న్యూఢిల్లీ: లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సేల్స్ మెన్ గా మారారు. మంగళవారం ఢిల్లీలోని భోగల్ ఏరియాలో ఉన్న ఓ కిరాణషాపులో దాదాపు మూడు గంటల పాటు పనిచేశారు. కస్టమర్లకు కెచప్, బిస్కెట్లు, చాక్లెట్లు తదితర వస్తువులు అమ్మారు. కిరాణా షాపుల ఓనర్లకు, కస్టమర్లకు కలిగే ఇబ్బందులను తెలుసుకున్నారు. వేగంగా వృద్ధి చెందుతున్న క్విక్ కామర్స్ బిజినెస్ కారణంగా వేలాది కిరాణా షాపులు మూతపడుతుండటం ఆందోళన కలిగించే విషయమని పేర్కొంటూ రాహుల్ గాంధీ కిరాణషాప్ ఎక్స్‌పీరియన్స్ తో కూడిన ఓ వీడియోను 'ఎక్స్'లో షేర్ చేశారు.
అందులో కస్టమర్లకు వస్తువులను అమ్ముతూ..పెరుగుతున్న ధరల వల్ల ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చిరు వ్యాపారులు పడుతున్న కష్టాలపై ఆరా తీశారు. దుకాణదారులు, కస్టమర్లు కూడా తమ కష్టాలను రాహుల్‌తో పంచుకున్నారు. చిన్న వ్యాపారులు జీఎస్టీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వ్యాట్ నుంచి నాలుగు రెట్ల పన్ను వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద పెద్ద క్విక్ కామర్స్ సంస్థలతో నష్టపోతున్నామని చెప్పారు.