కాంగ్రెస్ పవర్‎లోకొస్తే జమ్మూ కాశ్మీర్‎కు రాష్ట్ర హోదా: రాహుల్ గాంధీ

కాంగ్రెస్ పవర్‎లోకొస్తే జమ్మూ కాశ్మీర్‎కు రాష్ట్ర హోదా: రాహుల్ గాంధీ

శ్రీనగర్: బీజేపీ ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్‎ను అన్యాయంగా కేంద్ర పాలిత ప్రాంతం చేసిందని, కాంగ్రెస్ సర్కార్ ఏర్పడితే జమ్మూ కాశ్మీర్‎కు రాష్ట్ర హోదా తెస్తామని కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ పక్షనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత ప్రచారంలో ఇవాళ (సెప్టెంబర్ 23) రాహుల్ గాంధీ పాల్గొన్నారు. 

పూంచ్ జిల్లాలోని సురన్‌కోట్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో  ఆయన మాట్లాడుతూ.. జమ్మూ కాశ్మీర్‎తో పాటు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో బీజేపీ, ఆర్ఎస్ఎస్ ద్వేషం, హింసను వ్యాప్తి చేస్తున్నాయని.. వారికి కేవలం ద్వేషాన్ని వ్యాప్తి చేయడం మాత్రమే  తెలుసని విమర్శించారు. బీజేపీ, ఆర్ఆర్ఎస్ విద్వేష రాజకీయాలను ప్రేమతో ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మోడీని మానసికంగా ఓడించామన్నారు.

 మోడీ పదేళ్ల పాలనలో ఆయన బిలియనీర్ స్నేహితులే బాగుపడ్డారని.. పేద ప్రజలకు జరిగిందేమి లేదని ఫైర్ అయ్యారు. ఎన్డీఏ ప్రభుత్వ ప్రజావ్యతిరేక చట్టాలను అడ్డుకుంటామని పేర్కొన్నారు. బీజేపీ పదేళ్ల హయాంలో జమ్మూ యువతకు ఎలాంటి ఉపాధి లభించలేదని.. కాంగ్రెస్ పవర్‎లోకి వస్తే యువతకు ఉపాధి కల్పించడంతో పాటు మహిళలను అదుకుంటామని హామీ ఇచ్చారు.