చెప్పుల షాపు ఓనర్‌కు రాహుల్ సర్‌ప్రైజ్!

చెప్పుల షాపు ఓనర్‌కు రాహుల్ సర్‌ప్రైజ్!

న్యూఢిల్లీ/సుల్తాన్‌‌పూర్‌‌ : కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఆకస్మికంగా ఓ చెప్పుల షాపును సందర్శించి, ఆ షాపును నడుపుకుంటున్న చర్మకారుడిని సర్ ప్రైజ్ చేశారు. అతనితో మాట్లాడి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. రాహుల్ తన షాపుకు రావడంతో రామ్ ఛేట్ ఉబ్బి తబ్బిబ్బు అయ్యారు.  అయితే, పరువు నష్టం కేసులో శుక్రవారం ఉత్తరప్రదేశ్‌‌ సుల్తాన్‌‌పూర్‌‌‌‌లోని ఎంపీ ఎమ్మెల్యే కోర్టుకు రాహుల్ హాజరయ్యారు.

బీజేపీ అగ్ర నేత అమిత్ షాపై  రాహుల్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ 2018లో స్థానిక బీజేపీ నేత విజయ్ మిశ్రా పరువు నష్టం దావా వేశారు. దీనిపై శుక్రవారం స్పెషల్‌‌ జడ్జి శుభం వర్మ విచారించారు. వాదనలు విన్న తర్వాత తదుపరి విచారణను ఆగస్టు 12కు వాయిదా వేశారు.

లోక్‌‌సభ  ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి లోక్‌‌సభ హౌస్ కమిటీ కొత్త ఇంటిని కేటాయించింది. ఢిల్లీలోని సునేహ్రీ బాగ్ రోడ్‌‌లోని 5వ నంబర్ బంగ్లాను ఆయనకు కేటాయించింది. రాహుల్​ సోదరి ప్రియాంక గాంధీ వాద్రా ఆ బంగ్లాను సందర్శించిన తర్వాత ఈ విషయం వెల్లడైంది. అయితే, దీనిపై రాహుల్​ అభిప్రాయం కోసం ఎదురుచూస్తున్నట్టు పార్లమెంటరీ వర్గాలు తెలిపాయి.

కాగా, గతేడాది పరువు నష్టం కేసులో దోషిగా తేలడంతో రాహుల్ ఎంపీగా అనర్హతకు గురయ్యారు. దీంతో తుగ్లక్  రోడ్డులోని తన అధికారిక బంగ్లాను ఖాళీ చేశారు. ప్రస్తుతం ఆయన ఎంపీ, ప్రతిపక్ష నేత హోదాలో ఉన్నందున తిరిగి అధికారిక బంగ్లా కేటాయించారు.