ఇండోర్: మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జరుగుతున్న ‘సంవిధాన్ బచావ్’ ర్యాలీలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ స్వగ్రామం మౌ కంటోన్మెంట్లో ర్యాలీ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. అంబేద్కర్ను అవమానించిన అమిత్ షాపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో కులగణన చేస్తున్నామని, ఏయే ప్రాంతాల్లో ఏ కులం వారు ఎంత మంది ఉన్నారని ఈ కులగణన ద్వారా తెలుస్తుందని రాహుల్ వివరించారు. దేశంలో 90 శాతం మంది ప్రజలు పేదలు, దళితులు, బడుగు, బలహీనవర్గాలకు చెందిన వారున్నారని, ఓబీసీలకు రిజర్వేషన్లలో అన్యాయం జరుగుతుందని ఆయన చెప్పారు.
ALSO READ | ఒక పదవిలో.. ఒక వ్యక్తి మూడుసార్లకు మించి ఉండకూడదు : లోకేష్ సంచలన వ్యాఖ్యలు
మోదీ ప్రభుత్వం అంబేద్కర్ను అవమానిస్తుందని, దేశంలోని విద్యా వ్యవస్థలను భ్రష్టు పట్టించారని రాహుల్ మండిపడ్డారు. GST పేరుతో ప్రజలను లూటీ చేస్తున్నారని, కేంద్రంలోని బీజేపీ రాజ్యాంగ వ్యతిరేక విధానాలను అమలు చేస్తుందని ఆయన విమర్శించారు. దేశంలో పేదల డబ్బును ప్రభుత్వం దోచుకుంటుందని ఎన్డీయే ప్రభుత్వంపై రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు.