
- ఏఐపై మాటలు చెప్తే సరిపోదు
- ప్రధాని మోదీపై రాహుల్ విమర్శలు
న్యూఢిల్లీ:ఆధునిక టెక్నాలజీని ప్రధాని మోదీ అందిపుచ్చుకోవడం లేదని లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. కొత్త టెక్నాలజీ అభివృద్ధిపై ప్రధాని మాటలకే పరిమితమవుతున్నారని అన్నారు. ఆధునిక సాంకేతికతను రూపొందించడానికి మనకు బలమైన పునాది అవసరమని చెప్పారు. డ్రోన్ల తయారీలో చైనా సాధించిన పురోగతిని వివరిస్తూ సోషల్ మీడియా ‘ఎక్స్’లో రాహుల్ శనివారం పోస్టు పెట్టారు.
‘‘డ్రోన్లు యుద్ధ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాయి. బ్యాటరీలు, మోటార్లు, ఆప్టికల్స్ జత చేయడంతో యుద్ధభూమిలో కమ్యూనికేట్ అవుతున్నాయి. అయితే డ్రోన్లు కేవలం టెక్నాలజీ మాత్రమే కాదు.. బలమైన పారిశ్రామిక వ్యవస్థతో ఉత్పత్తి చేసిన ఆవిష్కరణలు. దురదృష్టవశాత్తు.. దీన్ని గుర్తించడంలో ప్రధాని మోదీ విఫలమయ్యారు.
ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)పై టెలిప్రాంప్టర్ ద్వారా ఉపన్యాసాలు ఇస్తుంటే.. మన పోటీ దేశాలు మాత్రం కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తున్నాయి. ఆధునిక సాంకేతికతను రూపొందించడానికి మనకు బలమైన పునాది కావాలి. కేవలం మాటలు చెబితే సరిపోదు. మన దేశంలో మంచి టాలెంట్ ఉన్న యువత ఉంది.
వాళ్లందరికీ జాబ్స్ ఇవ్వడానికి, మన దేశాన్ని ముందుకు నడిపించడానికి బలమైన పారిశ్రామిక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. అందుకోసం స్పష్టమైన విజన్ తో ముందుకెళ్లాలి” అని పోస్టులో పేర్కొన్నారు. కాగా, దీనికి డ్రోన్ టెక్నాలజీని వివరిస్తూ ఉన్న 9 నిమిషాల వీడియోను రాహుల్ జత చేశారు. ఇలాంటి టెక్నాలజీని తయా రు చేసే టాలెంట్ ఇండియాకు ఉన్నదని చెప్పారు.