- కులగణనపై సలహాలు, సూచనలు తీసుకుంటం
- సంక్షేమం అంటే కాంగ్రెస్ పార్టీ పేటెంట్
- పక్క పార్టీల గురించి మేం మాట్లాడం
- టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్‌గౌడ్
హైదరాబాద్: దేశవ్యాప్తంగా కులగణన జరగాలన్నది తమ పార్టీ నిర్ణయమని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. నవంబర్ 5న బోయినపల్లిలోని మహాత్మా గాంధీ ఐడియాలాజీ సెంటర్‌లో కులగణనపై సలహాలు, సూచనల కోసం నిర్వహించే కార్యక్రమంలో కాంగ్రెస్అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్ఖర్గే పాల్గొంటారని పేర్కొన్నారు. కులగణన ప్రక్రియకు సంబంధించిన వివరాలు తెలుసుకుంటారని చెప్పారు.
గాంధీ భవన్ లో జరిగిన ప్రెస్ మీట్ లో మహేశ్కుమార్గౌడ్మాట్లాడుతూ.. ‘సీఎం రేవంత్ రెడ్డి ఉండగా మళ్లీ కొత్త ముఖ్యమంత్రి ప్రస్తావన ఎందుకు వస్తుంది? తెలంగాణ ప్రజల నమ్మకానికి అనుగుణంగా మేం ప్రజా పాలన అందిస్తున్నం. బీజేపీలో మహేశ్వర్ రెడ్డికి గౌరవం లేదు. ఆయనకు అక్కడ కనీసం సీటు కూడా లేదు. కిషన్ రెడ్డికి, మహేశ్వర్ రెడ్డికి పచ్చి గడ్డి వేస్తే భగ్గుమంటుందని అంటారు. పక్క పార్టీల గురించి మేం మాట్లాడం. కాంగ్రెస్ లో ఉన్న ప్రజాస్వామ్యం.. స్వేచ్ఛ వేరే పార్టీలో ఉండదు. ప్రధాని మోదీ ఇస్తానన్న సంక్షేమ పథకాలు.. ఉద్యోగాలు ఏవి..? సంక్షేమం అంటే కాంగ్రెస్ పార్టీ పేటెంట్. పీసీసీ తరుపున అన్ని పార్టీలను పిలిచి ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించి సలహాలు తీసుకుంటాం. కుల గణన సర్వే ఎక్కడ బ్రేక్ లేకుండా జరగాలి అనేదే ప్రభుత్వం ఆలోచన. కేసీఆర్ కి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే.. సమగ్ర కుటుంబ సర్వే రిపోర్ట్ ఎందుకు బయటపెట్టలేదు..?’ అని ప్రశ్నించారు.