న్యూఢిల్లీ: అనేక మంది మేధావుల ఆలోచనలకు ప్రతిరూపమే రాజ్యాంగమని.. అన్ని మతాల దేవుళ్ల బోధనలే అందులో ఉంటాయని కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల ఆధారంగా దేశంలోని ప్రజలు వివిధ రకాల సిద్ధాంతాలు ఫాలో అవుతారన్నారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా ఉభయ సభల్లో రాజ్యాంగంపై చర్చ నిర్వహించారు. శనివారం (డిసెంబర్ 14) లోక్ సభలో రాజ్యాంగంపై నిర్వహించిన చర్చలో రాహుల్ గాంధీ పాల్గొని ప్రసంగించారు.
దేశంలో రాజ్యాంగానికి బదులు బీజేపీ మనుస్మృతి చట్టాన్ని నడుపుతోందని విమర్శించారు. దేశంలో మనుస్మృతికి, రాజ్యాంగానికి మధ్య ఫైట్ జరుగుతోందని.. రాజ్యాంగ రక్షకులు, రాజ్యాంగ వ్యతిరేకులకు మధ్య పోరాటం జరగుతోందని బీజేపీపై విమర్శలు గుప్పించారు. బీజేపీ తమ విధానాలతో దేశాన్ని మళ్లీ వెనక్కి తీసుకెళ్లాలని చూస్తోందని విమర్శించారు. కుల వివక్షపైన రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. మహాభారత కాలం నుంచే కుల వివిక్ష ఉందన్నారు.
ద్రోణుడి విగ్రహాన్ని గురువుగా భావించి ఏకలవ్యుడు విద్య నేర్చుకున్నాడు.. కానీ ఏకలవ్యుడు తక్కువ కులం కావడంతో గురుదక్షిణగా ద్రోణుడు ఏకలవ్యుడి బొటన వేలు అడిగాడని గుర్తు చేశారు. నేడు దేశంలో అనేకమంది యువతది ఏకలవ్యుడి పరిస్థితేనని రాహుల్ పేర్కొన్నారు. ఏకలవ్యుడి లాగానే వేలాడి యువకులు కష్టపడి విద్య నేర్చుకుంటున్నారు.. కానీ పేపర్ లీకేజీలతో యువత కష్టం బూడిదలో పోసిన పన్నీరు అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి అన్నం పెట్టే రైతులను పైన బీజేపీ వివక్ష చూపిస్తోందని.. ఇవాళ కూడా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులపై లాఠీ చార్జ్ జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ALSO READ | మళ్లీ ధన్‌ఖడ్ వర్సెస్ ఖర్గే: రాజ్యసభలో చైర్మన్, ప్రతిపక్ష నేత మధ్య కొనసాగిన వాగ్వాదం
మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కేవలం కార్పొరేట్లకే మద్దతు తెలుపుతోందని ఆరోపించారు. ఏకస్వామ్యం ఉండాలని రాజ్యాంగంలో ఎక్కడా లేదని విమర్శించారు. హథ్రాస్ లో ఆరేళ్ల బాలిక అత్యాచారానికి గురైంది. కొన్ని రోజుల క్రితం నేను హథ్రాస్‌కు వెళ్లాను.. అత్యాచారానికి పాల్పడిన నిందితులు స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారు.. అది చూసి బాధిత కుటుంబ సభ్యులు తట్టుకోలేక పోతున్నారని బీజేపీ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు న్యాయం చేయాల్సింది పోయి.. నిందితులకు అండగా నిలుస్తారని ధ్వజమెత్తారు.