేయాలని తాను కోరితే.. అదేదో దేశ ద్రోహంగా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. కులగణనపై తాను పదే పదే డిమాండ్ చేస్తుంటే.. తాను దేశాన్ని విడగొడుతున్నానంటూ ప్రధాని మోదీ, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారని మండిపడ్డారు. మంగళవారం పీసీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ బోయిన్‌పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్లో కాంగ్రెస్ పార్టీ నేతలు, వివిధ కుల సంఘాల ముఖ్యులు, ప్రొఫెసర్లు, లాయర్లు, ఇతర మేధావులతో కులగణనపై సంప్రదింపుల సదస్సు జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన రాహుల్ మాట్లాడుతూ.. దేశంలో ఇప్పటికీ తీవ్ర స్థాయిలో కులవివక్ష ఉందన్నారు. అలాంటి కుల వివక్షపై ప్రధాని మోదీ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. ‘కులగణన చేస్తే ఏ కులం వాళ్లు ఎంత మంది ఉన్నారు? ఎవరి దగ్గర ఏముంది? ఎవరు పేదలు? అనే వివరాలు తెలుస్తాయి. శరీరంలో ఏదైనా వ్యాధి ఉందో లేదో తెలియాలంటే ఎక్స్‌రే చేయాలి కదా. దేశంలో కూడా కుల వివక్ష అనే వ్యాధి ఉంది. అది ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు మేం పరీక్షలు చేయాలని అడుగుతున్నాం. కానీ దీనికి ప్రధాని మోదీ ఎందుకు అడ్డుగా మాట్లాడుతున్నారు?’’ అని ప్రశ్నించారు.
తాము దేశవ్యాప్తంగా కులగణన చేసి జనాభాకు తగ్గట్టు రిజర్వేషన్లు పెంచాలని నిర్ణయించామని, ఇందులో భాగంగానే కులగణన చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని, ఇది అభినందనీయమని పేర్కొన్నారు. తెలంగాణలో కులగణన చేసేందుకు ప్రశ్నలను అధికారులు తయారు చేయవద్దని, ప్రజల నుంచి వారి ఆలోచనలకు అనుగుణంగా ప్రశ్నలు తయారు చేయాలని సూచించారు. తెలంగాణలో చేపట్టే కులగణన దేశానికి రోల్ మోడల్ కావాలని పిలుపునిచ్చారు. ‘‘ప్రపంచంలోని మిగతా దేశాలతో పోలిస్తే మన దేశంలో కుల వివక్ష, ఆర్థిక అసమానతలు తీవ్రంగా ఉన్నాయని సర్వేల్లో తేలింది. అందుకే మేం అధికారంలోకి వస్తే కులవివక్ష తొలగించి జాతి సంపదను అందరికీ సమానంగా పంచేందుకు కృషి చేస్తాం. అలాగే రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని ఎత్తేస్తాం’’ అని రాహుల్ తెలిపారు.
కులవివక్ష ఎట్లుంటదో అనుభవించేటోళ్లకే తెలుస్తది..
దేశంలో కులవివక్ష ఏ స్థాయిలో ఉందో రాహుల్చెప్తూ, దాన్ని టైటానిక్ ఘటనతో పోల్చారు. ‘‘టైటానిక్ పడవను తయారు చేసినోళ్లు ..‘ఈ పడవ ప్రపంచంలోనే అత్యంత పెద్దది. ఇది ఎన్నటికీ మునిగిపోదు’ అని అనుకున్నారు. కానీ టైటానిక్ పడవ 1912లో సముద్రంలో ఒక మంచు కొండను ఢీకొని కేవలం 20 నిమిషాల్లో మునిగిపోయింది. ఎందుకంటే సముద్రంలో ఆ మంచు కొండ 10 శాతం మాత్రమే బయటకు కనిపించింది. మిగతా 90 శాతం సముద్రం లోపల ఉండి బయటకు కనిపించలేదు. అందుకే ఆ పడవ కుప్పకూలింది. అలాగే మన దేశంలో కుల వివక్ష కూడా సముద్రం లోపల ఉన్న మంచు గడ్డ లాంటిది. ప్రజలకు కనిపించనంత స్థాయిలో ఈ దేశంలో కులవివక్ష ఉంది. ఇది దేశానికి చాలా ప్రమాదకరం. కుల వివక్ష అనుభవించేవాళ్లకే ఆ బాధ తెలుస్తుంది. ఇతరులకు ఏం తెలుస్తుంది?’’ అని రాహుల్ అన్నారు. కుల వివక్ష అన్ని చోట్ల ఉందని చెప్పారు. ‘‘రాజకీయ, న్యాయ, కార్పొరేట్ వ్యవస్థల్లోనూ కుల వివక్ష ఉంది. కార్పొరేట్ సంస్థల్లో ఇప్పటి వరకు ఎంత మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలు పని చేస్తున్నారు? మీడియా రంగంలో ఆదివాసీలు ఎంత మంది ఉన్నారు? అని నేను పదేపదే ప్రధాని మోదీని అడుగుతున్నాను. అందుకే నేను దేశాన్ని విడగొడుతున్నానంటూ నాపై రాజకీయంగా బురదజల్లుతున్నారు” అని మండిపడ్డారు. ‘‘కుల వివక్ష మనిషిలోని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తున్నది. ఎవరైనా సరే సమాజంలో ఈ కుల వివక్ష ఉందని ఒప్పుకొని తీరాల్సిందే. ఈ దేశంలో కుల వివక్ష లేదంటూ నేను మిగతావాళ్లలా దళితులకు, ఆదివాసీలకు, ఓబీసీలకు అబద్ధాలు చెప్పలేను’’ అని అన్నారు. ఈ కుల వివక్ష వల్లే భారత రాజ్యాంగానికి ముప్పు ఏర్పడిందని, దేశం అన్ని రంగాల్లో ముందుకు పోవాలంటే కుల వివక్షను నిర్మూలించాలన్నారు.
కులగణనతో సుపరిపాలన..
దేశంలో ఉన్న కులాలు, ఉపకులాల సంఖ్యను తెలుసుకునేందుకు మాత్రమే కులగణన చేయడం లేదని.. దీని ద్వారా వ్యవస్థలను సరిచేసి, దేశ ప్రజలకు సుపరి పాలన అందించవచ్చని రాహుల్ చెప్పారు. ‘‘ఒక ప్రముఖ ఆర్థిక నిపుణుడు నాతో మాట్లాడుతూ.. అసమానతలకు భారత్ కేరాఫ్ అడ్రస్ అన్నారు. ఇందుకు కుల వివక్షే ప్రధాన కారణమని చెప్పారు. ఇప్పటికీ దేశంలో దళితులను అంటరానివాళ్లుగా చూస్తున్నారు. ఇంతటి వర్ణ వివక్ష ప్రపంచంలో మరె క్కడా లేదు’’ అని రాహుల్ తెలిపారు. ఈ వివక్షను రూపుమాపే అవకాశం కులగణన ద్వారా సాధ్యమ వుతుందన్నారు. ‘కులగణనతో దేశంలో ఎంత మంది దళితులు, ఆదివాసీలు, ఓబీసీలు ఉన్నార నే లెక్క పక్కాగా తేలుతుంది. తద్వారా ఆయా వర్గాలకు ఏ మేరకు నిధులను పంపిణీ చేయాలో తెలుస్తుంది. విధానపరమైన నిర్ణయాలూ తీసుకోవచ్చు. అభివృద్ధికి ఒక మార్గం ఏర్పడుతుంది. తద్వారా భవిష్యత్‌కు మార్గనిర్దేశం జరుగుతుం ది. అలాంటి కులగణన అంటే ప్రధాని ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదు.
కుల వివక్షకు అనుకూలంగా ఉన్నవారే.. కులగణనను వ్యతిరేకిస్తున్నారు” అని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే జాతీయ స్థాయిలో కులగణన చేస్తామని, బ్యూరోక్రాట్ల కోణంలో కాకుండా పేదల కోణంలో కులగణన జరగాల్సిన అవసరం ఉందని అన్నారు.
దేశవ్యాప్తంగా చేపట్టాలి: సీఎం రేవంత్
కులగణనను పూర్తి చేసి బీసీలకు న్యాయంగా దక్కాల్సిన రిజర్వేషన్లను అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 2025లో దేశవ్యాప్తంగా చేపట్టనున్న జనగణనలో కులగణనను పరిగణన లోకి తీసుకోవాలని కేంద్రాన్ని కోరుతూ ఇదే వేదిక పైనుంచి తీర్మానం చేస్తున్నామని ప్రకటించారు. ‘‘సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉద్యోగ, ఉపాధి కోసం కులగణన సర్వే చేయడమనేది ప్రభుత్వ బాధ్యతగా భావించాం. పౌరసమాజం నుంచి సూచనలు తీసుకోవడానికి రాహుల్ గాంధీ రావడం గొప్ప విషయం. దేశ వ్యాప్తంగా కులగణన చేస్తామనే నిర్ణయం తీసుకోవాలంటే ఎంతో గుండె ధైర్యం కావాలి. సామాజిక బాధ్యతగా సమాన అవకాశాలు ఇవ్వాలన్న ఆలో చనతో రాహుల్ గాంధీ ఇక్కడకు వచ్చి, ఈ కులగ ణన సంప్రదింపుల కార్యక్రమంలో పాల్గొన్నారు. మాటలు కాదు... చేతలతో చూపాలన్నది రాహుల్ గాంధీ ఆలోచన. ఆయన ఇచ్చిన మాటను నెరవేర్చడ మే మన కర్తవ్యం’’ అని అన్నారు. ఇటీవల నిర్వహిం చిన గ్రూప్ 1 పరీక్షలో 31,383 మంది మెయిన్స్ కు ఎంపికయ్యారని.. వారిలో ఓసీలు-3,076 (9.8%), ఈడబ్ల్యూఎస్- 2,774 (8.8%), ఓబీసీలు-17,921 (57.11%), ఎస్సీలు- 4,828 (15.3%), ఎస్టీలు- 2,783 (8.8%) మంది ఉన్నారని వెల్లడించారు.
ఇచ్చిన హామీ మేరకు కులగణన: భట్టి
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కులగణన చేపడుతున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ‘‘తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కులగణన చేపడతామని అసెంబ్లీ ఎన్నికల టైమ్ లో రాహుల్ గాంధీ ప్రకటించారు. ఆయన ఇచ్చిన మాటకు కట్టుబడి కులగణన నిర్వహిస్తున్నాం. బుధవారం నుంచి కులగణన ప్రారంభమవుతుంది” అని చెప్పారు.
చిత్తశుద్ధితో పని చేస్తున్నం: ఉత్తమ్
కులగణన చేపట్టేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తున్నదని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ‘‘తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కులగణన చేపడతామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. అలాగే దీన్ని మేనిఫెస్టోలోనూ చేర్చాం. ఇచ్చిన మాట ప్రకారం కులగణన చేస్తున్నాం. ఇందుకోసం తమిళనాడు, కర్నాటకలో స్టడీ చేశాం. జనాభా దామాషా ప్రకారం లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు పెంచుతాం” అని చెప్పారు.
ప్రపంచంలోని మిగతా దేశాలతో పోలిస్తే మన దేశంలో కుల వివక్ష, ఆర్థిక అసమానతలు తీవ్రంగా ఉన్నాయని సర్వేల్లో తేలింది. మేం అధికారంలోకి వస్తే కులవివక్షను తొలగించి జాతి సంపదను అందరికీ సమానంగా పంచేందుకు కృషి చేస్తాం. అలాగే రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని ఎత్తేస్తాం.
- రాహుల్ గాంధీ