కరీంనగర్​కు జాతీయ నేతలు..ఇవాళ కరీంనగర్‌‌‌‌కు రాహుల్..

కరీంనగర్​కు జాతీయ నేతలు..ఇవాళ కరీంనగర్‌‌‌‌కు రాహుల్..
  • రేపు వేములవాడకు పీఎం మోదీ
  • ఇయ్యాల్టి సభకు హాజరుకానున్న సీఎం రేవంత్ 
  • ప్రచారానికి మిగిలింది ఐదు రోజులే

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. మరో ఐదు రోజుల్లో ప్రచారానికి తెరపడనుండడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. కార్యకర్తల్లో జోష్ నింపేందుకు, ఓటర్లను తమ వైపు మళ్లించుకునేందుకు  జాతీయ నాయకులు కరీంనగర్ ప్రచారానికి రాబోతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు తరఫున ప్రచారం చేసేందుకు ఈ నెల 9న రావాల్సిన ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ.. కొన్ని కారణాల వల్ల ముందే మంగళవారం నిర్వహించే సభకు హాజరుకానున్నట్లు డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ వెల్లడించారు. ఆయనతోపాటు సీఎం రేవంత్ రెడ్డి ఈ సభకు హాజరుకాబోతున్నారు. ఇప్పటికే  జమ్మికుంట, సిరిసిల్లలో నిర్వహించిన కాంగ్రెస్ సభలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరైన విషయం తెలిసిందే. 

కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్.. 

ఎస్సార్ఆర్ కాలేజీ గ్రౌండ్ లో నిర్వహించే జనజాతర సభకు సుమారు 50 వేల మందిని తరలించేందుకు కాంగ్రెస్ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు.  కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యే ఈ సభ నిర్వహణ సమయంలో వర్షం పడినా ఇబ్బంది కలగకుండా వాటర్ ప్రూఫ్ టెంట్లు వేయిస్తున్నారు. సభ ఏర్పాట్లను ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, పీసీసీ కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్ సోమవారం పరిశీలించారు. వేసవికావడంతో సభకు వచ్చేజనానికి మంచినీరు, మజ్జిగను తగినంత సప్లై చేయాలని సభ బాధ్యులకు సూచించారు. 

రేపు వేములవాడకు ప్రధాని మోదీ.. 

కరీంనగర్ బీజేపీ అభ్యర్థి  బండి సంజయ్ కుమార్ తరఫున ప్రచారానికి వేములవాడకు బుధవారం ప్రధాని మోదీ రానున్నారు. ఉదయం 10 గంటలకు రాజన్నను దర్శించుకుని అనంతరం వేములవాడలో జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.