అందరూ అభివృద్ధి చెందితేనే.. నిజమైన డెవలప్​మెంట్ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ

అందరూ అభివృద్ధి చెందితేనే.. నిజమైన డెవలప్​మెంట్ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ

   
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ ఆర్థిక విధానాలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా విమర్శించారు. వ్యాపారానికి న్యాయమైన వాతావరణం, న్యాయమైన పన్ను వ్యవస్థ ఉండి.. కార్మికుల ఆదాయం పెరిగి.. ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందితేనే నిజమైన అభివృద్ధి అని నొక్కి చెప్పారు. దీని వల్ల మాత్రమే దేశం సంపన్నంగా, బలంగా ఉంటుందన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఎక్స్​లో ఓ పోస్ట్​పెట్టారు. ఆర్థిక వ్యవస్థలో తయారీరంగం వాటా 60 సంవత్సరాలలో అత్యల్ప స్థాయికి పడిపోయిందని పేర్కొన్నారు. దీని కారణంగా ప్రజలు ఉపాధి కోసం ఇబ్బంది పడుతున్నారని అన్నారు.

వ్యవసాయ రంగంలో అవలంబిస్తున్న తప్పుడు విధానాలు.. రైతులు, వ్యవసాయ కార్మికుల పరిస్థితిని మరింత దిగజార్చాయని అన్నారు. కార్మికుల నిజమైన ఆదాయం గత ఐదు సంవత్సరాలుగా స్తబ్దుగా ఉందని స్పష్టం చేశారు. "అసంబద్ధమైన జీఎస్టీ, ఆదాయపు పన్ను.. పేదలు, మధ్యతరగతి ప్రజల జీవితాన్ని కష్టతరం చేశాయి. కానీ, కార్పొరేట్ రుణాలు మాత్రం మాఫీ అవుతున్నాయి" అని రాహుల్​ మండిపడ్డారు. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరగడం వల్ల.. ఇప్పుడు పేదలు మాత్రమే కాకుండా జీతాలు పొందే వర్గం కూడా వారి అవసరాల కోసం రుణాలు తీసుకోవలసి వస్తోందని ఆయన అన్నారు..

జనసామాన్య హక్కులను కాపాడుతూ ఆదివారం 'వైట్ టీ-షర్ట్ ఉద్యమం' ప్రారంభించినట్టు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ రాహుల్ ప్రకటించారు. ప్రజలు ఇందులో భాగం కావాలని కోరారు. "మీరు ఆర్థిక న్యాయాన్ని విశ్వసిస్తే.. పెరుగుతున్న సంపద అసమానతలను వ్యతిరేకిస్తే.. సామాజిక సమానత్వం కోసం పోరాడాలనుకుంటే.. అన్ని రకాల వివక్షలను తిరస్కరించినట్లయితే.. మన దేశంలో శాంతి, స్థిరత్వం కోసం పోరాడాలంటే.. మీరు తెల్లటి టీ-షర్టులు ధరించి ఉద్యమంలో చేరండి" అని ఎక్స్​లో రాహుల్​ 
ఓ వీడియో రిలీజ్​ చేశారు.