కాంగ్రెస్ ఆశాకిరణం రాహుల్​

కాంగ్రెస్ ఆశాకిరణం రాహుల్​

దేశ స్వాతంత్ర్యం అనంతరం సుమారు 50 సంవత్సరాలకుపైగా తిరుగులేని శక్తిగా దేశానికి పటిష్టమైన నాయకత్వం వహించింది కాంగ్రెస్​ పార్టీ.   నెహ్రూ, శాస్త్రీని మరిపించిన నాయకత్వం ఇందిరా గాంధీది.  ఇందిరా గాంధీ  తరువాత ఆ  స్థాయి నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి లేకుండా పోయింది. 1991లో రాజీవ్​ గాంధీ 

తీవ్రవాదుల పన్నాగానికి బలికావడంతో కాంగ్రెస్​పార్టీకి బలమైన నాయకత్వం కొరత వెంటాడుతూ వస్తోంది.  అంతర్జాతీయంగా ఏర్పడిన మార్పులు,  దేశీయంగా  మారిన రాజకీయ పరిస్థితులను అంచనా వేయడంలో కాంగ్రెస్ పార్టీ అప్డేట్ కాలేకపోతూ వచ్చింది. రాహుల్​ గాంధీ  నూతన ఆలోచనా విధానాలతో ముందుకు సాగుతుండటం రాబోయే కాలానికి కాంగ్రెస్​  పార్టీకి కలిసొచ్చే అంశంలా కనిపిస్తోంది.

కాంగ్రెస్ ఆశాకిరణం రాహుల్​

రాహుల్  కొత్త రాజకీయ నినాదాలతో కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది సుముఖత వ్యక్తం చేస్తుంటే, మరికొంత మంది విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో  కొందరు నేతలు ఆ పార్టీకి దూరం కావొచ్చు.  రాహుల్ గాంధీ మాత్రం అవేమీ పట్టించుకోవడం లేదు.  తాను నమ్మిన సిద్ధాంతం కోసం తన కార్యాచరణ సిద్ధం చేసుకొని ప్రయాణాన్ని ప్రారంభించాడు.  భారత రాజకీయ, సామాజిక వ్యవస్థను తనదైన కోణంలో అర్థం చేసుకున్న నేతగా రాహుల్ గాంధీ సిద్ధాంతపరంగా పరిణతి చెందాడు.  ఈ దేశం ముందు సరికొత్తగా కులగణన సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. అదొక  విప్లవ కార్యాచరణ అని చెప్పవచ్చు. స్వాతంత్ర్యం  అనంతర భారతదేశంలో  ఉత్పత్తి కులాల ఉనికే  ప్రశ్నార్థకంగా  మారిందన్న  సత్యాన్ని రాహుల్ గాంధీ అవగాహనలోకి తెచ్చుకున్నాడు.  దేశసంపద  పిడికెడు కుటుంబాల చేతిలో ఉంటే అప్పులు మాత్రం  దేశ పేద ప్రజలైన శూద్ర, ఆదివాసీ, దళిత, వెనుకబడిన వర్గాల జీవితాల్లో భాగమైన పరిస్థితి ఉందని రాహుల్ గాంధీ పార్లమెంట్ వేదికగా మాట్లాడుతున్నారు.  కులగణన అనేది భారత సమాజానికి సంబంధించినంతవరకు ఎక్స్-రే  లాంటిది అని రాహుల్ గాంధీ  పదేపదే వాదిస్తున్నారు కూడా. 

​ కులగణన నినాదం సంచలనం

ఆధిపత్య వర్గాల చేతిలో బందీ అయిన భారత రాజకీయ వ్యవస్థలో రాహుల్  నినదించిన కులగణన  పెను సంచలనాలకు తెర తీసింది.  భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకించగా,  కాంగ్రెస్ పార్టీలో సైతం భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి.  కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కర్నాటక,  తెలంగాణ  ప్రభుత్వాలు  ఇప్పటికే  కులగణనను  పూర్తి చేసుకున్నాయి.  దేశంలోని దళిత,  బహుజన,  ఆదివాసీ సంఘాల  డిమాండ్​గా  కులగణనను మలచడంలో రాహుల్ గాంధీ తిరుగులేని విజయాన్ని సాధిస్తూ వస్తున్నారు. దివంగత  ప్రధాని ఇందిరా గాంధీ  హయాంలో  భూ సంస్కరణలు,  బ్యాంకుల జాతీయకరణ,  రాజభరణాల రద్దును  వ్యతిరేకించిన వర్గాలే  నేడు కులగణనను వ్యతిరేకిస్తున్నాయి.  నాడు ఇందిరా గాంధీకి అండగా నిలిచిన వర్గాలే  నేడు రాహుల్ గాంధీకి మెల్లమెల్లగా దగ్గరవుతున్నాయి.  కులగణన  దేశవ్యాప్తంగా  నిర్వహిస్తే  దేశ ప్రజల సమగ్ర ఆర్థిక,  సామాజిక స్థితి  వెలుగులోకి వస్తుంది.  రాహుల్  ప్రతిపాదించిన కులగణన సిద్ధాంతం భారత రాజకీయ వ్యవస్థను  ఎంతగా ప్రభావితం చేసిందంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లాంటి సంస్థలు కూడా  కులగణనకు మేం వ్యతిరేకం కాదు అని బహిరంగంగా ప్రకటన చేసే పరిస్థితి ఏర్పడింది.   రాహుల్ గాంధీ  తాను  ప్రయాణిస్తుంది  పూలబాటపై కాదు  ముళ్లబాట అన్న విషయంలో ​ పూర్తి అవగాహనతో  పయనిస్తున్నాడు. వరుస ఎన్నికల్లో పార్టీ  ఓటమి చవిచూస్తున్నా..  తన సిద్ధాంత  పోరాటంలో  రాజీపడక, వెనకడుగు వేయక  ప్రజాశ్రేయస్సు కోసం ముందుకే  కొనసాగిపోతున్నాడు. దేశానికి తన సిద్ధాంత ఫలితం అందేవరకు తన పోరాటాన్ని  కొనసాగించాలనే దృఢసంకల్పం ఆయనలో కనిపిస్తున్నది.  రాహుల్ ఆలోచనలు ఫలించేనా అంటే.. రాబోయే కాలమే తప్పక  నిర్ణయిస్తుందనడంలో సందేహం లేదు.  

- దొమ్మాట వెంకటేశ్,
ఫ్రీలాన్స్ జర్నలిస్ట్