ఇవాళ( నవంబర్ 5)హైదరాబాద్​కు రాహుల్ గాంధీ

ఇవాళ( నవంబర్ 5)హైదరాబాద్​కు రాహుల్ గాంధీ
  • బోయిన్​పల్లిలోని గాంధీ ఐడియాలాజీ సెంటర్​లో మీటింగ్​
  • కులగణనపై చర్చ..400 మందితో ఇంటరాక్షన్​
  • ఇందులో 200 మంది పార్టీ నేతలు..200 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల నేతలు
  • కుల గణన అమలుపై  సలహాలు, సూచనలు తీసుకోనున్న కాంగ్రెస్ అగ్రనేత

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ మంగళవారం సాయంత్రం హైదరాబాద్​కు రానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 6 నుంచి తెలంగాణలో ప్రారంభించనున్న కులగణనపై ప్రజలు, మేధావులు, వివిధ సామాజిక వర్గాల వారి సలహాలు, సూచనలు స్వీకరించేందుకు ఆయన ఇక్కడకు వస్తున్నారు. పీసీసీ ఆధ్వర్యంలో బోయిన్ పల్లిలోని గాంధీ ఐడియాలాజీ సెంటర్​లో నిర్వహిస్తున్న మీటింగ్​లో రాహుల్​ పాల్గొంటారు. సాయంత్రం 5.30 గంటల నుంచి 6.30 గంటల వరకు ఈ సమావేశం కొనసాగనున్నది. రాహుల్​గాంధీతో ఇంటరాక్షన్​కు 4 వందల మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు. 

ఇందులో  200 మంది పార్టీ వివిధ స్థాయి నేతలు కాగా.. వీరిలో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, వివిధ రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్లు, డీసీసీ అధ్యక్షులు ఉన్నారు.  మరో 200 మందిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారితో పాటు రిటైర్డ్ జడ్జిలు, ప్రొఫెసర్లు, కవులు, కళాకారులు, మేధావులు ఉంటారు.  కాగా, పీసీసీ చీఫ్ గా మహేశ్ కుమార్ గౌడ్ నియమితులైన తర్వాత రాష్ట్రానికి రాహుల్ మొదటిసారి వస్తుండడంతో..  ఘన స్వాగతం పలికేందుకు పార్టీ నేతలు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.

 బేగంపేట్ విమానాశ్రయం నుంచి బోయిన్ పల్లి వరకు రాహుల్ కాన్వాయి వెళ్లనున్న రూట్లలో  భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లు, తోరణాలు కట్టారు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆధ్వర్యంలో 500 ల మందితో బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. హైదరాబాద్ జిల్లా ఇన్​చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్​ సోమవారం సాయంత్రం గాంధీ భవన్ లో సిటీ కాంగ్రెస్ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఇందులో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఇతర నేతలు పాల్గొన్నారు. 

కుల గణనపై నేతల అభిప్రాయంతోపాటు సిటీకి రాహుల్ వస్తున్నందున స్వాగత ఏర్పాట్లపై చర్చించారు. రాహుల్ సమావేశం కానున్న బోయిన్ పల్లిలోని గాంధీ ఐడియాలాజీ సెంటర్​లో  విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. సోమవారం సాయంత్రం ఐడియాలజీ సెంటర్​ను మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్  సందర్శించి, ఏర్పాట్లను పరిశీలించారు. భద్రతాపరమైన ఏర్పాట్లపై పోలీసు అధికారులతో చర్చించారు. 

మీడియాకు నో ఎంట్రీ

రాహుల్ గాంధీ పాల్గొననున్న ఈ మీటింగ్ కు మీడియాకు అనుమతి లేదు. ఈ ప్రోగ్రామ్ కు సంబంధించిన లైవ్ సిగ్నల్​లింక్ ను పీసీసీ తరఫున మీడియాకు అందుబాటులో ఉంచుతామని గాంధీ భవన్ వర్గాలు వెల్లడించాయి.

రాహుల్​ పర్యటన షెడ్యూల్​ ఇదే..

రాహుల్​గాంధీ మంగళవారం సాయంత్రం 4.45 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.  5 గంటలకు అక్కడి నుంచి రోడ్డు మార్గం గుండా బయలుదేరి 5.20 గంటలకు బోయిన్ పల్లిలోని గాంధీ ఐడియాలాజీ సెంటర్ కు చేరుకోనున్నారు. సాయంత్రం 5. 30 గంటలకు ప్రారంభం కానున్న సమావేశం సాయంత్రం 6. 30 గంటల వరకు కొనసాగనున్నది. సరిగ్గా గంట పాటు కొనసాగనున్న ఈ మీటింగ్ అనంతరం ఆయన తిరిగి 7. 10 గంటలకు రోడ్డు మార్గం గుండా బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. ఆ తర్వాత రాహుల్​ తిరిగి ఢిల్లీకి పయనం కానున్నారు.