న్యూఢిల్లీ: హర్యానాలో ఈసారి కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని, భారీ మెజార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పిన ఎగ్జిట్ పోల్ సర్వేలన్నీ తుస్సుమన్నాయి. రాహుల్ గాంధీ చేసిన ‘జిలేబీ’ ప్రచారం, జాట్ల ఓట్లే తమను గెలిపిస్తాయనుకున్న కాంగ్రెస్ అంచనాలు తలకిందులయ్యాయి. ప్రజలు ఆఖరికి కమలం పార్టీకే పట్టం కట్టారు. ప్రస్తుతం బీజేపీ నేతలు మాత్రం జిలేబీలు పంచుకుని సంబురాలు చేసుకుంటున్నరు.
జిలేబీ కథేందంటే..
రాహుల్ గాంధీయే మొదట జిలేబీ ప్రస్తావన తెచ్చారు. హర్యానాలోని గొహనా ప్రాంతంలో మాథురామ్ జిలేబీ చాలా ఫేమస్. అక్కడ ప్రచారం టైంలో రాహుల్ రెండు జిలేబీ పెట్టెలను చూపిస్తూ.. మోదీ చేసిన డీమానిటైజేషన్ కారణంగా మాథురామ్ జిలేబీ వ్యాపారం దెబ్బతిన్నదని, వీటిని దేశవ్యాప్తంగా సప్లయ్ చేయాలని, దాంతో వేలాది మందికి ఉపాధి దొరుకుతుందని చెప్పారు. ఇదే విషయాన్ని లోక్‌సభలోనూ రాహుల్ ప్రస్తావించారు.
ఆపై, లోక్‌సభ ఎన్నికలప్పుడు అదే ప్రాంతంలో ప్రధాని మోదీ ప్రచారానికి పోయినప్పుడు మాట్లాడుతూ.. ‘‘కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఐదేండ్లలో ఐదుగురు ప్రధానులు మారుతారు, పీఎం పోస్టేమైనా మాథురామ్ జిలేబీనా?’’ అని సెటైర్ వేశారు. ఇక మంగళవారం హర్యానాలో కౌంటింగ్ ప్రారంభమయ్యాక కాంగ్రెస్ ఆధిక్యం కనబర్చింది. దీంతో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పార్టీ ఆఫీస్‌లలో జిలేబీలు పంచుకుని సంబురాలు చేసుకున్నారు.
ఆపై బీజేపీ ముందంజలోకి వచ్చి మ్యాజిక్ ఫిగర్‌ను దాటింది. దీంతో బీజేపీ వాళ్లు కూడా కాంగ్రెస్‌కు కౌంటర్‌గా జిలేబీలు పంచుకుని సంబురాలు చేసుకుంటున్నారు. ఎన్నికలకు ముందు నుంచి నోరూరించిన కాంగ్రెస్ జిలేబీ కాస్తా బీజేపీవాళ్ల నోట్లో పడిందంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.