
- దేశమంతా కులగణన జరగాలి ఎవరెంతో తేలాలి
- తెలంగాణలో మేం చేసిన కులగణన దేశానికే ఆదర్శం
- బీసీలకు42% రిజర్వేషన్లుచరిత్రాత్మకం
- మోదీ, ఆర్ఎస్ఎస్కు ఇది నచ్చదు..
- అందుకే అడ్డుకుంటున్నరు: రాహుల్ గాంధీ
- మా సీఎం రేవంత్, మా టీమ్ దృఢ సంకల్పంతో కులగణన చేపట్టారు
- 90% మంది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలే అని తేలింది
- తెలంగాణలోనే కాదు.. అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉంది
- 50% రిజర్వేషన్ల పరిమితిని ఎత్తేయాలి.. మేం తెలంగాణలో మొదలుపెట్టాం
- పార్లమెంట్లో మోదీ కులగణన బిల్లు తెస్తే వెంటనే మద్దతిస్తం
- ట్రంప్ టారిఫ్‌లపై ఆయన ఎందుకు నోరువిప్పుతలే
- ఆర్థిక తుఫాన్ పొంచి ఉంది.. కోట్ల మంది నష్టపోతున్నరని ఆందోళన
- వక్ఫ్ (సవరణ) చట్టం మతం, రాజ్యాంగంపై దాడి అని వ్యాఖ్య
- అహ్మదాబాద్‌లో ముగిసిన ఏఐసీసీ సమావేశాలు
అహ్మదాబాద్: దేశంలోని సమస్యలను పరిష్కరించాలంటే దేశాన్ని ఎక్స్‌రే తీయాలని, కులగణనతోనే అది సాధ్యమని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ అన్నారు. దేశమంతా కులగణన చేపట్టాల్సిందేనని డిమాండ్ చేశారు. ఎవరెంత ఉన్నారో వాళ్లకంత అన్నిరంగాల్లో వాటా దక్కాల్సిందేనని స్పష్టం చేశారు. తమ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో కులగణన చేపట్టిందని, బీసీలకు 42శాతం రిజర్వేషన్ల కోసం బిల్లులు తెచ్చిందని, ఇది చరిత్రాత్మకమని కొనియాడారు. తెలంగాణలో 90 శాతం మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల ప్రజలే ఉన్నట్లు కులగణనలో తేలిందని, ఇదే పరిస్థితి అన్ని రాష్ట్రాల్లోనూ ఉంటుందని, వారికి దక్కాల్సిన వాటా దక్కాలంటే కులగణన తప్పదని పేర్కొన్నారు. కులగణన చేపట్టడం, 90 శాతం ఉన్న అణగారిన వర్గాలకు వాటాను పంచడం మోదీకి గానీ, ఆర్ఎస్ఎస్కుగానీ ఇష్టం లేదని మండిపడ్డారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నిర్వహిస్తున్న సీడబ్ల్యూసీ సమావేశాల్లో బుధవారం రాహుల్‌గాంధీ మాట్లాడారు. అన్ని రంగాలను, వ్యవస్థలను మోదీ సర్కార్ గుప్పిట్లో పెట్టుకుంటున్నదని, రాజ్యాంగ విలువలను కాలరాస్తున్నదని మండిపడ్డారు. మోదీకి దమ్ముంటే దేశమంతా కులగణన చేపట్టేలా పార్లమెంట్లో వెంటనే బిల్లు పెట్టాలని, తామూ మద్దతిస్తామని ఆయన అన్నారు.
తెలంగాణ ఆదర్శంగా ముందుకు!
ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం తాము తెలంగాణలో కులగణన చేపట్టి, ఎవరు ఎంతనో పక్కాగా లెక్కలు తీశామని రాహుల్‌గాంధీ అన్నారు. ‘‘తెలంగాణలో మా ముఖ్యమంత్రి, మా టీమ్ దృఢసంకల్పంతో కులగణన చేపట్టింది. బీసీలు, దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు.. ఎట్ల ఎవరు ఎంత ఉన్నారో లెక్కలు తీసింది. బీసీలకు 42శాతం రిజర్వేషన్ల కోసం బిల్లులు కూడా తెచ్చింది. ఇందుకు నేను ఎంతో సంతోషిస్తున్న. కులగణన, 42శాతం రిజర్వేషన్లతో దేశానికి తెలంగాణ రోల్‌మోడల్‌గా నిలిచింది. తెలంగాణను ఆదర్శంగా తీసుకొని దేశమంతా కులగణన చేపట్టాలని మోదీ సర్కార్‌ను కాంగ్రెస్ శ్రేణులు డిమాండ్ చేయాలి” అని ఆయన సూచించారు. మోదీ పొద్దున లేస్తే 24 గంటలూ బడుగు బలహీనవర్గాలు, ఆదివాసీలు, దళితుల గురించి మాట్లాడుతారని.. కానీ, ఆయా వర్గాల భాగస్వామ్యం, హక్కుల గురించి అడిగితే మాత్రం సైలెంట్‌గా ఉంటారని విమర్శించారు. ‘‘విద్య, ఉపాధి, ప్రైవేట్, రాజకీయం.. ఇట్ల ఏరంగంలో తీసుకున్నా దేశంలోని 90 శాతం ఉన్న అణగారిన వర్గాలకు వాటా ఎక్కడుంది?” అని ప్రశ్నించారు. తెలంగాణ తమ ప్రభుత్వం క్యాస్ట్ సెన్సస్తో దేశానికి రాస్తా చూపిందని ఆయన అన్నారు.
కేంద్రంలో అధికారంలోకి వస్తే కులగణన
కులగణన చేపట్టాలని ఆ మధ్య పార్లమెంట్లో తాను మోదీని డిమాండ్ చేశానని, కానీ ఆయన మాత్రం చేసేందుకు ఒప్పుకోలేదని రాహుల్‌గాంధీ మండిపడ్డారు. ‘‘దేశంలో దళితులు, ఆదివాసీలు, బీసీలు, మైనార్టీలు ఎంత మంది ఉన్నారో కులాల వారీగా లెక్కలు తీయాలని మోదీని డిమాండ్ చేసిన. ఎవరెంత ఉన్నారో వాళ్లకంత వాటా దక్కాలంటే ఈ లెక్కలు తప్పనిసరి. దేశంలోని సమస్యలు తీర్చాలంటే ఎక్స్‌రేలాంటి కులగణన అవసరం. 90శాతం మంది ఉన్న బడుగుబలహీనవర్గాల ప్రజలకు అన్ని రంగాల్లోనూ అన్యాయం జరుగుతున్నది. ఎండనకా వాననకా కష్టపడే ఈ 90శాతం ప్రజలకు ప్రయోజనాలు దక్కడం మోదీకి, ఆర్ఎస్ఎస్కు ఇష్టం లేదు. అందుకే.. కులగణన చేపట్టబోమని, వాటాలు పంచబోమని అంటున్నరు” అని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కులగణనతో 90శాతం మంది అణగారిన వర్గాల ప్రజలు ఉన్నట్లు తేలిందని.. ఉదాహరణకు కార్పొరేట్ సెక్టార్‌నే తీసుకుంటే యజమానులు, సీఈవోలు వంటి టాప్ పొజిషన్లో ఒక్కరు కూడా ఈ వర్గాల వారు లేరని అన్నారు. దేశమంతా ఇదే పరిస్థితి నెలకొందని.. ఇది మారాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
తాము తెచ్చిన ఎస్సీ, ఎస్టీల సబ్ ప్లాన్ చట్టాన్ని కేంద్రంలోని మోదీ సర్కార్ పక్కనపడేసిందని.. అన్ని వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకున్నదని దుయ్యబట్టారు. దళితులు, బలహీనవర్గాలు, ఆదివాసీలకు అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తే కేంద్రం తలుపులు మూస్తున్నదని మండిపడ్డారు. చివరికి సైనికుల కుటుంబాలకు ఇచ్చే పెన్షన్ కూడా పక్కన బెట్టిందని అన్నారు. పార్లమెంట్లో మోదీ సర్కార్ కులగణన బిల్లు పెడ్తే తాము వెంటనే మద్దతిస్తామని రాహుల్ చెప్పారు. కేంద్రంలోని తాము అధికారంలోకి వస్తే తెలంగాణలో చేపట్టినట్లే దేశమంతా కులగణన చేపడ్తామని, తెలంగాణ మోడల్‌గా బడుగుబలహీనవర్గాల కోసం అద్భుతమైన చట్టం తెస్తామని హామీ ఇచ్చారు. 50శాతం రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేయాల్సిందేనని, తెలంగాణలో ఇందుకు ముందడుగు పడిందని కొనియాడారు.
ఆర్థిక తుఫాన్ ముంచుకొస్తుంటే మోదీ ఏం చేస్తున్నరు?
ఇండియాపై ఆర్థిక తుఫాన్ ముంచుకొస్తున్నదని రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘ట్రంప్‌ను తన ఫ్రెండ్ అని చెప్పుకునే మోదీకి.. ట్రంప్ విధిస్తున్న టారిఫ్‌లు కనిపించడం లేదా? టారిఫ్‌లతో ఇండియాపై ట్రంప్ దాడి చేస్తుంటే మోదీ మాత్రం ఎందుకు స్పందించడం లేదు? 26 శాతం టారిఫ్ విధించినప్పటికీ.. మోదీ నుంచి ఒక్క ప్రకటన కూడా రాలేదు. ట్రంప్ విధిస్తున్న టారిఫ్‌లతో దేశ ఆర్థిక వ్యవస్థ పతనం అవుతుంది. టారిఫ్‌ల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు 2 రోజుల పాటు పార్లమెంట్లో డ్రామా ఆడారు. కరోనా వచ్చినప్పుడు మోదీ చప్పట్లు కొట్టుమన్నరు.. మొబైల్ ఫోన్ల లైట్ చూపెట్టుమన్నరు. ఇప్పుడు ఆర్థిక తుఫాన్ ముంచుకొస్తున్నది. కోట్ల మంది ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నరు.. 50 ఏండ్ల కిందటి కన్నా దారుణమైన నిరుద్యోగ సమస్య పొంచి ఉన్నది. మరీ.. మోదీ ఎటుపోయారు? ఎందుకు మాట్లాడ్తలే? ఆయన 56 ఇంచుల చాతీ ఎటుపోయింది?” అని ఆయన నిలదీశారు. మోదీ అమెరికా వెళ్లిన ప్రతిసారీ.. ట్రంప్‌ను కౌగిలించుకోవడం చూశామని, అలాంటి ఫొటోలు బయటకు వచ్చేవని, ఫిబ్రవరిలో వెళ్లినప్పుడు మాత్రం ఇది కనిపించలేదని, అలాంటి ఫొటోలు రాలేవని రాహుల్ అన్నారు. ‘‘ఇక నుంచి కౌగిలించుకోవడాలు ఉండవని చెప్తూనే.. టారిఫ్‌లు వేస్తామని మోదీకి ట్రంప్ స్పష్టం చేశారు. ఇండియాపై ట్రంప్ టారిఫ్‌లు విధిస్తున్నప్పటికీ.. మోదీ నోరు మెదపడం లేదు” అని మండిపడ్డారు. కొత్త వక్ఫ్ చట్టం అనేది.. మతం, రాజ్యాంగంపై దాడి అని రాహుల్ వ్యాఖ్యానించారు. మైనారిటీల హక్కులను కాలరాస్తున్నదని, మతపరమైన స్వాతంత్ర్యాన్ని హరిస్తున్నారని ఫైర్ అయ్యారు.
మేం ఏకం చేస్తుంటే.. బీజేపీ విడగొడ్తున్నది: సచిన్ పైలట్
దేశాన్ని కాంగ్రెస్ ఏకం చేస్తుంటే.. బీజేపీ మతం పేరుతో విడగొట్టేందుకు కుట్ర చేస్తున్నదని కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ అన్నారు. మతం, కులం, భాష, ఆహారపు అలవాట్లు, వేషధారణను ఎజెండాగా పెట్టు కుని అధికారం కోసం పాకులాడుతున్న వారికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. న్యాయం, పోరాట మార్గాన్ని అనుసరిస్తూ ద్వేషం, ప్రతికూల వాతావరణాన్ని మార్చేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. గత పదేండ్లలో దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ఆర్థిక అసమానతలు హద్దులు దాటాయని విమర్శించారు.
కొత్త సభ్యులను చేర్చుకోవాలి: శశిథరూర్
పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయాలని కాంగ్రెస్ నేత శశిథరూర్ అన్నారు. పార్టీ మరింత బలంగా మారాలంటే క్రియాశీలకంగా పనిచేయడం, కొత్త సభ్యులను చేర్చుకోవడం అవసరమని తెలిపారు. పార్టీ నేతలంతా ఎదుటి వాళ్లను విమర్శించడమే పనిగా పెట్టుకోకుండా... సానుకూల పరిస్థితులు తీసుకురావాలన్నారు. బీజేపీ మతపరమైన రాజకీయాలు చేస్తున్నదన్నారు. దేశాన్ని నార్త్, సౌత్‌గా విడగొట్టాలని కుట్ర పన్నుతున్నదని మండిపడ్డారు. మెరుగైన ఇండియా నిర్మాణానికి కలిసికట్టుగా పోరాడాలన్నారు. వచ్చే ఎలాంటి సమస్యలైనా ధీటుగా ఎదుర్కొంటామనే సంకల్పం గాంధీజీ, సర్దార్ వల్లబ్‌భాయ్ పటేల్ పుట్టిన గడ్డపై నుంచి తీసుకోవాలని తెలిపారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఎవరెంత ఉన్నరో వాళ్లకు అంత వాటా దక్కాల్సిందే. ఇది మోదీకి నచ్చదు. ఆయన తన మిత్రులు అంబానీ, అదానీ కోసమే పనిచేస్తడు. అంబానీ, అదానీ సంస్థల్లోని లిస్ట్చూస్తే.. అందులో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు టాప్ పొజిషన్లో ఒక్కరైనా ఉండరు. దేశంలోని 90 శాతం ఉన్న ఈ వర్గాల ప్రజలకు ఎందుకు ఆ అవకాశాలు దక్కడం లేదు? ఈ జనం ఏమైపోయినా మోదీకి పట్టదు. అదానీకి చత్తీస్‌గఢ్, జార్ఖండ్, బిహార్‌లో ఎక్కడైనా మైన్స్ కావాలంటే మోదీ ఇచ్చేస్తడు. ముంబై ఎయిర్పోర్ట్, లక్నో ఎయిర్పోర్ట్ అడిగినా.. డిఫెన్స్ ఇండస్ట్రీ అడిగినా కాదనడు. ప్రభుత్వ రంగ సంస్థలను ఒకటొకటిగా మోదీ సర్కారు మూసేస్తున్నది. సెయిల్, బీహెచ్ఈఎల్, బీఎస్ఎన్ఎల్ వంటి సంస్థల్లో యువతకు ఉద్యోగాలు కల్పించాల్సింది పోయి.. వాటిని మూతపడేలా చేస్తున్నది. రాహుల్ గాంధీ
నానమ్మను గుర్తుచేసుకున్న రాహుల్
తన నానమ్మ ఇందిరా గాంధీని సభలో రాహుల్‌గాంధీ గుర్తుచేసుకున్నారు. ‘‘మీరు ఈ ప్రపంచంలో లేనప్పుడు ప్రజలు మీ గురించి ఏం మాట్లాడుకోవాలి? ఏం ఆలోచించాలి?’’ అని ఇందిరాగాంధీని తాను చిన్నప్పుడు అడిగానని ఆయన అన్నారు. ‘‘దీనికి నాన్నమ్మ ఏం సమాధానం ఇచ్చారంటే.. ‘నేను నా పని మాత్రమే చేస్తాను. దేశానికి, ప్రజలకు ఏది మంచో అదే చేస్తాను. నేను లేనప్పుడు ప్రజలు నా గురించి ఏమనుకుంటరో పట్టించుకోను. నా దృష్టి అంతా పని మీదే ఉంటుంది. నేను లేనప్పుడు ప్రపంచం నన్ను మరచిపోయినా ఫర్వాలేదు’ అని తెలిపింది. ఆమె ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, బ్యాంకుల జాతీయం వంటి నిర్ణయాలు సామాన్యుల జీవితాలను మెరుగుపర్చాయి. దేశ ఐక్యత, సమగ్రత కోసం తన జీవితాన్ని అర్పించారు. ఆమె తీసుకున్న కఠిన నిర్ణయాలు దేశాన్ని బలోపేతం చేశాయి. ఆమె ఆదర్శాలు కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికీ స్ఫూర్తినిస్తాయి’’ అని రాహుల్ పేర్కొన్నారు.
చేతగానివాళ్లు పార్టీ నుంచి తప్పుకోండి: ఖర్గే
పార్టీ లీడర్లంతా తమ బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలమైతే రెస్ట్ తీసుకోవాలని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. పార్టీ నుంచి పదవీ విరమణ పొందాలన్నారు. కష్టపడి పని చేసేవారికే పదవులు దక్కుతాయని తేల్చి చెప్పారు. డీసీసీ అధ్యక్షుల నియామకాలు పారదర్శకంగా జరగాలన్నారు. వారి పాత్రే.. పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తదని తెలిపారు. అన్యాయం, అసమానతలు, పేదరికానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాడుతున్నదన్నారు. ‘‘ఎన్నికల సంస్థలతో సహా అన్నింటిలోనూ కేంద్రం జోక్యం చేసుకుంటున్నది. అన్నిచోట్లా తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నది. ఎలక్ట్రానిక్ టెక్నాలజీ కారణంగా ఎన్నికల్లో మోసాలు జరుగుతున్నాయి. ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలు ఈవీఎంలను వదిలి బ్యాలెట్ వైపు మొగ్గు చూపుతున్నాయి. ప్రపంచంలో ఎక్కడా ఈవీఎంలు అందుబాటులో లేవు’’అని ఖర్గే అన్నారు.