అదానీని అరెస్ట్​ చేయాల్సిందే..ఇండియా కూటమి నేతల డిమాండ్

అదానీని అరెస్ట్​ చేయాల్సిందే..ఇండియా కూటమి నేతల డిమాండ్
  • పార్లమెంటు ఆవరణలో ప్రతిపక్ష ఎంపీల నినాదాలు
  • ‘మోదీ, అదానీ భాయి భాయి’ అంటూ బ్లాక్ మాస్క్​లతో మార్చ్
  • ర్యాలీగా వెళ్లి అంబేద్కర్‌ విగ్రహానికి నివాళులు
  • ఆందోళనలో‌ పాల్గొన్న ఎంపీలు గడ్డం వంశీ, చామల, మల్లు, అనిల్ తదితరులు

న్యూఢిల్లీ, వెలుగు:  అదానీని అరెస్ట్​చేయాల్సిందేనని ఇండియా కూటమి నేతలు డిమాండ్​చేశారు. అదానీ ముడుపుల వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) తో విచారణ జరిపించాలని ప్రతిపక్ష పార్టీల నేతలు శుక్రవారం పార్లమెంట్​లో మార్చ్ నిర్వహించారు. శుక్రవారం ఉదయం ఉభయ సభల ప్రారంభానికి ముందు పార్లమెంట్ ఆవరణలో ప్రతిపక్ష ఎంపీలు ‘మోదీ, -అదానీ భాయి భాయి’అని ఇంగ్లిష్ లో రాసి ఉన్న బ్లాక్ మాస్క్ లు ధరించి నిరసన తెలిపారు.

చేతిలో ఎరుపు రంగు రాజ్యాంగ ప్రతిని పట్టుకొని సంసద్ భవన్(ఓల్డ్ పార్లమెంట్) నుంచి పార్లమెంట్ ఆవరణలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహం వరకు మార్చ్ నిర్వహించారు. మోదీ, -అదానీకి వ్యతిరేకంగా కాంగ్రెస్, మిత్రపక్ష పార్టీల ఎంపీల నినాదాలతో పార్లమెంట్ ఆవరణ మారుమోగింది. ఈ ధర్నాలో ఇండియా కూటమిలోని కాంగ్రెస్, ఆర్జేడీ, జేఎంఎం, వామపక్షాల ఎంపీలు పాల్గొన్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఈ ఆందోళనను ముందుండి నడిపించారు. వారి వెంట తెలంగాణ ఎంపీలు గడ్డం వంశీకృష్ణ, చామల కిరణ్ కుమార్ రెడ్డి, మల్లు రవి, అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు.

ఈ సందర్బంగా మోదీ, అదానీకి వ్యతిరేకంగా ఎంపీలు నినాదాలు చేశారు. ‘మోదీ – అదానీ ఏక్ హై, మోదీ,- అదానీ భాయి భాయి’అంటూ నినదించారు. ఈ మార్చ్ ముగింపులో భాగంగా అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. అదానీ వ్యవహారంపై జేపీసీతో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. అదానీని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అదానీ వ్యవహారంపై పార్లమెంట్ లో చర్చించేందుకు మోదీ సర్కార్ భయపడుతోందని ప్రియాంక గాంధీ విమర్శించారు. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందని కేంద్ర ప్రభుత్వంపై ఆమె ఫైర్ అయ్యారు. కాగా.. అదానీ ముడుపుల అంశంపై ప్రతిపక్షాల ఆందోళనకు టీఎంసీ, సమావాద్ పార్టీలు దూరంగా ఉంటున్నాయి. 

రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్ర: ఎంపీ గడ్డం వంశీకృష్ణ

గడిచిన పదేండ్లుగా రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ విమర్శించారు. అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా.. పార్లమెంట్ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహానికి వంశీ నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీజేపీ పాలనలో రాజ్యాంగం ప్రమాదంలో పడిన పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఆధారంగా గడిచిన 75 ఏండ్లుగా దేశం అభివృద్ధి వైపు సాగుతోందన్నారు. అయితే, న్యాయపరమైన అంశాలను సాకుగా చూపి, రాజ్యాంగంలో మార్పులు తెచ్చేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు.

ఈ మార్పులతో దళితుల అభివృద్ధి, సమానత్వం కోసం అంబేద్కర్ ముందు చూపుతో పెట్టిన రిజర్వేషన్లను తొలగించాలని చూస్తోందని ఫైర్ అయ్యారు. అందువల్ల రాజ్యాంగం రూపంలో అంబేద్కర్ దేశ ప్రజలకు కల్పించిన హక్కులను పోరాడి కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. అందులో ఎంపీగా తన బాధ్యతను నిర్వహిస్తున్నాన్నారు. మోదీ, -అదానీ కలిసి దేశాన్ని ఎలా పాలిస్తున్నారో సామాన్యులకు తెలిపేలా నల్ల మాస్క్ లతో పార్లమెంట్ ఆవరణలో నిరసన తెలిపినట్టు వివరించారు.