సీఎం కేసీఆర్​పై రాహుల్​ గాంధీ ఫైర్

  • వ్యవస్థల్ని ఆగం పట్టిచ్చిండు.. ప్రాజెక్టులు, ధరణి పేరుతో దోచుకుంటున్నడు
  • పేదలకు కాంగ్రెస్ ఇచ్చిన భూముల్ని టీఆర్ఎస్​ సర్కార్​ గుంజుకుంటున్నది
  • తెలంగాణ ప్రజలు ఏదైనా అనుకుంటే సాధించేదాకా నిద్రపోరు
  • మేం అధికారంలోకి వస్తే గిరిజనులు, దళితులకు భూములపై హక్కులు కల్పిస్తం
  • మోడీ, కేసీఆర్​ ఒక్కటేనని విమర్శ.. రాష్ట్రంలో ముగిసిన భారత్​ జోడో యాత్ర

కామారెడ్డి, వెలుగు: తెలంగాణ ప్రజలకు పట్టుదల ఎక్కువ అని,  ఏదైనా అనుకుంటే సాధించకుండా నిద్రపోరని కాంగ్రెస్  నేత రాహుల్​గాంధీ ప్రశంసించారు. దేశానికి నేర్పించే శక్తి తెలంగాణ సమాజానికి ఉందని కొనియాడారు. కానీ ఇక్కడి ప్రజల ఆశల్ని సీఎం కేసీఆర్​ చిదిమేశారని, వ్యవస్థలన్నింటినీ ధ్వంసం చేస్తూ అప్రజాస్వామికంగా పాలిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ‘భారత్​ జోడో’ యాత్రలో  భాగంగా  సోమవారం కామారెడ్డి జిల్లాలో రాహుల్​ పర్యటించారు.  బిచ్కుంద మండలం పత్లాపూర్​ నుంచి ప్రారంభమైన యాత్ర ఎక్లారా వరకు సాగి.. మహారాష్ట్రలోకి ప్రవేశించింది. మహారాష్ట్రలోకి ప్రవేశించే ముందు మద్నూర్​ మండలం మేనూర్​లో నిర్వహించిన బహిరంగ సభలో రాహుల్​ ప్రసంగించారు.

‘ధరణి’తో సామాన్యులకు తిప్పలు

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాష్ట్రంలోని  దళితులు, గిరిజనులు, పేదలకు లక్షల ఎకరాల భూములు ఇచ్చారని, ఆ భూములను కేసీఆర్​ సర్కారు గుంజుకుంటున్నదని రాహుల్​ అన్నారు. యూపీఏ సర్కారు తీసుకొచ్చిన  ట్రైబల్​ బిల్లును ఇక్కడి ప్రభుత్వం అమలు చేయడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్​ అధికారంలోకి రాగానే  గిరిజనులు, దళితులకు భూములపై హక్కులు కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. తెలంగాణలో రైతులు సంతోషంగా లేరని, పంటలకు గిట్టుబాటు ధర రావట్లేదని అన్నారు.  తాము అధికారంలోకి వచ్చిన తర్వాత  అన్ని పంటలకు మద్దతు ధరతో పాటు రైతులకు రుణమాఫీ చేస్తామని ​చెప్పారు. ‘‘తెలంగాణ సీఎం పొద్దున  ఇరిగేషన్​ ప్రాజెక్టుల్లో కమీషన్ల గురించి ఆలోచిస్తూ  రాత్రి డిజైన్లు గీస్తారు.. రాత్రి కంప్యూటర్​ మీద ధరణి  పోర్టర్​  తెరుస్తారు. వీటి వల్ల సామాన్యులకు తిప్పలు తప్ప మరేం ఫాయిదా లేదు” అని అన్నారు. 

‘‘తెలంగాణలో యాత్ర సాగుతున్నప్పుడు నేనొక  విషయం గమనించాను. ఓ చిన్న పిల్లవాడు యాత్ర చూసేందుకు వచ్చాడు.. ముందుకు తోసుకొని రావడానికి  ప్రయత్నించాడు.. కానీ కొందరు ఆ పిల్లవాడ్ని నెట్టేశారు..  అయినప్పటికీ పట్టువీడకుండా మరో వైపు నుంచి ప్రయత్నించాడు.. నెట్టేస్తే కింద పడి దెబ్బలు తాకాయి.. అయినా మరోవైపు నుంచి ప్రయత్నించాడు..  మొత్తం మీద అన్ని వైపుల నుంచి శ్రమించి నా దగ్గరకు వచ్చాడు. తండ్రితో వచ్చావా? అని అడిగాను. లేదు, తానే వచ్చానని చెప్పాడు. తన తండ్రికి డెంగీ జ్వరం వచ్చి ఇంట్లో ఉన్నాడని అన్నాడు. వెంటనే ఆ తండ్రికి వైద్యసాయం అందించాలని నా మనుషులకు చెప్పాను” అని రాహుల్​ తెలిపారు. ఈ పిల్లవాడే కాదు, రైతులు, కార్మికులు, ఇతర అన్ని వర్గాల ప్రజలు తెలంగాణలో ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా పడి లేస్తూ ముందుకెళ్తున్నారని, ఏదైనా సాధించే వరకు ఇక్కడి ప్రజలు వెనక్కిపోరని ఆయన అన్నారు. ‘‘ఆ పిల్లవాడి తండ్రి హాస్పిటల్​కు పోకుండా ఏ శక్తి అడ్డుకుందో తెలుసుకోవాలి. రాష్ట్రంలో అన్ని హాస్పిటల్స్​ ప్రైవేటీకరించడమే ఇందుకు కారణం. ఇక్కడి సర్కార్​ స్కూళ్లలో చదువుకునే పరిస్థితి లేదు.  ఇంజినీరింగ్​ చదవాలన్నా, ఇంకా ఏ ఉన్నతవిద్య చదవాలన్నా లక్షల్లో ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేసీఆర్​ సర్కార్​ తెలంగాణలో విద్యావ్యవస్థను నాశనం చేసింది.  ప్రైవేట్​వ్యక్తులకు అమ్మేస్తున్నది”అని రాహుల్​ మండిపడ్డారు. 

ఆ ఇద్దరూ ఒక్కటే

ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రంలో సీఎం కేసీఆర్​ ఇద్దరూ కలిసి పని చేస్తారని, పార్లమెంట్​లో మోడీ ఏ చట్టాన్ని తీసుకొచ్చినా, కేసీఆర్​మద్దతు ఇస్తారని రాహుల్​ దుయ్యబట్టారు. కేంద్రం తెచ్చిన  రైతు వ్యతిరేక చట్టాలకు బయట  కేసీఆర్, పార్లమెంట్​లో టీఆర్​ఎస్​ ఎంపీలు మద్దతు తెలిపారని అన్నారు. మోడీ, కేసీఆర్​ రైతులు, సామాన్య ప్రజల నుంచి ఆస్తులను గుంజుకొని ఇద్దరు ముగ్గురు బడా వ్యాపారులు, కాంట్రాక్టర్లకు కట్టబెడుతున్నారని రాహుల్​ ఆరోపించారు.  తెలంగాణలో ఇరిగేషన్​ ప్రాజెక్టులు, ధరణి  పోర్టల్​ పేరుతో కేసీఆర్​అక్రమాలకు పాల్పడుతున్నారని, అక్కడ మోడీ  రైల్వే , బీహెచ్​ఈఎల్​ లాంటి  ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తున్నారని చెప్పారు.  పెద్ద నోట్ల రద్దు,  జీఎస్టీతో చిన్న పరిశ్రమలు దెబ్బతిని, లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారని రాహుల్​ అన్నారు. మోడీ సర్కారు దేశవ్యాప్తంగా  విధ్వంసకర, విచ్ఛిన్నకర పరిస్థితులు తీసుకువచ్చి ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నదని మండిపడ్డారు. ఆ హింస, విధ్వంసానికి వ్యతిరేకంగానే తాను భారత్ ​జోడో యాత్ర చేపట్టానని  ఆయన అన్నారు. తెలంగాణలో యాత్రకు మంచి స్పందన వచ్చిందని,  ఇక్కడి ప్రజల నుంచి ఎన్నో విషయాలను నేర్చుకున్నానని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్​ కార్యకర్తలు అద్భుతంగా పని చేస్తున్నారని, కాంగ్రెస్​ జెండాలో పాటు, దేశ జెండాను మోస్తున్నారని కొనియాడారు.