రాహుల్​ గాంధీ డబుల్​ ధమాకా

రాహుల్​ గాంధీ డబుల్​ ధమాకా

న్యూఢిల్లీ: కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​గాంధీ పోటీచేసిన రెండు చోట్లా భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. యూపీలోని రాయ్​బరేలీ​, కేరళలోని వయనాడ్​లో 6లక్షల పైచిలుకు ఓట్లతో జయకేతనం ఎగురవేశారు. తొలిసారి బరిలో నిలిచిన  రాయ్​బరేలీలో రోరింగ్​ విక్టరీ నమోదు చేశారు. దాదాపు 4 లక్షల ఓట్ల మెజార్టీ (3,90,030)తో విన్​ అయ్యారు. 2019లో తల్లి సోనియాగాంధీ కంటే డబుల్​ మెజార్టీ సాధించారు. ఇక్కడ మొత్తం 6,87,649 ఓట్లతో రాహుల్​ గెలుపొందగా, బీజేపీకి చెందిన దినేశ్​ప్రతాప్​సింగ్​ 2,97,619 ఓట్లతో రెండోస్థానంలో, బహుజన్​ సమాజ్​ పార్టీ (బీఎస్పీ)కి చెందిన ఠాకూర్​ ప్రసాద్​ యాదవ్​ 21,624 ఓట్లతో మూడోస్థానంలో నిలిచారు. 

తల్లిని మించిన తనయుడు 

సోనియాగాంధీ 2004 నుంచి వరుసగా 4 సార్లు రాయ్‌‌బరేలీ నుంచి ప్రాతినిధ్యం వహించారు. 2019 ఎన్నికల్లో  దినేశ్​ ప్రతాప్​సింగ్​పై 1.67లక్షల ఓట్ల మెజార్టీతో ఆమె గెలుపొందారు. అయితే, రాజస్థాన్‌‌నుంచి రాజ్యసభకు ఎన్నికైన సోనియాగాంధీ.. రాయ్​బరేలీలో ఈ సారి తన స్థానంలో కొడుకు రాహుల్​గాంధీని బరిలో నిలిపారు. తల్లి సోనియా పెట్టుకున్న ఆశను వమ్ము చేయకుండా రాహుల్​ ఈ స్థానంలో ఆమెకంటే డబుల్​ మెజార్టీతో ఘన విజయం సాధించారు. 2019 లోక్‌‌సభ ఎన్నికల్లో రాహుల్  అమేథీ నుంచి పోటీ చేసినా ఓటమి పాలుకాగా, వయనాడ్‌‌ నుంచి ఎంపీగా గెలుపొందారు.  

వయనాడ్​లోనూ గెలుపు

వయనాడ్​లోనూ రాహుల్​గాంధీ గ్రాండ్​ విక్టరీ సాధించారు.  సీపీఎంకు చెందిన అన్నే రాజాపై 3,64,422 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రాహుల్​కు మొత్తం 6,47,445 ఓట్లు రాగా, అన్నే రాజా 2,83,023 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. బీజేపీకి చెందిన కే సురేంద్రన్​ 1,41,045 ఓట్లతో మూడోస్థానానికి పరిమితమయ్యారు. 2019 లోక్‌‌సభ ఎన్నికల్లో వయనాడ్‌‌ నుంచి బరిలోకి దిగిన రాహుల్‌‌, సమీప అభ్యర్థి పీపీ సునీర్‌‌ (సీపీఐ)పై 4.31 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.