ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. ఎన్నికలకు మరో నాలుగురోజులు మాత్రమే సమయం ఉన్న క్రమంలో నేతలంతా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నం అయ్యారు. అధికార వైసీపీ తరఫున జగన్ జనంలో ఉండగా, కూటమి తరఫున చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు తోడు మోడీ, అమిత్ షాలు రాష్ట్రంలో పర్యటించారు. ఇక కాంగ్రెస్ తరఫున కడప ఎంపీగా బరిలో దిగిన షర్మిలకు మద్దతుగా రాహుల్ గాంధీ కడప జిల్లాలో పర్యటించనున్నారు.
ఈ నెల 11న కడప జిల్లా ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు రాహుల్ గాంధీ. 11న ఉదయం 10గంటలకు కడప ఎయిర్పోర్ట్ చేరుకోనున్న రాహుల్ అక్కడి నుండి రోడ్ షోతో బిల్టప్ వరకు చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ సభలో రాహుల్ అధికార వైసీపీ, సీఎం జగన్ లపై ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.