తెలంగాణ రాష్ట్రం ఏ ఒక్క వ్యక్తి కోసమో ఏర్పడింది కాదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం యువత, విద్యార్థులు తమ రక్తాన్ని ధారపోస్తే ఇప్పుడు ఒక కుటుంబానికి లాభం చేకూరుతోందని అభిప్రాయపడ్డారు. వరంగల్ రైతు సంఘర్షణ సభలో మాట్లాడిన రాహుల్ గాంధీ.. తెలంగాణ సీఎం ముఖ్యమంత్రిలా కాకుండా రాజులా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల కల సాకారమై ఎనిమిదేళ్లు పూర్తైనా అభివృద్ధి స్వప్నం సాకారం కాలేదని వాపోయారు. కేవలం ఒక కుటుంబం లాభపడిందే తప్ప తెలంగాణ ప్రజలకు కలిగి ప్రయోజనం ఏంటని రాహుల్ ప్రశ్నించారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల భార్యల ఏడుపుకు బాధ్యత ఎవరిదని నిలదీశారు.
తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రజలతో పాటు కాంగ్రెస్ పోరాటం చేసిన విషయాన్ని రాహుల్ గుర్తు చేశారు. తెలంగాణ ప్రక్రియను పూర్తి చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని ఇవ్వడం కాంగ్రెస్ కు అంత సులువైన విషయం కాదని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా.. సోనియా గాంధీ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించారని రాహుల్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు తోడుగా ఉందని, త్వరలోనే రాష్ట్రంలో ప్రజా, రైతు, పేదల ప్రభుత్వం ఏర్పడుతుందని హామీ ఇచ్చారు.
తెలంగాణలో ముఖ్యమంత్రి ఉన్నాడని చెప్తారు కానీ ఆయన సీఎంలా కాకుండా రాజులా వ్యవహరిస్తున్నారని రాహుల్ మండిపడ్డారు. రాజు, ముఖ్యమంత్రిలో మధ్య తేడా ఏంటో చెప్పిన రాహుల్.. ముఖ్యమంత్రి ప్రజల మాట వింటే.. రాజు తాను చెయ్యాలనుకున్నదే చేస్తాడని అన్నారు. ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉంచి ప్రజల శ్రేయస్సు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటాడని, కానీ రాజు తనకు తోచిందే చేస్తాడని చెప్పారు. ఛత్తీస్ ఘఢ్లో ఎన్నికల సమయంలో రుణమాఫీ చేస్తామని, రూ.2500 మద్దతు ధర ఇస్తామని చేసిన వాగ్దానాలను నిలబెట్టుకున్నామని చెప్పారు. కానీ తెలంగాణ సీఎం రైతులను పట్టించుకోకుండా ఇద్దరు ముగ్గురు వ్యాపారవేత్తల మాట మాత్రమే వింటారని రాహుల్ ఫైర్ అయ్యారు. తెలంగాణ రైతులను కాపాడుకోకుంటే రాష్ట్ర ఏర్పాటు కల సాకారం కానట్లేనని రాహుల్ అభిప్రాయపడ్డారు. రైతుల గురించి తాము చెప్పేవి ఒట్టి మాటలు కావన్న రాహుల్.. తెలంగాణ కలను సాకారం చేసుకోవడంలో మొదటి అడుగు అని చెప్పారు.