కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సొమ్ము ప్రజల కోసమే ఖర్చు చేస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. మూడు రోజుల ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ బుధవారం(నవంబర్ 1) జడ్చర్ల కార్నర్ మీటింగ్ లో పాల్గొని మాట్లాడారు.
"కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. కేసీఆర్ దోచుకున్న సొమ్మును ప్రజల ఖాతాల్లో వేస్తాం. ప్రతి వ్యక్తిపై లక్ష రూపాయల అప్పు చేశారు. కేసీఆర్ లక్ష కోట్ల అవినీతిపై ప్రశ్నిద్దామా?.. వద్దా?. దొరల సర్కార్ లో మొత్తం దోపిడినే. తెలంగాణలో ధరణి పేరుతో అతిపెద్ద దోపిడీ జరిగింది. కంప్యూటరైజ్ పేరుతో లక్షల భూములు దోచుకున్నారు. దోపిడీకి వీలున్న శాఖలన్నీ కేసీఆర్ చేతిలోనే ఉన్నాయి. విద్యేషాలకు వ్యతిరేకంగా జరిగిందే భారత్ జోడో యాత్ర. విద్యేషాల బజార్ లో.. ప్రేమ దుకాణం తెరిచాం. బీసీలు ఎంత.. ఎస్సీలు ఎంత సమాధానం లేదు. జనగణనకు మోదీ ఎందుకు భయపడుతున్నారు. వేయి రూపాయల సిలిండర్ ను రూ.500లకే ఇస్తాం. కాంగ్రెస్ ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేస్తాం" అని పేర్కొన్నారు.