నస్పూర్, వెలుగు : సింగరేణి గని కార్మికుల సమస్యలు తెలుసుకునేందుకు కాంగ్రెస్అగ్ర నేత రాహుల్ గాంధీ వారితో ప్రత్యేక సమావేశం కానున్నారని ఐఎన్టీయూసీ లీడర్లు తెలిపారు. మంగళవారం నస్పూర్ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల19న రామగుండంకు వస్తున్న రాహుల్ గాంధీ గని కార్మికుల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారం కోసం ప్రయత్నాలు చేస్తారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ 9 ఏండ్ల పాలనలో ఉద్యోగులకు చేసిందేమీ లేదని.. 30శాతం ఇన్కమ్ టాక్స్, 12 శాతం సీఎం పీఎఫ్, 7శాతం పెన్షన్ కోసం కట్ చేస్తుంటే కార్మికుల జీవనం ఎలా సాగుతుందని ప్రశ్నించారు.
కాకా వెంకటస్వామి కృషితో మొదలైన పెన్షన్.. ఇప్పటికీ అంతే కోనసాగుతుందని తెలిపారు. కాంట్రాక్ట్ కార్మికులకు సరైన జీతాలు అందడం లేదని, కోల్ ఇండియాలో అమలవుతున్న జీఓలు ఇక్కడ ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలన్నారు. సింగరేణి సంస్థ నుంచి డీఎంఎఫ్టీ, సీఎస్ఆర్ నిధులు తీసుకుంటున్న ప్రభుత్వం గని కార్మికులను పట్టించుకోవడం లేదని ఫైర్అయ్యారు. లీడర్లు శంకర్ రావు, కలవేణ శ్యామ్, స్వామి, సమ్ము రాజయ్య, రవి, వెంకటేశ్, శ్రీనివాస్, మహేందర్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.