
- తెలంగాణలో చేసినం.. దేశమంతా చేస్తం: రాహుల్
- మోదీ సర్కారుకు వ్యాపారులే ముఖ్యమని ఫైర్
- రాజ్యాంగ హక్కులు లాగేసుకుంటరు: ఖర్గే
మహు (మధ్యప్రదేశ్): తెలంగాణలో విజయవంతంగా కుల గణన నిర్వహించామని, ఇది విప్లవాత్మక ముందడుగని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ అన్నారు. అక్కడ త్వరలోనే రిజర్వేషన్లలో దళితులు, గిరిజనులు, బీసీల వాటాను వెల్లడిస్తామని తెలిపారు. తాము తెలంగాణతోపాటు కర్నాటకలోనూ ఆ పని ప్రారంభించామని చెప్పారు. కుల గణనతో రాజ్యాంగం ప్రకారం ప్రజలకు తమ హక్కుగా వచ్చే వాటాను తెలుసుకోవచ్చని అన్నారు. భవిష్యత్తులో దేశవ్యాప్తంగా కుల గణన నిర్వహించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్‌లోని మహులో సోమవారం నిర్వహించిన ‘జై బాపు, జై భీం, జై సంవిధాన్’ సభలో పాల్గొన్న రాహుల్‌గాంధీ..ఈ వ్యాఖ్యలు చేశారు. కుల గణన చేయడం ప్రధాని మోదీకి ఇష్టంలేదని, ఇది ఎక్కడ పూర్తవుతుందోనని ఆయన భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ ఎన్నటికీ కుల గణన చేయదని అన్నారు. ఓబీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని, వారి బలమేంటో వారికి తెలియడం లేదని తెలిపారు. ఓబీసీలకు న్యాయం చేసేందుకే తాము కుల గణన చేపడుతున్నామని చెప్పారు. అలాగే, తాము అధికారంలోకి వస్తే లోక్‌సభ, రాజ్య సభలో బిల్లు పెట్టి.. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని ఎత్తేస్తామని చెప్పారు.
బీజేపీ, ఆర్ఎస్ఎస్పై ఫైర్
దేశంలో స్వాతంత్ర్యం పూర్వపునాటి పరిస్థితులు తీసుకురావాలని బీజేపీ, ఆర్ఎస్ఎస్ కోరుకుంటున్నాయని రాహుల్‌గాంధీ ఫైర్అయ్యారు. దళితులు, ఆదివాసీలు, బీసీలు, పేదలను మరోసారి బానిసలుగా మార్చేందుకు కుట్ర చేస్తున్నాయని మండిపడ్డారు. ఇందులో భాగంగానే రాజ్యాంగంపై ఆర్ఎస్ఎస్చీఫ్ మోహన్ భగవత్ దాడికి పాల్పడుతున్నారని ఆరోపించారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణం తర్వాతే దేశానికి అసలైన స్వాతంత్ర్యం వచ్చిందని పేర్కొంటూ రాజ్యాంగాన్ని హేళన చేశారని ఫైర్ అయ్యారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా కూడా ఇటీవల అంబేద్కర్‌ను అవమానించారని మండిపడ్డారు.
బీజేపీవి రాజ్యాంగ వ్యతిరేఖ విధానాలని విమర్శించారు. ‘‘దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఏమీ ఉండదు. అదానీ, అంబానీలాంటి వారికి దేశ వనరులను అప్పగిస్తున్నారు. ప్రధాని మోదీకీ వ్యాపారులే ముఖ్యం. పేద ప్రజలపై ప్రేమ లేదు. అన్ని వనరులను అదానీకి ఇవ్వాలని రాజ్యాంగంలో ఎక్కడ ఉంది? రాజ్యాంగం ప్రకారం పౌరులందరూ సమానమే. దేశ ప్రజలందరికీ కలలు కనే హక్కు ఉన్నది” అని పేర్కొన్నారు. రాజ్యాంగం మారిన రోజు ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు ఉండబోవని అన్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌నుంచి రాజ్యాంగాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ పోరాడుతున్నదని చెప్పారు. ఇందుకోసం పార్టీ కార్యకర్తలంతా కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.