ఈ ఎన్నికలు దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణకు మధ్య పోరు : రాహుల్ గాంధీ

రాష్ట్రంలో దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణకు మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అభివర్ణించారు.  రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కు మధ్యే పోటీ ఉంటుందని చెప్పారు.  బీజేపీ అడ్రస్ లేకుండా  పోయిందన్నారు.  ములుగులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.  2004లో కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చిందని ..   ఇచ్చిన ఆ హామీని కాంగ్రెస్‌ ఎలా సాకారం చేసిందో ప్రపంచమంతా చూసిందన్నారు.. ఏ పార్టీ కూడా తనకు నష్టం జరిగేలా నిర్ణయం తీసుకోదన్నారు.  కాంగ్రెస్‌ మాత్రం తనకు నష్టం కలుగుతుందని తెలిసినా  కూడా తెలంగాణ ఇచ్చిందన్నారు.  

గత ఎన్నికల టైమ్ లో కేసీఆర్ ఎన్నో హామీలు ఇచ్చారని రాహుల్ అన్నారు.   దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు.. ఇచ్చారా? ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు.. ఇచ్చారా? డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు కట్టిస్తామన్నారు.. ఎంత మందికి ఇచ్చారు. లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు.. ఎంత మందికి చేశారని ప్రశ్నించారు.   కాంగ్రెస్ పాలిత రాష్ట్రల్లో ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చామని  చెప్పారు.   

బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని అన్నారు రాహుల్ గాంధీ.  సీఎం కేసీఆర్ పై ఆరోపణలు చేస్తారు కానీ విచారణ చేయరని విమర్శించారు. వాటితో ఎంఐఎం కూడా కలిసే ఉందన్నారు.  కాంగ్రెస్‌ను ఓడించేందుకు ఈవన్నీ ఒక్కటయ్యాయని చెప్పారు.  మీరు బీఆర్ఎస్ కు  ఓటు వేస్తే బీజేపీకి  వేసినట్టేనని తెలిపారు.